అధికారులూ పనితీరు మార్చుకోండి
ABN, Publish Date - May 13 , 2025 | 12:21 AM
Change the performance of officers జిల్లాలో అభివృద్ధి కార్యక్రమాలపై కొందరు అధికారులు కనీసం సమాచారం ఇవ్వడం లేదని, ఇకనైనా పనితీరు మార్చుకోవాలని, తప్పు చేస్తే విడిచిపెట్టేదే లేదని ఇన్‌చార్జి మంత్రి వంగలపూడి అనిత హెచ్చరించారు. కలెక్టరేట్ సమావేశమందిరంలో సోమవారం సాయంత్రం ఆమె అధ్యక్షతన జరిగిన జిల్లా అభివృద్ధి సమీక్ష(డీఆర్‌సీ) సమావేశం ఆద్యంతం వాడీవేడిగా సాగింది.
అధికారులూ పనితీరు మార్చుకోండి
జిల్లా వెనుకబాటులో కాదు.. ముందుకు తీసుకువెళ్లాలి
తప్పుచేస్తే విడిచిపెట్టేదే లేదు
గ్రామాల అభివృద్ధికి తీర్మానం ఇవ్వాలి
బదిలీపై వెళ్లిన సివిల్ సప్లయ్ డీఎంపై విచారించండి
డ్వామా ఏపీవోను సరెండర్ చేయండి
ఇక నుంచి ప్రతి నెలా డీఆర్‌సీ
జిల్లా అభివృద్ధి సమీక్ష సమావేశంలో ఇన్‌చార్జి మంత్రి అనిత
విజయనగరం/కలెక్టరేట్, మే 12 (ఆంరఽధజ్యోతి):
జిల్లాలో అభివృద్ధి కార్యక్రమాలపై కొందరు అధికారులు కనీసం సమాచారం ఇవ్వడం లేదని, ఇకనైనా పనితీరు మార్చుకోవాలని, తప్పు చేస్తే విడిచిపెట్టేదే లేదని ఇన్‌చార్జి మంత్రి వంగలపూడి అనిత హెచ్చరించారు. కలెక్టరేట్ సమావేశమందిరంలో సోమవారం సాయంత్రం ఆమె అధ్యక్షతన జరిగిన జిల్లా అభివృద్ధి సమీక్ష(డీఆర్‌సీ) సమావేశం ఆద్యంతం వాడీవేడిగా సాగింది. అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులే అధికారుల పనితీరుపై అసహనం వ్యక్తం చేశారు. అధికారులు ఇలా ఉంటే అభివృద్ధి ఎలా జరుగుతుందని మంత్రి ప్రశ్నించారు. ఇకనైనా పనితీరు మార్చుకోవాలని సుతిమెత్తగా హెచ్చరించారు. తొలుత వివిధ ప్రజాప్రతినిధులు పలు సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకంనాగమాధవి, ఎమ్మెల్సీ రఘురాజులు మాట్లాడుతూ, అర్‌అండ్‌బీ రోడ్లు ఆక్రమించుకున్నా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని ప్రస్తావించారు. మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ, అక్రమించుకున్న స్థలాలకు పంచాయతీ అధికారుల అనుమతులు, విద్యుత్ అధికారులు విద్యుత్ కనెక్షన్లు మంజూరు చేస్తున్నారని చెప్పారు. దీనిపై ఇన్‌చార్జి మంత్రి అనిత స్పందిస్తూ ఆక్రమణలపై వెంటనే విచారణ చేయాలని ఆదేశించారు. నిర్లక్ష్యంగా ఉంటే సరైంది కాదని హెచ్చరించారు. గ్రామీణ మంచినీటి సరఫరా పథకానికి సంబంధించి ఎస్‌ఈ కవిత మాట్లాడుతూ, జిల్లాలో తాగునీటి సమస్య లేదని, అందరికీ నీటిని సక్రమంగా అందిస్తున్నామన్నారు. అంతలో ఎమ్మెల్యే నాగమాధవి మాట్లాడుతూ, నెల్లిమర్ల నియోజకవర్గంలో తాగునీటి సమస్య అధికంగా ఉందని, అధికారులు పట్టించుకోవడం లేదని చెప్పారు. కలెక్టరు అంబేడ్కర్ మాట్లాడుతూ, 5నుంచి 6 మీటర్ల లోతులో భూగర్భ జలాలు అందుబాటులో ఉన్నాయని, తాగునీటికి ఎటువంటి ఇబ్బంది లేదని చెబుతుండగా విజయనగరం ఎమ్మెల్యే అదితి గజపతిరాజు మాట్లాడుతూ, ఈ లెక్కలు సరైనవి కావని, జిల్లా కేంద్రంలోనే 300 మీటర్ల లోతు వరకూ నీరు రావడం లేదన్నారు. విజయనగరానికి సరఫరా అవుతున్న తాగునీటి పథకానికి సంబంధించి నాగావళి నుంచి గడిగెడ్డకు వచ్చే దారిలో జంగిల్ అధికంగా ఉన్నా, ఇరిగేషన్ అధికారులు తొలగించడం లేదని ఎమ్మెల్యే అదితి సమావేశం దృష్టికి తీసుకువచ్చారు.
ఫ జిల్లాలోని మాల్స్ అన్నీ తనిఖీ చేసి ఎన్‌ఓసీ వుందా? లేదా ఆడిట్ చేయాలని అగ్నిమాపక శాఖాధికారులకు మంత్రి అనిత ఆదేశించారు. నెలరోజుల్లో నివేదికలు అందించాలన్నారు. గత వైసీపీ హయాంలో నిబంధనలకు విరుద్ధంగా మాల్స్ అనుమతులు ఇచ్చారని, సెల్ఫ్ డిక్లరేషన్ వుంటే ఎన్‌ఓసీ ఇచ్చారని, ఇటువంటి వాటిపై విచారణ చేయాలని ఆదేశించారు. తూర్పుకాపు కార్పొరేషన్ చైర్‌పర్సన్ పాలవలస యశస్వి మాట్లాడుతూ, ఓ మహిళ ఆత్మహత్య చేసుకుంటే ఇంత వరకూ ఎఫ్‌ఐఆర్ నమోదు చేయలేదని, అలాగే జిల్లాలో జైలు ఏర్పాటు చేయాలని మంత్రిని కోరారు. దీనిపై స్పందించిన కలెక్టర్ అంబేడ్కర్ మాట్లాడుతూ, జైలు గురించి స్థల పరిశీలన చేస్తామన్నారు. వ్యవసాయశాఖకు సంబఽంధించి జేడీ రామారావు వివరిస్తుండగా బొబ్బిలి ఎమ్మెల్యే బేబీనాయన కలుగచేసుకుని జిల్లాలోని ఎరువుల దుకాణాల్లో రైతులకు అక్కరలేనివి అంటడగడుతున్నారని, ఆ వ్యాపారులపై చర్యలు తీసుకోవాలన్నారు. మంత్రి అనిత స్పందిస్తూ ఇలాంటి వారి లైసెన్స్‌లు క్యాన్స్‌ల్ చేయ్యాలని ఆదేశించారు. ఈ సందర్భంగా జడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు మాట్లాడుతూ, రానున్న ఖరీఫ్‌లో ఎటువంటి విత్తనాలు సరఫరా చేస్తున్నారు? సివిల్ సప్లయ్ అధికారులతో చర్చించారా? అన్న అంశాలను పరిశీలించాలన్నారు.
ఫ అనంతరం జిల్లా పంచాయతీరాజ్ అధికారి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ, పారిశుధ్య సమస్య లేకుండా చర్యలు చేపడుతున్నామని వివరిస్తుండగా, నెల్లిమర్ల ఎమ్మెల్యే మాధవి దీనిపై స్పందించారు. గతంలో చెత్త ఊరు చివరలో ఉండేదని ఇప్పుడు చెత్త సంపద కేంద్రాలు వద్దే వుంటోందని తీరు మారలేదంటూ అసహనం వ్యక్తంచేశారు. అనంతరం మంత్రి అనిత జోక్యం చేసుకుని వచ్చే డీఆర్‌సీలో ఈ సమస్య పునరావృతం కాకూడదని, అధికారులు గ్రామాల్లో పర్యటించాలన్నారు. ఇక నుంచి గ్రామాలకు తానే నేరుగా వెళ్లి పారిశుధ్య నిర్వహణను పరిశీలిస్తానన్నారు. గ్రామ అభివృద్ధికి స్థానిక సర్పంచ్‌లు కాని, మండల ప్రజాప్రతినిధులు కాని తీర్మానాలు ఇవ్వకపోతే నోటీసు ఇచ్చి తదుపరి చర్యలు తీసుకునేలా చూడాలని కలెక్టరు అంబేడ్కర్‌కి సూచించారు.
డీఎంపై విచారించండి
గతంలో సివిల్ సప్లయ్ డీఎంగా పనిచేసి ఇక్కడి నుంచి వెళ్లిన మీనాకుమారిపై విజిలెన్స్ అధికారులతో విచారణ చేయించాలని కలెక్టరు అంబేడ్కర్‌కు మంత్రి అనిత అదేశించారు. కోట్లాది రూపాయల అక్రమాలకు పాల్పడ్డారని, మిల్లర్లకు అనుకూలంగా పనిచేశారని చెప్పారు. ఆమె వల్ల రైతులు కూడా నష్టపోయారని, అటువంటి అధికారులను ప్రభుత్వం ఉపేక్షించదన్నారు.
ఫ అనంతరం మంత్రి అనిత ప్రత్యేకంగా మాట్లాడుతూ, విజయనగరం జిల్లా వెనుకబడింది కాదని, అభివృద్ధి చెందిన జిల్లాగా తయారు చేయడమే లక్ష్యమని, విజన్ 2047 ప్లాన్ ప్రకారంగా అభివృద్ధి చేసేందుకు కృషి చేయాలని మంత్రి అనిత కోరారు. అందుబాటులో వున్న వనరులను సక్రమంగా వినియోగించుకుని తలసరి ఆదాయాన్ని పెంచాలన్నారు. అగ్నిప్రమాదాల నివారణకు రెవెన్యూ, పోలీసు, అగ్నిమాపక సిబ్బంది సంయుక్తంగా ఫైర్ ఆడిట్‌ను నిర్వహించి, నెల రోజుల నివేదిక అందజేయాలన్నారు. రెవెన్యూకి సంబంధించిన అంశాలపై చర్చించేందుకు ప్రత్యేక సమావేశం నిర్వహిస్తామన్నారు. కార్యక్రమంలో పార్లమెంటు సభ్యుడు కలిశెట్టి అప్పలనాయుడు, ఎమ్మెల్సీ పి.సూర్యనారాయణరాజు, ఎమ్మెల్యేలు కోండ్రు మురళీ, కోళ్ల లలిత కుమారి, ఎస్పీ వకుల్ జిందాల్, జాయింట్ కలెక్టరు సేతు మాధవన్, డీఆర్‌ఓ శ్రీనివాసమూర్తి, సీపీఓ బాలాజీ తదితరులు పాల్గొన్నారు.
Updated Date - May 13 , 2025 | 12:21 AM