దైన్యం.. పశువైద్యం
ABN, Publish Date - Jun 27 , 2025 | 12:07 AM
జిల్లాలో పశువైద్యం మెరుగుపడడం లేదు. మూగజీవాలకు వైద్యం అందని ద్రాక్షలా మారింది.
-వేధిస్తోన్న సిబ్బంది కొరత
- శిథిలావస్థలో భవనాలు
-మూగజీవాలకు అందని వైద్య సేవలు
- ఇబ్బందుల్లో పాడి రైతులు
- నేడు మంత్రి అచ్చెన్న రాక
పార్వతీపురం, జూన్ 26 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో పశువైద్యం మెరుగుపడడం లేదు. మూగజీవాలకు వైద్యం అందని ద్రాక్షలా మారింది. ఒకపక్క పశువైద్య సిబ్బంది కొరత.. మరోపక్క ఆస్పత్రుల్లో సరిపడ వసతులు లేక పశువులకు సరైన వైద్యం అందడం లేదు. కొన్నేళ్లుగా ఖాళీ పోస్టులను భర్తీ చేయడం లేదు. పశు వైద్యశాలలు సైతం శిథిలావస్థకు చేరుకున్నాయి. కొన్నిచోట్ల వైద్యులు లేక ఇన్‌చార్జిలే సేవలందిస్తున్నారు. దీంతో పాడి రైతులకు ఇబ్బందులు తప్పడం లేదు. గత వైసీపీ ప్రభుత్వం సంచార పశు వైద్యశాలలు పేరు చెప్పి.. ఉన్న సేవలను నిర్లక్ష్యం చేసింది. గ్రామీణ పశు వైద్యసేవలను పశుసంవర్థక శాఖ సహాయకులు, గోపాలమిత్రలతోనే గడిపేసింది. ప్రస్తుత కూటమి ప్రభుత్వంపైనే పాడి రైతులు ఆశలు పెట్టుకున్నారు. శుక్రవారం వ్యవసాయ, పశుసంవర్థక శాఖ మంత్రి అచ్చెన్నాయుడు జిల్లాకు వస్తున్నారు. జిల్లాలో పశువైద్యం మెరుగునకు ఆయన ఎలాంటి హామీ ఇస్తారోనని రైతులు ఆశగా ఎదురుచూస్తున్నారు.
జిల్లాలో పరిస్థితి..
జిల్లాలో 38 పశువైద్యాధికారులు ఉండాలి. కానీ, 18 మందే ఉన్నారు. 20 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. గరుగుబిల్లి, బగ్గందొరవలస, తుమరాడ, విశ్వనాథపురం, భామిని, బత్తిలి, తాళ్లబురిడి, మాదలంగి, గంగిరేగివలస, చిలకలపల్లి, సంబర, గుమ్మ, భద్రగిరి, ఎం.సింగుపురం, బిటివాడ, పూడి తదితర ప్రాంతాల్లో పశువైద్యాధికారుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. సీతంపేట మండలానికి చెందిన పశువైద్యాధికారులు సంతోష్, శంకరరావు భామిని మండలానికి ఇన్‌చార్జిలుగా ఉన్నారు. రెండు మండలాలకు వీరే దిక్కు కావడంతో పూర్తిస్థాయిలో వైద్యసేవలు అందించలేని పరిస్థితి నెలకొంది. పాలకొండ మండలం చిన్నమంగళాపురం పశువైద్య కేంద్రం వైద్యాధికారిగా సిద్ధార్థ విధులు నిర్వహిస్తున్నారు. మండలం మొత్తానికి ఆయన ఒక్కరే సేవలు అందిస్తున్నారు. ఆయనకు శ్రీకాకుళం జిల్లా కళింగపట్నం బదిలీ జరిగింది. ఆయన కూడా వెళ్లిపోతే ఈ మండలంలో పశువైద్యాధికారి ఉండని పరిస్థితి ఏర్పడనుంది. సాలూరు మండలం బాగువలస పశువైద్యాధికారి పొలందొర మక్కువ మండలానికి ఇన్‌చార్జిగా సేవలు అందిస్తున్నారు. బలిజిపేట మండలం బర్లి, చిలకలపల్లి కేంద్రాలకు పశువైద్యులు లేరు. ఈ రెండు పశువైద్యశాలలకు కూడా బలిజిపేట పశువైద్యుడు గణేష్ ఇన్‌చార్జిగా ఉంటూ మూగజీవాలకు వైద్యం అందిస్తున్నారు. కొమరాడ మండలం మాదలంగి, గంగిరాయివలసలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. ఈ రెండు చోట్ల పశువైద్యులు లేకపోవడంతో కొమరాడ వెటర్నరీ డాక్టర్ సత్యనారాయణ ఇన్‌చార్జిగా వ్యవహరిస్తున్నారు. ఈయనకు విజయనగరం జిల్లా వాడాడ బదిలీ జరిగింది. ఇతను కూడా వెళ్లిపోతే కొమరాడ మండలంలో పూర్తిగా పశువైద్యాధికారి ఉండని పరిస్థితి నెలకొంటుంది. బదిలీపై వెళ్తున్న వారి స్థానంలో కొత్త వైద్యులను నియమించాల్సి ఉంది. కానీ, జిల్లాలో మాత్రం కొత్తవారిని ఉన్నతాధికారులు నియమించలేదు. కొమరాడ, చిన్నమంగాపురం, పార్వతీపురం పశువైద్యులు సత్యనారాయణ, సిద్ధార్థ, శ్రీనివాసరావుకు ఇతర జిల్లాలకు బదిలీ జరిగినా వారి స్థానంలో కొత్తవారు రాలేదు.
దారుణంగా భవనాలు..
జిల్లాలోని పశువైద్యశాల భవనాల్లో చాలా వరకూ శిథిలావస్థకు చేరుకున్నాయి. అవి ఎప్పుడు కూలిపోతాయో తెలియదు. 24 పశువైద్యశాలల పరిస్థితి మరింత దారుణంగా ఉంది. సీతంపేట మండలం దోనుబాయి, పొల్ల గ్రామాల్లో పశువైద్యశాలలకు సొంత భవనాలు లేవు. వీరఘట్టం మండలం తూడి, పాలకొండ మండలం ఎం.సింగుపురం, తుమరాడ, చిన్నమంగళాపురం పశువైద్యశాలలు శిథిలావస్థలో ఉన్నాయి. పార్వతీపురం నియోజకవర్గంలోని నర్సిపురం, ఎంఆర్‌నగరం, సాలూరు నియోజకవర్గంలోని సంబర, కురుపాం నియోజకవర్గంలోని గరుగుబిల్లి, ఉల్లిభద్ర తదితర పశువైద్యశాలలు పూర్తిగా శిథిలావస్థకు చేరుకున్నాయి. ఈ భవనల్లోనే ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని పశువైద్యులు విధులు నిర్వహిస్తున్నారు. ఇప్పటికైనా కొత్త భవనాలు నిర్మించాలని కోరుతున్నారు.
మంత్రి అచ్చెన్నపైనే ఆశలు..
జిల్లా ఇన్‌చార్జి మంత్రి, వ్యవసాయ, పశుసంవర్థక శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు శుక్రవారం పార్వతీపురం మన్యం జిల్లాకు రానున్నారు. కలెక్టర్ కార్యాలయంలో జరిగే సుపరిపాలనలో తొలిఅడుగు సమావేశానికి ఆయన హాజరుకానున్నారు. పశువైద్య శాఖకు సంబంధించి సమస్యలు పరిష్కరిస్తారని, కొత్త వైద్యుల నియామకం, నూతన భవనాల నిర్మాణాలకు ఆదేశాలు జారీ చేస్తారని జిల్లా ప్రజలు ఆశిస్తున్నారు.
ఈ సమస్యలూ పరిష్కరించాలి..
జిల్లా కేంద్రంలో తాగునీటి సమస్య నెలకొంది. సీతంపేట, పార్వతీపురంలో చేపడుతున్న సూపర్‌స్పెషాలిటీ ఆసుప్రతుల భవనాల పనులు పూర్తి కాలేదు. సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించి ఆధునికీకరణ పనులు మధ్యలోనే నిలిచిపోయాయి. విద్యాశాఖ, గృహ నిర్మాణశాఖ, మత్స్యశాఖ తదితర శాఖలకు జిల్లా అధికారులు లేరు. జిల్లా పారిశ్రామికంగా అభివృద్ధి చెందేందుకు ప్రత్యేక అడుగులు పడడం లేదు. ఇటువంటి సమస్యలు ఎన్నో ఉన్నాయి. కూటమి ఏడాది పాలనలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించినప్పటికీ కొన్ని సమస్యలు జిల్లాలో ప్రజలను వెంటాడుతున్నాయి. దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించే విధంగా మంత్రి అచ్చెన్నాయుడు కృషి చేస్తారని జిల్లా ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
ఉన్నతాధికారులకు నివేదిక అందించాం
జిల్లాలో 20 పశువైద్యాధికారుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. సుమారు 24 భవనాలు శిథిలావస్థలో ఉన్నాయి. వీటిపై ఉన్నతాధికారులకు నివేదిక అందించాం. పాడి రైతులకు ఇబ్బందులు లేకుండా చూస్తున్నాం. ఉన్న సిబ్బందితోనే పశువులకు వైద్యం అందించేలా చర్యలు తీసుకుంటున్నాం.
-మన్మథరావు, జిల్లా పశువైద్యాధికారి, పార్వతీపురం
Updated Date - Jun 27 , 2025 | 12:07 AM