Agricultural 'aid' to development అభివృద్ధికి వ్యవ‘సాయం’
ABN, Publish Date - Apr 27 , 2025 | 12:08 AM
Agricultural 'aid' to development వ్యవసాయ రంగం ద్వారానే జిల్లాలో వృద్ధి రేటు పెంచగలం. ధాన్యాలు, పండ్లతోటల సాగు, పాడి పరిశ్రమ, మత్స్య సంపద, ఫారెస్టు అభివృద్ధి జరగాలి. ఇందుకు క్షేత్ర స్థాయిలో రోటీన్‌గా పని చేస్తే సరిపోదు. వినూత్నంగా ఆలోచించాలి. భూమినంతా వినియోగంలోకి తీసుకురావాలి.
అభివృద్ధికి వ్యవ‘సాయం’
15 శాతం కంటే ఎక్కువ వార్షిక వృద్ధి రేటు పెంచే దిశగా అడుగులు
అనుబంధ రంగాల ప్రగతికీ ప్రణాళికలు
క్షేత్ర స్థాయి ఉద్యోగులకు కలెక్టర్ దిశానిర్దేశం
జిల్లా వృద్ధికి వినూత్నంగా ఆలోచించాలని సూచన
వ్యవసాయ రంగం ద్వారానే జిల్లాలో వృద్ధి రేటు పెంచగలం. ధాన్యాలు, పండ్లతోటల సాగు, పాడి పరిశ్రమ, మత్స్య సంపద, ఫారెస్టు అభివృద్ధి జరగాలి. ఇందుకు క్షేత్ర స్థాయిలో రోటీన్‌గా పని చేస్తే సరిపోదు. వినూత్నంగా ఆలోచించాలి. భూమినంతా వినియోగంలోకి తీసుకురావాలి. సాగు దిగుబడులు పెరిగేలా చేయాలి. నాణ్యమైన పంట చేతికి వచ్చేలా ప్రయత్నించాలి. మల్టీబుల్ క్రాపింగ్( వివిధ రకాల పంటల సాగు), క్రాప్ డైవర్సన్ (మంట మార్పిడి) జరిగేలా రైతులకు అవగాహన కల్పించాలి. మీరంతా ఈ జిల్లాకు చెందిన ఉద్యోగులు. ఎక్కడ పనిచేసినా జిల్లా పరిధిలోనే ఉంటారు. మీ పనితీరు మీ ప్రాంత ప్రజలకు మెలు చేసేలా ఉండాలి. మొత్తం సమాచారం మీదగ్గర ఉండాలి. ఆదాయం ఎంతమేర పెంచగలరో ఆలోచించండి.
- ఎస్.కోట నియోజకవర్గ క్షేత్రస్థాయి సిబ్బందికి శనివారం నాటి సమీక్ష సమావేశంలో జిల్లా కలెక్టర్ బీఆర్ అంబేడ్కర్ దిశానిర్దేశం
శృంగవరపుకోట, ఏప్రిల్ 26 (ఆంధ్రజ్యోతి):
జిల్లాలో దాదాపు మూడు లక్షల ఎకరాల సాగు భూమి అందుబాటులో ఉంది. లక్షా ఇరవై మూడు ఎకరాల్లో మాత్రమే పంటలు పండిస్తున్నారు. మిగిలిన భూమిని కూడా వినియోగంలోకి తీసుకొస్తే వ్యవసాయ రంగం అభివృద్ధి చెందుతుంది. దీనికి అనుబంధంగా పరిశ్రమలు వస్తాయి. తద్వారా స్వర్ణాంధ్ర లక్ష్యం చేరేందుకు అవకాశం ఉంటుంది. ఇదే లక్ష్యంతో మండలం, నియోజకవర్గం, జిల్లా అభివృద్ధి సాధించేందుకు నెలాఖరుకు ప్రణాళికలు తయారు చేసేలా క్షేత్ర స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు సిబ్బందికి కలెక్టర్ అంబేడ్కర్ దిశానిర్దేశం చేశారు. గ్రామ స్థాయిలో పని చేస్తున్న ఉద్యోగులతో మాత్రమే వృద్ధి సాధ్యమవుతుందని ఆయన భావించారు. వారిలో కదలిక తీసుకొచ్చేందుకు గురువారం నుంచి శనివారం వరకు నియోజకవర్గాల వారీగా సమీక్షలు నిర్వహించారు.
2047-విజన్ లక్ష్యంగా..
కేంద్ర ప్రభుత్వం వికసిత్ భారత్-2047, రాష్ట్ర ప్రభుత్వం స్వర్ణాంధ్రప్రదేశ్-2047 విజన్ ప్లాన్ అమలు చేయడమే లక్ష్యంగా పెట్టుకున్న సంగతి తెలిసిందే. అట్టడగు వర్గాల తలసరి ఆదాయాన్ని పెంచడం ద్వారా ఈ లక్ష్య సాధన దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. గ్రామీణ ప్రాంతాలను అభివృద్ధి చేయడం ద్వారా మండలం, జిల్లా, రాష్ట్రంలో 15శాతం కంటే ఎక్కువ వార్షిక వృద్ధిని సాధించాలన్న విజన్‌ను రూపొందిస్తున్నారు. దీని అమలుకు ప్రత్యేక అధికారులతో పాటు నియోజకవర్గ స్థాయిలో శాసన సభ్యులను చైర్మన్లుగా నియమించారు. నియోజకవర్గ అభివృద్ధి ప్రణాళిక పర్యవేక్షణ బాధ్యతను ఎమ్మెల్యేలకు అప్పగిస్తున్నారు. ప్రతి మూడు నెలలకోసారి నియోజకవర్గం అధికార యంత్రాంగంతో వారు సమీక్షలు నిర్వహించాలి. సాధించిన వృద్ధి, తీసుకున్న నిర్ణయాలను నివేదిక రూపంలో ప్రభుత్వానికి అందించాలి.
పరిశ్రమల పరిస్థితి
జిల్లాలో రాజాం, బొబ్బిలి, శృంగవరపుకోట, నెల్లిమర్ల నియోజకవర్గాల్లో మాత్రమే ఎన్నోకొన్ని పరిశ్రమలున్నాయి. ఎస్.కోట నియోజకవర్గం లక్కవరపుకోట మండలంలో సింహాద్రి స్టిల్ (గోల్డ్‌స్టార్), మహామయి, కొత్తవలస మండలంలో జిందాల్ పెర్రో అల్లాయిస్, శారడా, అలా్ట్రటెక్ సిమెంట్ (నిర్మాణ దశలో ఉంది), జామి మండలంలో శ్రీచక్ర సిమెంట్ పరిశ్రమలున్నాయి. చీపురుపల్లి నియోజకవర్గం మెరకముడిదాంలో పెర్రో అల్లాయిస్, బొబ్బిలిలో గ్రోత్‌సెంటర్, రాజాంలో జూట్, నెల్లిమర్ల నియోజకవర్గం పూసపాటిరేగ మండలంలో ఫార్మాకంపెనీలు ఉన్నాయి. జామి మండలం భీమసింగిలో సహకర చక్కెర కర్మాగారం మూత బడింది. నెల్లిమర్ల, కొత్తవలస మండలాల్లో జనపనార పరిశ్రమలు మూతబడ్డాయి, పెర్రో అల్లోయిస్ పరిశ్రమలు నష్టాల బాట పట్టడంతో ఏడాదిలో సగభాగం లేఆఫ్ ఇస్తున్నారు. పరిశ్రమల రంగంలో ఉన్న మైనింగ్, క్వారీయింగ్ సక్రమంగా నడవడం లేదు. గత వైసీపీ ప్రభుత్వం జిల్లాకు చెందిన క్వారీల నుంచి పన్ను వసూలు బాధ్యతను ప్రైవేటు యాజమాన్యానికి అప్పగించడంతో మైనింగ్, క్వారీయింగ్‌పై భారం పడింది. దీంతో అవీ పనిచేయడం లేదు. పారిశ్రామిక రంగం వృద్ధిలో ఉన్నప్పుడే వివిద రకాల వ్యాపారాలు సాగుతాయి. బ్యాంకింగ్, బీమా, రియల్ ఎస్టేట్ వంటివి కూడా ఊపందుకుంటాయి. పర్యాటకం, ట్రాన్స్‌పోర్టు వృద్ధిలోకి వస్తాయి. జిల్లాలో పారిశ్రామికీకరణ తక్కవగా ఉండడంతో సేవా రంగంపై వృద్ధిరేటు భారం పడుతోంది. ఇప్పటికిప్పుడు పారిశ్రామికీకరణ జరగడం కష్టం. అందుకే అందుబాటులో ఉన్న వ్యవసాయ రంగాన్ని వృద్ధిలోకి తీసుకొచ్చేందుకు ఆలోచన చేస్తున్నారు.
వ్యవసాయం వృద్ధిలోకి వస్తే..
వ్యవసాయ ఆధారితంగా ఉన్న ఉద్యానవనం, పశుపోషణ, మత్స్యసంపద, అడవుల ద్వారా అత్యధిక ఆదాయం సమకూర్చుకొనేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఇందుకు అధికారుల మేధస్సుకు పదును పెట్టి కొత్త ఆవిష్కణలు సృష్టించాలన్నదే లక్ష్యం. వ్యవసాయంలో అధునాతన పద్ధతులు, ఎక్కువ లాభాలను తెచ్చే పంటలు, పశుపోషణ ద్వారా పాడిని వృద్ధి చేయడం, చెరువులను వృథాగా ఉంచకుండా చేపల పెంపకాన్ని చేపట్టడం తదితర పనులపై దృష్టిసారించింది. వీటికి అనుబంధంగా సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలను స్థాపించేందుకు ప్రయత్నిస్తోంది. ఇప్పటికే జిల్లాలో గజపతినగరం, కొత్తవలస, విజయనగరం తదితర ప్రాంతాల్లో ఎంఎస్‌ఎంఈ పార్కుల ఏర్పాటుకు స్థలాలు అందుబాటులో ఉంచారు. వ్యవసాయం వృద్ధిబాట పడితే ఇవన్నీ కార్యరూపంలోకి వచ్చే అవకాశం ఉంది.
Updated Date - Apr 27 , 2025 | 12:08 AM