బడి బయటే బాల్యం!
ABN, Publish Date - Jul 18 , 2025 | 12:00 AM
బడి ఈడు పిల్లలు బడిలోనే ఉండాలని ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. దీనిపై అధికారులు, ఉపాధ్యాయులకు ప్రత్యేక మార్గదర్శకాలను జారీ చేసింది.
డ్రాపౌట్లుగా గిరిజన విద్యార్థులు
పట్టించుకోని అధికారులు
పర్యవేక్షించని పాఠశాల సిబ్బంది
కొండపోడు పనుల్లో చిన్నారులు
ప్రభుత్వ ఆశయానికి తూట్లు
సీతంపేట రూరల్, జూలై 17(ఆంధ్రజ్యోతి): బడి ఈడు పిల్లలు బడిలోనే ఉండాలని ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. దీనిపై అధికారులు, ఉపాధ్యాయులకు ప్రత్యేక మార్గదర్శకాలను జారీ చేసింది. అయితే సీతంపేట ఐటీడీఏ పరిధిలో మాత్రం భిన్న పరిస్థితి నెలకొంది. ఇక్కడ డ్రాపౌట్ల సంఖ్య రోజురోజుకూ గణనీయంగా పెరుగుతోంది. సొంత ఊరు, ఇళ్లు, తల్లిదండ్రులను విడిచి ఉండలేక గిరిజన చిన్నారులు పాఠశాలల్లో చేర్పించిన నెలల వ్యవధిలోనే తిరిగి ఇంటిదారి పడుతున్నారు. కొండపోడు వ్యవసాయం, అటవీ ఉత్పత్తుల సేకరణ వంటి పనులు చేసుకుంటూ వారి తల్లిదండ్రులకు చేదోడువాదోడుగా ఉంటున్నారు. అయితే ఇటువంటి విద్యార్థులను గుర్తించి తిరిగి బడిలో చేర్పించాల్సిన అధికారులు, పాఠశాల సిబ్బంది ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదు. వారి తల్లిదండ్రులకు చదువు ప్రాముఖ్యత ఇతరత్రా అంశాలపై అవగాహన కల్పించడం లేదు. దీంతో ప్రభుత్వ లక్ష్యం నెరవేరడం లేదు.
ఇదీ పరిస్థితి..
గిరిజన విద్య బలోపేతానికి ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తోంది. ప్రధానంగా సన్నబియ్యంతో మధ్యాహ్న భోజనం, పిల్లల చదువు భారం కాకుడదనే ఉద్దేశంతో ‘తల్లికి వందనం’ పథకం, ఉచితంగా నోట్, టెక్స్ట్ బుక్స్‌తో పాటు బ్యాగ్, యూనిఫాంలను అందజేస్తోంది. అయితే క్షేత్రస్థాయిలో నెలకొన్న పరిస్థితులు, అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఎంతోమంది డ్రాపౌట్లుగా మారుతున్నారు. సీతంపేట ఐటీడీఏకు కూత వేటు దూరంలో ఉన్న గ్రామాల్లోనే అత్యధికంగా బడిబయట పిల్లలున్నట్లు తెలుస్తోంది.
ఐటీడీఏలో ఓ ప్రత్యేక విభాగం
డ్రాపౌట్ల నివారణకు గాను అప్పట్లో సీతంపేట ఐటీడీఏ పరిధిలో ఓ ప్రత్యేక విభాగం(ప్రాజెక్ట్ మోనటరింగ్ రీసోర్స్ సెంటర్) ఏర్పాటు చేశారు. ఈ విభాగంలో డిప్యూటీ ఈవో, ఏఎంవో, సీఎంవో, జీసీడీవో, ఏఏఎంవో వంటి అధికారులు ఉన్నారు. ఉపాధ్యాయుల శిక్షణ, క్వాలిటీ ఎడ్యుకేషన్, డ్రాపౌట్ల నివారణ, విద్యార్థుల విద్యాప్రమాణాల స్థాయి, బాలికల సంరక్షణ, కమ్యూనిటీ మొబలైజేషన్ తదితర అంశాలను ఎప్పటికప్పుడు వారు పర్యవేక్షించాల్సి ఉంది. కానీ సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో ఆదిశగా చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
గతంలో డ్రాపౌట్లు ఇలా...
గత వైసీపీ ప్రభుత్వం గిరిజన విద్యపై దృష్టి సారించలేదు. విద్యా ప్రమాణాల మెరుగుకు ఎటువంటి చర్యలు తీసుకోలేదు. దీంతో ఎంతోమంది గిరిజన బిడ్డలు చదువుకు దూరమయ్యారు. 2023-2024లో పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం జిల్లాల పరిఽధిలో వెల్ఫేర్ అసిస్టెంట్ల ద్వారా చేపట్టిన డ్రాపౌట్ల సర్వేలో 154మందిని గుర్తించారు. వారిలో 72మందిని పాఠశాలల్లో చేర్పించారు. మిగిలిన 82 మంది ఓవర్ ఏజ్, మైగ్రేట్ అయిన వారిగా గుర్తించారు. ఇక పాలకొండ నియోజకవర్గం పరిధిలో చూస్తే.. భామిని 21, సీతంపేట 31, పాలకొండ 2, వీరఘట్టంలోఆరుగురు డ్రాపౌట్లుగా ఉన్నట్లు గతంలో నిర్వహించిన సర్వే నివేదికలు చెబుతున్నాయి. అయితే గడిచిన (2024-25)ఏడాదికి సంబంధించి డ్రాపౌట్ల సర్వేను ఇంత వరకు చేపట్టలేదు. ఐటీడీఏ పరిధిలో పాఠశాలల వారీగా విద్యార్థుల సంఖ్య, లాంగ్ ఆప్సెంట్లను ఒక్కసారి పరిశీలిస్తే డ్రాపౌట్లుగా ఎంత మంది బడి బయట ఉన్నారో ఇట్టే తెలిసిపోతుంది.
డిప్యూటీ ఈవో ఏమన్నారంటే..
సీతంపేట ఐటీడీఏ పరిధిలో బడి బయట ఉన్న పిల్లల కోసం ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తాం. వారంతా బడిలోనే ఉండేలా చర్యలు తీసుకుంటాం. పాఠశాలల వారీగా జాబితాలు తెప్పించి.. గ్రామస్థాయిలో పరిశీలిస్తాం.’ అని డిప్యూటీ ఈవో జి.రామ్మోహనరావు తెలిపారు.
Updated Date - Jul 18 , 2025 | 12:00 AM