Strong Winds ఈదురుగాలులతో అస్తవ్యస్తం
ABN, Publish Date - May 16 , 2025 | 11:21 PM
Chaos Caused by Strong Winds జిల్లాలో పలుచోట్ల శుక్రవారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. ఈదురుగాలులతో అనేక ప్రాంతాల్లో చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకూలాయి. ఉరుములు... మెరుపులు... పిడుగుల శబ్దాలకు జనం బెంబేలెత్తిపోయారు.
గాలులకు నేలకూలిన చెట్లు, విద్యుత్ స్తంభాలు
ఉరుములు.. మెరుపులతో జనం బెంబేలు
పిడుగుపాటుకు గురై ఇద్దరి మృతి
పంటలను కాపాడుకునే పనిలో రైతులు
సీతంపేట రూరల్/భామిని/పాలకొండ, మే16(ఆంధ్రజ్యోతి): జిల్లాలో పలుచోట్ల శుక్రవారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. ఈదురుగాలులతో అనేక ప్రాంతాల్లో చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకూలాయి. ఉరుములు... మెరుపులు... పిడుగుల శబ్దాలకు జనం బెంబేలెత్తిపోయారు. మధ్యాహ్నం వరకూ ఎండ ఠారెత్తించింది. ఉక్కపోతతో ప్రజలు అల్లాడిపోయారు. సాయంత్రానికి ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. దట్టంగా మేఘాలు కమ్ముకున్నాయి. ఆ తర్వాత జోరువాన కురిసింది. సీతంపేట ఏజెన్సీ ప్రాంతం పూర్తిగా చల్లబడింది. దీంతో గిరిజనులు ఉక్కపోత నుంచి కాస్త ఉపశమనం పొందారు. భామిని మండలంలో ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. సొలికిరి సమీపంలో 33 కేవీ వైర్లపై చెట్లు పడడంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. అంబేడ్కర్ గురుకులంలో చెట్టు, విద్యుత్ స్తంభం నేలకూలాయి. దీనిపై ట్రాన్స్‌కో ఈఈ శ్రీనివాసరావును వివరణ కోరగా.. సొలికిరి, బాలేరు వద్ద భారీ చెట్టు నేలకూలడంతో వైర్లు తెగిపోయాయన్నారు. విద్యుత్ సరఫరాకు కొంత సమయం పడుతుందన్నారు. అకాల వర్షాల కారణంగా మరోవైపు రైతులు వరి, మొక్కజొన్న, నువ్వుపంటలను కాపాడుకునేందుకు అష్టకష్టాలు పడుతున్నారు.
పిడుగుపాటుకు గిరిజన యువకుడి మృతి
సీతంపేట మండలం గిరిశిఖర గ్రామం జగతిపల్లి బూర్జగూడకి చెందిన సవర చంద్రరావు(31) పిడుగుపాటుకు గురై మృతిచెందాడు. ఎస్‌ఐ వై.అమ్మనరావు తెలిపిన వివరాల ప్రకారం.. జగతిపల్లి బూర్జగూడ గ్రామానికి చెందిన చంద్రరావు పాలకొండ ఆర్టీసీ డిపోలోని బంక్‌లో సేల్స్‌మెన్‌గా పనిచేస్తున్నాడు. అప్పుడప్పుడూ వ్యవసాయ పనులు కూడా చేస్తుంటాడు. కాగా పదేళ్ల కిందటే తండ్రి మృతి చెందడంతో తల్లి సొట్టమ్మ వద్దే ఉంటున్నాడు. నాలుగురు అన్నదమ్ముల్లో ఆఖరి వాడైన చంద్రరావు శుక్రవారం సాయంత్రం దేవనాపురం గ్రామ సమీపంలోని పొలంలో పనులకు వెళ్లాడు. అయితే ఆ సమీపంలో పిడుగు పడడంతో గిరిజన యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. కుటుంబసభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. కాగా చంద్రరావు అకాల మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
పాలకొండలో మహిళ ..
ఈదురుగాలులతో కూడిన వర్షం పడడంతో నగర పంచాయతీ పరిధి ఎన్‌ఎస్‌ఎన్ కాలనీకి చెందిన జోగ లక్ష్మి (45) ఇంటి డాబాపై ఉన్న దుస్తులు తీసేందుకు వెళ్లింది. అయితే ఆ సమీపంలోని చెట్టుపై పిడుగుపడంది. దీంతో స్పృహ తప్పిన ఆమెను స్థానికులు గుర్తించి సపర్యలు చేశారు. కొన ఊపిరిలో ఉన్న లక్ష్మిని కుటుంబ సభ్యులు పాలకొండ ఏరియా ఆసుపత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. ఆమె భర్త ఎర్రంనాయుడు చిరు వ్యాపారం చేసుకొని జీవనం సాగిస్తున్నారు. మృతురాలికి ఇద్దరు పిల్లలున్నారు. లక్ష్మి మృతిని కుటుంబ సభ్యులు జీర్ణించుకోలేకపోతున్నారు.
పిడుగులు పడేటప్పుడు అప్రమత్తం: కలెక్టర్
పార్వతీపురం, మే 16 (ఆంధ్రజ్యోతి): పిడుగులు పడేటప్పుడు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వెంటనే సురక్షిత ప్రాంతాలకు చేరుకోవాలని కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ శుక్రవారం ఒక ప్రకటనలో సూచించారు. వాతావరణ మార్పులపై రాష్ట్ర విపత్తుల సంస్థ ఎప్పటికప్పుడు సమాచారాన్ని ఫోన్ ద్వారా కూడా అందిస్తుందన్నారు. ఉరుములు, మెరుపులతో వర్షం పడేటప్పుడు చెట్లు, టవర్లు, పోల్స్, పొలాలు, బహిరంగ ప్రదేశాల్లో ఉండరాదని పేర్కొన్నారు. సురక్షిత భవనాల్లో ఆశ్రయం పొందాలన్నారు. ఎండల తీవ్రత దృష్ట్యా ప్రజలు తలకు టోపీ పెట్టుకోవాలని, చేతి రుమాలు ఉంచుకోవాలని సూచించారు. ఎక్కువవగా మజ్జి,గ గ్లూకోజ్, నిమ్మరసం, కొబ్బరినీరు, ఓఆర్‌ఎస్ తాగాలన్నారు.
Updated Date - May 16 , 2025 | 11:21 PM