Can't give a house.. Can't get money! ఇల్లు ఇవ్వలే.. సొమ్మూ రాలే!
ABN, Publish Date - Apr 17 , 2025 | 11:37 PM
Can't give a house.. Can't get money! జిల్లా అంతటా కొన్నేళ్ల కిందటే టిడ్కో ఇళ్ల నిర్మాణం నిలిచిపోయింది. వైసీపీ ప్రభుత్వం వచ్చాక ఒక్క అడుగూ పడలేదు. మంజూరైన వారికి నేటికీ ఇళ్లు దక్కలేదు. మధ్యలో రద్దు చేసిన వారికి డిపాజిట్ కూడా వాపస్ చేయలేదు. మొదట్లో అప్పు చేసి డిపాజిట్ చేసిన పేదలంతా తీవ్ర నిరాశలో ఉన్నారు. ఎనిమిదేళ్ల కిందట నిర్మాణం చేపట్టి మధ్యలో వదిలేయడంతో ఇళ్లూ పాడవుతున్నాయి. మళ్లీ పనులు చేపడ్తారా? ఇళ్లు అప్పగిస్తారా? డబ్బులైనా వాపస్ ఇస్తారా? అనేదానిపై ఇప్పటికీ స్పష్టత లేదు.
ఇల్లు ఇవ్వలే.. సొమ్మూ రాలే!
టిడ్కో గృహాలపై లబ్ధిదారుల ఆవేదన
ఏళ్లు గడుస్తున్నా రద్దయిన వాటికి డబ్బు ఇవ్వని వైనం
నత్తనడకన ఇళ్ల నిర్మాణం.. పాడవుతున్న భవనాలు
రాష్ట్ర ప్రభుత్వ స్పందన కోసం ఆశగా ఎదురుచూపు
జిల్లా అంతటా కొన్నేళ్ల కిందటే టిడ్కో ఇళ్ల నిర్మాణం నిలిచిపోయింది. వైసీపీ ప్రభుత్వం వచ్చాక ఒక్క అడుగూ పడలేదు. మంజూరైన వారికి నేటికీ ఇళ్లు దక్కలేదు. మధ్యలో రద్దు చేసిన వారికి డిపాజిట్ కూడా వాపస్ చేయలేదు. మొదట్లో అప్పు చేసి డిపాజిట్ చేసిన పేదలంతా తీవ్ర నిరాశలో ఉన్నారు. ఎనిమిదేళ్ల కిందట నిర్మాణం చేపట్టి మధ్యలో వదిలేయడంతో ఇళ్లూ పాడవుతున్నాయి. మళ్లీ పనులు చేపడ్తారా? ఇళ్లు అప్పగిస్తారా? డబ్బులైనా వాపస్ ఇస్తారా? అనేదానిపై ఇప్పటికీ స్పష్టత లేదు.
నెల్లిమర్ల, ఏప్రిల్ 17(ఆంధ్రజ్యోతి): నెల్లిమర్ల నగర పంచాయతీలో చేపట్టిన టిడ్కో ఇళ్ల నిర్మాణం పూర్తికాలేదు. ఎక్కడి పనులు అక్కడే ఆగిపోయాయి. ఏళ్లుగా వదిలేయడంతో భవనాలు పాడవుతున్నాయి. ఇళ్లు మంజూరైన లబ్ధిదారులు ఎన్నో ఆశలతో ఎదురుచూస్తున్నారు. మరోవైపు లక్షలాది రూపాయల డిపాజిట్ చెల్లించిన తరువాత ఇళ్ల రద్దు చేశామంటూ వైసీపీ హయాంలో అధికారులు కొందరు లబ్ధిదారులకు చెప్పారు. దీంతో తమకు ఇళ్లు లేకపోయినా చెల్లించిన డిపాజిట్ సొమ్ము తిరిగి వాసప్ చేయాలంటూ వారు కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరిగారు. పట్టించుకునే నాథుడే లేకపోయాడు. వెరసి అటు ఇళ్లు మంజూరైన లబ్ధిదారులు, ఇళ్లు మంజూరై తరువాత రద్దయిన బాధితులు కూటమి ప్రభుత్వ స్పందన కోసం కళ్లలో ఒత్తులు వేసుకుని ఎదురుచూస్తున్నారు.
- పట్టణాల్లో ఉన్న పేదలకు జీ+3లో ఇళ్ల సముదాయం (టిడ్కో) కడతామంటూ 2017-18 ఆర్థిక సంవత్సరంలో అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ క్రమంలో నెల్లిమర్ల నగర పంచాయతీలో సుమారు 4500 మంది పేదలు ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్నారు. అధికారులు విచారించిన తరువాత వారిలో 2252 మందిని ఇళ్ల మంజూరుకు అర్హులుగా గుర్తించారు. అయితే టిడ్కో ఇళ్ల నిర్మాణం పూర్తయిన తరువాత రూ.500ల డిపాజిట్‌దారులు ఎలాంటి రుణం చెల్లించాల్సిన అవసరం లేదని, రూ.50వేల డిపాజిట్‌దారులు రూ.3.10లక్షలు, లక్ష రూపాయల డిపాజిట్‌దారులు రూ.3.65లక్షలు రుణాన్ని బ్యాంకులకు చెల్లించాల్సి ఉంటుందని అధికారులు స్పష్టం చేశారు. దీంతో చాలా మంది దరఖాస్తుదారులు వెనుకడుగు వేశారు. బ్యాంకు రుణం చెల్లించేందుకు అంగీకరించిన వారిలో 816 మంది తుది అర్హులుగా అధికారులు జాబితా తయారు చేశారు. తర్వాత వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో టిడ్కో ఇళ్ల నిర్మాణం ఒక్క అడుగు కూడా ముందుకు సాగలేదు.
ఎక్కడి పనులు అక్కడే
టిడ్కో ఇళ్ల నిర్మాణ పనులు జోరుగా సాగుతున్న సమయంలో ఎన్నికలు వచ్చాయి. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తరువాత టిడ్కో ఇళ్ల నిర్మాణానికి ఫుల్‌స్టాప్ పడింది. యూనిట్ ధర తగ్గిస్తామని చెప్పి నిర్మాణానికి నిధులు విడుదల చేయకుండా నిలిపివేసింది. అప్పటి నుంచి పనులు ఆగిపోయాయి. నేటికీ ఇళ్ల నిర్మాణాల్లో ఎలాంటి ప్రగతి లేదు. సగంలో వదిలేయడంతో కొన్ని ఇళ్లు పాడవుతున్నాయి. కాగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో తెలుగుదేశం పార్టీ హయాంలో ప్రారంభమైన ఈ టిడ్కో గృహాలు ఇప్పుడైనా నిర్మాణ పనులు పూర్తిచేసుకొని ప్రారంభానికి సిద్ధమవుతాయని లబ్ధిదారులు ఆశాభావంతో ఉన్నారు.
144 మంది ఇళ్లు రద్దు
నెల్లిమర్ల నగర పంచాయతీలో మంజూరైన 816 మందిలో అప్పట్లోనే 288 మంది రూ.500లు డిపాజిట్‌ను, 48 మంది రూ.50వేల డిపాజిట్‌ను, 240 మంది లక్ష రూపాయల డిపాజిట్‌ను డిమాండ్ డ్రాఫ్ట్‌ల రూపంలో నెల్లిమర్ల కమిషనర్ పేరిట చెల్లించారు. ఆ తరువాత కథ అడ్డం తిరిగింది. లక్ష రూపాయలు డిపాజిట్ చెల్లించిన 48 మందికి, రూ.500లు చెల్లించి 96 మందికి ఇళ్ల మంజూరును రద్దు చేస్తున్నామంటూ అధికారులు ఆకస్మికంగా ప్రటించారు. లబ్ధిదారులు ఎంత మొత్తుకున్నా స్పష్టమైన కారణాలు వివరించలేదు. అయితే తమకు ఇల్లు లేకపోయినా తమ డిపాజిట్ సొమ్ము వాపస్ చేయాలంటూ వారంతా కార్యాలయం చుట్టూ తిరిగారు. అయినా ప్రయోజనం లేకపోయింది.
మంజూరైన వారికీ ప్రతికూలమే
ఇళ్ల నిర్మాణం కొనసాగుతున్న 576 మందిలో కూడా ప్రభుత్వం కొంత డిపాజిట్ సొమ్మును వాపస్ చేయాల్సి ఉంది. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తరువాత రూ.500ల డిపాజిట్‌ను రూపాయికి, రూ.50వేల డిపాజిట్‌ను రూ.25వేలుగా, లక్ష రూపాయల డిపాజిట్‌ను రూ.50వేలుగా కుదిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వుల ప్రకారం ఇళ్ల నిర్మాణం జరుగుతున్న లబ్ధిదారులకు సైతం వారు చెల్లించిన డిపాజిట్‌లో సగం సొమ్మును ప్రభుత్వం వాపస్ చేయాల్సి ఉంది. ఈ లెక్కన నెల్లిమర్ల నగర పంచాయతీలోని 240 మందికి ప్రభుత్వం రూ.210 కోట్లు తిరిగి ఇవ్వాలి. ప్రభుత్వ నిర్ణయం కోసం బాధితులు, లబ్ధిదారులు ఎదురుచూస్తున్నారు.
Updated Date - Apr 17 , 2025 | 11:37 PM