Any clarity on transfers? బదిలీలపై స్పష్టత ఏదీ?
ABN, Publish Date - May 31 , 2025 | 11:08 PM
Any clarity on transfers? ప్రభుత్వం మే 16 నుంచి జూన్ 2వరకు వివిధ శాఖల్లో పని చేస్తున్న ఉద్యోగుల బదిలీలకు అనుమతిచ్చింది. పంచాయతీరాజ్, గ్రామాణాభివృద్ధి శాఖ మార్గదర్శకాలను అనుసరించి జిల్లాలో పని చేస్తున్న పంచాయతీ కార్యదర్శులు (గ్రేడ్-1 నుంచి గ్రేడ్-6 వరకు)కు మాత్రం బదిలీలు చేపట్టేందుకు ఐదేళ్లు సర్వీస్ పూర్తి చేసిన వారితో పాటు సొంత మండలంలో పనిచేస్తున్న కార్యదర్శుల సర్వీస్ వివరాలతో పాటు ఖాళీలను నివేదిక రూపంలో పంపించాలి. - జిల్లా పంచాయతీ అధికారి టి.వెంకటేశ్వరరావు నుంచి మండల ప్రజా పరిషత్ అధికారులకు అందిన లేఖ
బదిలీలపై స్పష్టత ఏదీ?
సచివాలయ ఉద్యోగుల్లో అయోమయం
హేతుబద్ధీకరణలో భాగంగా ఉండకపోవచ్చునంటున్న వైనం
జిల్లాలో 3,705 మంది ఉద్యోగులు మిగిలినట్లు గణాంకాలు
గ్రేడ్-6 పంచాయతీ కార్యదర్శుల వరకు స్థానంచలనం
మిగిలిన శాఖలకు చెందిన వారిలో ఉత్కంఠ
బదిలీలకు ఇంకా రెండు రోజులే గడువు
శృంగవరపుకోట, మే 31(ఆంధ్రజ్యోతి):
ప్రభుత్వం మే 16 నుంచి జూన్ 2వరకు వివిధ శాఖల్లో పని చేస్తున్న ఉద్యోగుల బదిలీలకు అనుమతిచ్చింది. పంచాయతీరాజ్, గ్రామాణాభివృద్ధి శాఖ మార్గదర్శకాలను అనుసరించి జిల్లాలో పని చేస్తున్న పంచాయతీ కార్యదర్శులు (గ్రేడ్-1 నుంచి గ్రేడ్-6 వరకు)కు మాత్రం బదిలీలు చేపట్టేందుకు ఐదేళ్లు సర్వీస్ పూర్తి చేసిన వారితో పాటు సొంత మండలంలో పనిచేస్తున్న కార్యదర్శుల సర్వీస్ వివరాలతో పాటు ఖాళీలను నివేదిక రూపంలో పంపించాలి.
- జిల్లా పంచాయతీ అధికారి టి.వెంకటేశ్వరరావు నుంచి మండల ప్రజా పరిషత్ అధికారులకు అందిన లేఖ
ఇదే ఇప్పుడు గ్రామ, వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్న మిగిలిన ఉద్యోగుల్లో అయోమయానికి దారితీసింది. గ్రేడ్-1 నుంచి గ్రేడ్-6 పంచాయతీ కార్యదర్శులంతా గ్రామ, వార్డు సచివాలయాల్లోనే పని చేస్తున్నారు. గ్రేడ్-1 నుంచి గ్రేడ్-4 కార్యదర్శులు ఏపీపీఎస్సీ, ఇతర డీఎస్సీ పరీక్షల ద్వారా ఎంపికయ్యారు. గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ అవిర్భవానికి ముందు నుంచి పంచాయతీరాజ్ శాఖలో పని చేస్తున్నారు. గ్రేడ్-5 పంచాయతీ కార్యదర్శులు, గ్రేడ్-6 కార్యదర్శులు (డిజిటల్ అసిస్టెంట్ పేరుతో) గ్రామ వార్డు సచివాలయాలకు నిర్వహించిన డీఎస్సీ ద్వారా మిగిలిన శాఖల ఉద్యోగుల వలే ఎంపికయ్యారు. అయితే గ్రేడ్-1 నుంచి గ్రేడ్-5 పంచాయతీ కార్యదర్శులందరికీ జీతాల చెల్లింపునకు ఎంపీడీవోలు డీడీవోలుగా వ్యవహరిస్తున్నారు. కాగా గ్రామ వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్నప్పటికీ వీరిని పంచాయతీరాజ్ శాఖకు చెందిన ఉద్యోగులుగా బదిలీలకు అవకాశం ఇచ్చారని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో మిగిలిన శాఖల ఉద్యోగులు కూడా బదిలీలు ఉంటాయని ఆయా శాఖల మార్గదర్శకాల కోసం ఎదురుచూస్తున్నారు. అయితే మండల ప్రజాపరిషత్ అధికారులు గ్రేడ్-1నుంచిగ్రేడ్6 పంచాయతీ కార్యదర్శుల వివరాలనే సేకరి స్తున్నారు. ఐదేళ్లు సర్వీసు పూర్తి చేసుకున్నవారు, సొంత మండలాల్లో పని చేస్తున్నవారితో పాటు ఐదేళ్లు సర్వీస్ పూర్తికాకపోయినా రిక్వస్ట్ బదిలీలకు దరఖాస్తు చేసుకున్నారు.
- గ్రామ, వార్డు సచివాలయాల్లో పంచాయతీ కార్యదర్శులతో పాటు రెవెన్యూ శాఖకు చెందిన గ్రామ రెవెన్యూ అధికారి, సర్వేశాఖకు చెందిన సర్వే అసిస్టెంట్, విద్యాశాఖకు చెందిన విద్యాసంక్షేమ అధికారి, వ్యవసాయ, ఉద్యాన శాఖకు చెందిన వ్యవసాయ, ఉద్యాన అసిస్టెంట్లు, వైద్య ఆరోగ్యశాఖకు చెందిన ఏఎన్‌ఎం, పోలీస్ శాఖకు చెందిన మహిళ పోలీస్, విద్యుత్ శాఖకు చెందిన ఎనర్జీ అసిస్టెంట్, పంచాయతీరాజ్ శాఖకు చెందిన ఇంజనీరింగ్ అసిస్టెంట్‌లు పని చేస్తున్నారు. పంచాయతీరాజ్ శాఖ తప్ప మిగిలిన వారెవరికీ బదిలీలకు సంబంధించిన మార్గదర్శకాలు ఇంతవరకు వెలువడలేదు. బదిలీలకు ప్రభుత్వం ఇచ్చిన గడువు రెండు రోజులు మాత్రమే ఉంది.
హేతుబద్ధీకరణ ఎప్పుడో?
గ్రామ, వార్డు సచివాలయాలను ప్రస్తుత ప్రభుత్వం హేతుబద్ధీకరిస్తోంది. సాధారణ, తప్పనిసరి (టెక్నికల్) ఉద్యోగాల పేరుతో రెండు భాగాలు చేసింది. జనాభా ప్రాతిపదికన ఏ,బీ,సీలుగా విభజించిన గ్రామ, వార్డు సచివాలయాల్లో ఈ ఉద్యోగులను నియమిస్తుంది. ఈ మేరకు ప్రభుత్వం సచివాలయాల వారీగా ఉండాల్సిన ఉద్యోగుల జాబితాను విడుదల చేసింది. దీంతో చాలా వరకు గ్రామ వార్డు సచివాలయాల్లో ఉద్యోగులు తగ్గుతున్నారు. ఇప్పటి వరకు దాదాపు 11 మంది వరకు పని చేస్తున్న గ్రామ వార్డు సచివాలయాల్లో హేతుబద్ధీకరణలో భాగంగా 6 నుంచి 10 మంది మాత్రమే ఉంటారు. ఒక సచివాలయంలో ఆరుగురు ఉద్యోగులు ఉంటే మరో సచివాలయంలో 8 మంది ఉద్యోగులు, ఇంకో సచివాలయంలో 10 మంది చొప్పున పనిచేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఈ తంతులోనూ తీవ్ర జాప్యం చోటుచేసుకుంటోంది. దీంతో ఏం చేయాలో తోచని స్థితిలో వారంతా ఉన్నారు.
మిగులు ఉద్యోగుల పరిస్థితి ఏంటో?
జిల్లాలో వున్న 626 గ్రామ, వార్డు సచివాలయాల్లో అన్ని శాఖలకు కలిపి 8,370 మంది ఉద్యోగులు ఉండాలి. ఇందులో 4,665 మంది ఉద్యోగులకు మాత్రమే విధులు అప్పగిస్తున్నారు. ఇంకా 3,705 మంది ఉద్యోగులు మిగులుతున్నారు. వీరికి ఏ భాద్యతులు అప్పగిస్తారన్న స్పష్టతను ప్రభుత్వం ఇంకా ఇవ్వలేదు. అయితే జిల్లాలో వున్న గ్రామ వార్డు సచివాలయాల్లో ప్రస్తుతం వివిద శాఖలకు చెందిన 5,774 మంది ఉద్యోగులు పని చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఈ విధంగానైనా 1109 మంది మిగులుతున్నారు. మిగులు ఉద్యోగులను సర్దుబాటు చేయకుండా బదిలీలను చేపడితే ఇబ్బందులు ఎదరవుతాయన్న అభిప్రాయంతో వీరి బదిలీలపై ఏ నిర్ణయం తీసుకోలేనట్లు తెలుస్తోంది.
ఏఏన్‌ఎంలు మారుతారా?
గ్రామ, వార్డు సచివాలయాల్లో పని చేస్తున్న వైద్య ఆరోగ్య. శాఖకు చెందిన ఏఎన్‌ఎంలను మాత్రం హేతుబద్ధీకరణలో తగ్గించలేదు. ప్రతి గ్రామ వార్డు సచివాలయంలోనూ వీరు పని చేసేలా చర్యలు తీసుకుంది. దీంతో వీరికి బదిలీలు వుంటాయని ప్రచారం జరుగుతోంది. రేపో, మాపో మార్గదర్శకాలను జారీ చేస్తుందని వైద్య ఆరోగ్యశాఖకు చెందిన అధికారులు, ఉద్యోగుల్లో చర్చ నడుస్తోంది. కానీ బదిలీలపై స్పష్టత లేదు.
Updated Date - May 31 , 2025 | 11:08 PM