Bhogapuram is a new place! కొంగొత్తగా భోగాపురం!
ABN, Publish Date - Jul 20 , 2025 | 11:40 PM
Bhogapuram is a new place!
కొంగొత్తగా భోగాపురం!
ఎయిర్‌పోర్టు చుట్టూ భారీ ప్రాజెక్టులు
నక్షత్ర హోటళ్లు, ఎంఎస్‌ఎంఈ పార్కులు రాక
పర్యాటకంగానూ అభివృద్ధి
భోగాపురం, జూలై20(ఆంధ్రజ్యోతి):
భోగాపురం చుట్టుపక్కల ప్రాంతాలు రాబోయే రోజుల్లో ఊహాతీతంగా మారబోతున్నాయి. ఎయిర్‌పోర్టు పూర్తయ్యే సమయానికి అనేక మార్పులు జరగబోతున్నాయి. కొత్త కొత్త ప్రాజెక్టులు, పరిశ్రమలు కొలువుదీరబోతున్నాయి. మరో ఏడాదిన్నారలో భోగాపురం అంతర్జాతీయ (అల్లూరి సీతారామరాజు) విమానాశ్రయం పూర్తికాబోతోంది. ఆ దిశగా నిర్మాణం వేగంగా జరుగుతోంది. ముఖ్యమంత్రి నుంచి కేంద్రమంత్రి వరకు నిత్యం పర్యవేక్షణ, పరిశీలన జరుగుతోంది. దీని ఆధారంగా భారీ ప్రాజెక్టులు ఏర్పాటు కానున్నాయి. ఫైవ్‌స్టార్ హోటళ్లు, టౌన్‌షిప్‌లు, ఎంఎస్‌ఎంఈ పార్కులు, లాజిస్టిక్ హబ్ వస్తున్నాయి. విశాఖ జిల్లా భీమిలి మండలం అన్నవరం, భోగాపురం మండలం దిబ్బలపాలెం తీరంలో 40 ఎకరాల్లో ఒబెరాయ్ హోటల్ నిర్మాణం చురుగ్గా సాగుతోంది. పూసపాటిరేగ మండలం చింతపల్లి తీరంలో కాటేజీల పునఃనిర్మాణం జరగనుంది. అలాగే తీర ప్రాంతాన్ని ప్రభుత్వం పర్యాటకప్రాంతంగా తీర్చిదిద్దడానికి చర్యలు తీసుకుంటోంది. మరోవైపు తీరం వెంబడి విశాఖ నుంచి భీమిలి వరకు ఉన్న బీచ్ కారిడార్‌ను భోగాపురం ఎయిర్‌పోర్టు మీదుగా శ్రీకుళం జిల్లా సంతబొమ్మాలి మండలం మూలపేట పోర్టు వరకు నిర్మించనున్నారు. ఓ పక్క జాతీయ రహదారి 16, మరో పక్క బీచ్‌కారిడార్, భోగాపురం అంతర్జాతీయ గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్టు, మూలపేట ఓడరేవుల కారణంగా మరెన్నో పరిశ్రమలు రానున్నాయి. ఐటీ హబ్‌లు కూడా ఏర్పాటు చేస్తామంటున్నారు. అనేక కనక్టవిటీ రహదారులు నిర్మించనున్నారు. దీంతో భోగాపురం చుట్టు పక్కల ప్రాంతాలు మరో నాలుగైదు ఏళ్లలో పూర్తిగా రూపురేఖలు మారనున్నాయి. పెట్టుబడిదారులు వస్తుండడం, ప్రభుత్వం అభివృద్ధికి చర్యలు చేపట్టడంతో స్థానిక నిరుద్యోగుల్లో ఆశలు పెరిగాయి. భవిత బాగుంటుందని భావిస్తున్నారు. అర్హత ప్రకారం ఉద్యోగ అవకాశాలు కల్పించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
Updated Date - Jul 20 , 2025 | 11:40 PM