మరో భూసేకరణ
ABN, Publish Date - Jul 25 , 2025 | 11:48 PM
మండలంలో మరో భూసేకరణకు రంగం సిద్ధమవుతోంది.
- హెచ్‌పీసీఎల్ పైప్‌లైన్ కోసం సేకరించనున్న భూములు
- సిద్ధమవుతున్న రెవెన్యూ శాఖ
- త్వరలో విడుదలకానున్న మార్గదర్శకాలు
- రైతుల్లో ఆందోళన
కొత్తవలస, జూలై 25 (ఆంధ్రజ్యోతి): మండలంలో మరో భూసేకరణకు రంగం సిద్ధమవుతోంది. విశాఖపట్నం నుంచి ఛతీస్‌గఢ్ రాష్ట్రం రాయపూర్ వరకు ఏర్పాటు చేయనున్న హిందూస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్(హెచ్‌పీసీఎల్)పైప్‌లైన్‌కు సంబంధించి అవసరమైన భూమిని సేకరించేందుకు రెవెన్యూ అధికారులు సన్నద్ధమవుతున్నారు. దీనికోసం ఇప్పటికే హెచ్‌పీసీఎల్ ప్రతినిధులు జిల్లా కలెక్టర్‌తో సమావేశమైనట్టు సమాచారం. ఈ సంస్థకు విశాఖలో ఏడాదికి 8.3 మిలియన్ టన్నుల ఉత్పత్తి సామర్థ్యం కలిగిన రిఫైనరీ ఉంది. దీన్ని ప్రస్తుతం 15 మిలియన్ టన్నులకు ఆ సంస్థ విస్తరించింది. విశాఖ నుంచి రాయపూర్ వరకు పైప్‌లైన్‌ల ద్వారా పెట్రోల్, డీజిల్, ఇతర ఇంధనాలను సరఫరా చేయడానికి ప్రణాళికలను సిద్ధం చేసింది. ఇందుకు అవసరమైన భూమిని విశాఖపట్నం, విజయనగరం, పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం జిల్లాల్లో సేకరించాలని భావిస్తోంది. భూసేకరణ రూట్ మ్యాప్‌ను కూడా తయారు చేసి ఆ జిల్లాల కలెక్టర్లకు అందజేసింది. దీని ప్రకారం ఏ మండలాల్లో భూములను సేకరించాలనే విషయమై సంబంధిత తహసీల్దార్లకు త్వరలోనే ఆదేశాలు రానున్నట్టు తెలిసింది. ఇప్పటికే కొత్తవలస మండలంలో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్(ఐవోసీ)కు సంబంధించిన పైప్‌లైన్ ఉంది. దీంతో ఐవోసీ పైప్‌లైన్ పక్కనుంచే హెచ్‌పీసీఎల్ పైప్‌లైన్‌కు కూడా భూసేకరణ చేయాలని ఆ సంస్థ ప్రతినిధులు జిల్లా అధికారులను కోరినట్టు తెలిసింది. కాగా, భూ సేకరణపై త్వరలోనే మార్గదర్శకాలు వచ్చే అవకాశాలు ఉన్నాయని రెవెన్యూ అధికారులు చెబుతున్నారు. అవి వచ్చిన వెంటనే గ్రామ సభలు ఏర్పాటు చేసి భూ సేకరణ చేపడతామని అంటున్నారు.
165 కిలో మీటర్లు..
విశాఖపట్నం నుంచి ఛతీస్‌గఢ్ రాష్ట్రం రాయపూర్ వరకు 165 కిలో మీటర్ల పొడవున పైప్‌లైన్‌ను హెచ్‌పీసీఎల్ ఏర్పాటు చేయనుంది. ఈ మార్గంలో పంపింగ్, పిగ్గింగ్ స్టేషన్లు, వాల్వ్ స్టేషన్లు ఏర్పాటు చేయాల్సి ఉన్నందున ఒక్కొక్క ప్రాంతంలో 6 నుంచి 8 ఎకరాల వరకు భూసేకరణ చేపటాల్సి ఉంటుంది. ఇందుకోసం హెచ్‌పీసీఎల్ రూ.2,212 కోట్ల బడ్జెట్‌ను సిద్ధం చేసినట్టు సమాచారం. మూడేళ్లలోనే పైప్‌లైన్ పనులు పూర్తి చేయాలని సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది. భూ సేకరణకు సంబంధించి ఇప్పటికే ఓ కమిటీని ఏర్పాటు చేసింది. దీనికి జిల్లా కలెక్టర్ చైర్మన్‌గా ఉన్నారు. రైతులకు ఏ విధంగా నష్టపరిహారం చెల్లించాలి?, భూసేకరణ జరిగే ప్రాంతాల్లో భూముల ధరలు ఎలా ఉన్నాయి వంటి అంశాలను కమిటీ అధ్యయనం చేసింది. ఇప్పటికే తుది నివేదికను సిద్ధం చేసింది. గతంలో ఐవోసీ పైప్‌లైన్ కోసం సేకరించిన భూములకు సంబంధించి అక్కడ ఉన్న మార్కెట్ ధరలో నాల్గో వంతు మాత్రమే రైతులకు నష్టపరిహారంగా ఆ సంస్థ చెల్లించింది. పైప్‌లైన్ వేసిన భూముల్లో చెట్లు, తోటలు పెంచవద్దని, ఎలాంటి నిర్మాణాలు చేపట్టవద్దని చెప్పింది. పంటలు మాత్రమే పండించుకోవాలని ఐవోసీ సూచించింది. అందుకే రైతులకు తక్కువ నష్టపరిహారం చెల్లించింది. కానీ, హెచ్‌పీసీఎల్ మాత్రం సేకరించిన భూములను పూర్తిగా స్వాధీనం చేసుకోవాలని భావిస్తున్నట్టు తెలిసింది.
రైతుల్లో ఆందోళన
హెచ్‌పీసీఎల్ పైప్‌లైన్‌కు అధికారులు భూ సేకరణ చేపడతారని తెలియడంతో మండలంలోని సంతపాలెం, దెందేరు, గులివిందాడ, గనిశెట్టిపాలెం, చీపురువలస, చీడివలస, సుందరయ్యపేట, వియ్యంపేట, దేవాడ, వీరభద్రపురం తదితర గ్రామాలకు చెందిన రైతుల్లో ఆందోళన మొదలైంది. రెండేళ్ల కిందటే ఐవోసీ పైప్‌లైన్ కోసం తమ భూములు తీసుకున్నారని, మళ్లీ ఇప్పుడు హెచ్‌పీసీఎల్ పైప్‌లైన్ కోసం తమ భూములు తీసుకుంటారా? అని ప్రశ్నిస్తున్నారు. భూములు పూర్తిగా తీసుకుని పూర్తి నష్టపరిహారం చెల్లించాలని అంటున్నారు. సగం పరిహారం చెల్లించి ఆ భూముల్లో తోటలు పెంచుకోవద్దు, కట్టడాలు చేయవద్దు అంటే ఎలా అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Updated Date - Jul 25 , 2025 | 11:48 PM