ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Admissions are the goal ప్రవేశాలే లక్ష్యం

ABN, Publish Date - May 15 , 2025 | 11:53 PM

Admissions are the goal కళాశాలల్లో ప్రవేశాల కోసం ప్రైవేటు, కార్పొరేట్‌ విద్యాసంస్థలు ఎర వేస్తున్నాయి. అడ్మిషన్ల కోసం పిల్లల తల్లిదండ్రులపై ఒత్తిడి తెస్తున్నాయి. జిల్లాలో అన్ని యాజమాన్య పాఠశాలల నుంచి 19,824 మంది విద్యార్థులు పదో తరగతి ఉత్తీర్ణత సాధించారు.

ప్రవేశాలే లక్ష్యం

పిల్లల బాధ్యత మాది అంటూ తల్లిదండ్రులపై ఒత్తిడి

మా కాలేజీలో చేర్పించండి అంటూ యాజమాన్యాల ఫోన్లు

జిల్లా వ్యాప్తంగా విస్తృతంగా బలవంతపు అడ్మిషన్లు

‘హలో సార్‌ మీ అమ్మాయి మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించిందట. ముందు నుంచే బాగా చదువుతుందని మాకు తెలుసు. పాఠశాల నుంచి వివరాలు తీసుకున్నాం. అటువంటి విద్యార్థుల కోసమే వెతుకుతున్నాం. మా కాలేజీలో చేర్చితే ఆమె భవిష్యత్‌కు మాది పూచి. నాణ్యమైన విద్యాబోధన అందిస్తాం. నీట్‌, ఎంసెట్‌, మెడిసిన్‌ ఇలా అన్నింటికీ ముందస్తుగా కోచింగ్‌ ఇస్తాం. ఫీజులో రాయితీ ఇస్తాం. ఏసీ రూముల్లో బోధన, వసతి కల్పిస్తాం. ముందస్తుగా చేరితే ఫీజులో రాయితీ ఉంటుంది’ అంటూ తల్లిదండ్రులకు ప్రైవేటు, కార్పొరేట్‌ కాలేజీల ప్రతినిధులు ఫోన్‌ చేసి వల వేస్తున్నారు. లేని సౌకర్యాలు, వసతులు ఉంటాయని నమ్మబలుకుతున్నారు.

రాజాం, మే 15 (ఆంధ్రజ్యోతి):

కళాశాలల్లో ప్రవేశాల కోసం ప్రైవేటు, కార్పొరేట్‌ విద్యాసంస్థలు ఎర వేస్తున్నాయి. అడ్మిషన్ల కోసం పిల్లల తల్లిదండ్రులపై ఒత్తిడి తెస్తున్నాయి. జిల్లాలో అన్ని యాజమాన్య పాఠశాలల నుంచి 19,824 మంది విద్యార్థులు పదో తరగతి ఉత్తీర్ణత సాధించారు. అందులో సగానికిపైగా అంటే పది వేల మందినైనా తమ వైపు తిప్పుకోవాలని కార్పొరేట్‌, ప్రైవేటు విద్యాసంస్థలు లక్ష్యంగా పెట్టుకున్నాయి. ముందుగా తల్లిదండ్రులను కలిసి తమ కాలేజీలో చేర్పించాలని ఒత్తిడి పెంచుతున్నాయి. ఏప్రిల్‌ 24న పదో తరగతి ఫలితాలు విడుదల కాగా అంతకంటే ముందు నుంచే అడ్మిషన్ల కోసం గ్రామాల్లోకి వెళ్తున్నారు. తల్లిదండ్రుల వివరాలు, ఫోన్‌ నంబర్లు తీసుకొని వెంటపడుతున్నారు. మీ పిల్లల భవిష్యత్‌కు మాది భరోసా అంటూ ప్రలోభాలకు గురిచేస్తున్నారు. వెంటనే అడ్మిషన్‌ తీసుకోకుంటే మీ పిల్లాడు వెనుకబడిపోతాడని.. తరువాత సీట్లు దొరకవని చెబుతుండడంతో ఆందోళన చెందుతున్న తల్లిదండ్రులు వారు చెప్పినట్లు అంగీకరిస్తున్నారు.

జిల్లాలో ప్రతి మండలంలో మూడు నుంచి ఐదు వరకూ ప్రైవేటు కాలేజీలు ఉన్నాయి. ఎగువ మధ్యతరగతి వారు కార్పొరేట్‌ కాలేజీలను ఆశ్రయిస్తున్నారు. సామాన్యులు మాత్రం ప్రైవేటు వైపు పరుగులు తీస్తున్నారు. ప్రభుత్వానికి సంబంధించి జూనియర్‌ కాలేజీలు, మోడల్‌ స్కూల్స్‌, కేజీబీవీలు ఉన్నా.. అవగాహన లేక వాటి వైపు చూడడం లేదు. ఇంకోవైపు అక్కడ తగినంతమంది బోధకులు, వసతులు లేక సామాన్యులు కూడా ప్రైవేటు కాలేజీల వైపు మొగ్గుచూపుతున్నారు. ప్రైవేటు కాలేజీల యాజమాన్యాలు రంగు రంగుల బ్రోచర్లు చూపి తల్లిదండ్రుల ఆలోచనను మళ్లిస్తున్నాయి. ఉన్నవి లేనివి చూపుతూ తల్లిదండ్రులను ఆకర్షిస్తున్నాయి. భరోసా ఇస్తుండడంతో తల్లిదండ్రులు నిజమేనని నమ్ముతున్నారు.

రకరకాలుగా ఒత్తిడి..

ప్రస్తుతం పోటీ ప్రపంచం రోజులివి. ఎక్కడ తమ పిల్లాడు చదువుపరంగా వెనుకబడిపోతాడన్న ఆందోళన సగటు తల్లిదండ్రుల్లో ఉంటోంది. దీనినే ప్రైవేటు, కార్పొరేట్‌ కాలేజీల యాజమాన్యాలు క్యాష్‌ చేసుకుంటున్నాయి. ముందుగా ఫోన్లో వేటాడుతున్నారు. మీ పక్కింటి, మీ గ్రామానికి చెందిన విద్యార్థి మా కాలేజీలో చేరాడు అని చెబుతున్నారు. ఇక మీ ఇష్టం అంటూ హెచ్చరిస్తున్నారు. మరికొందరైతే నేరుగా కార్లతో ఒక్కసారిగా ఇంటి వద్దకు వాలిపోతున్నారు. ఇంట్లో ఉన్న మహిళల వద్ద పిల్లాడి చదువుకు సంబంధించి లేనిపోని విషయాలను చెబుతున్నారు. ఇలానే వదిలేస్తే భవిష్యత్‌కు కష్టమంటూ హెచ్చరిస్తున్నారు. ఆ తర్వాత మహిళలు కుటుంబ యజమానులపై ఒత్తిడి పెంచుతున్నారు. దీంతో తప్పనిసరిగా అడ్మిషన్లు ఇవ్వాల్సి వస్తోంది. ఇప్పటికే కార్పొరేట్‌, ప్రైవేటు విద్యాసంస్థలు పీఆర్వోలను పెద్ద ఎత్తున నియమించాయి. వారు గ్రామాల్లో తిరుగుతూ అన్నిరకాల ఒత్తిళ్లు చేసి అడ్మిషన్లు చేస్తున్నారు. ఆ విద్యార్థి తల్లిదండ్రులు ఎవరు చెబితే వింటారో.. ఏ సామాజికవర్గానికి చెందిన వారైతే అదే సామాజికవర్గ నేతలతో ఫోన్‌ చేయిస్తున్నారు. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా ఈ దందా నడుస్తోంది. బలవంతపు అడ్మిషన్ల ప్రక్రియ కొనసాగుతోంది.

విద్యను వ్యాపారం చేయడం తగదు..

విద్యను వ్యాపారం చేశారు. ప్రభుత్వ విద్యను నిర్వీర్యం చేస్తున్నారు. కార్పొరేట్‌, ప్రైవేటు విద్య అనేది పెరుగుతోంది. ప్రైవేటు వ్యామోహంతో గ్రామాల్లో ప్రభుత్వ పాఠశాలలు మూతపడే పరిస్థితికి వచ్చింది. ఈ విధానంలో మార్పురావాలి. ప్రభుత్వ విద్యపై అవగాహన పెరగాలి. బలవంతంగా అడ్మిషన్లపై చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వ జూనియర్‌ కాలేజీల్లో చేరికలు పెరిగేలా ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది.

- బూరాడ శివకృష్ణ, విద్యావేత్త, రాజాం

----------------

Updated Date - May 15 , 2025 | 11:53 PM