A Year of Grand Success ఘన విజయానికి ఏడాది
ABN, Publish Date - Jun 04 , 2025 | 12:17 AM
A Year of Grand Success ‘‘నరాలు తెగే ఉత్కంఠతో అందరూ టీవీలకు అతుక్కుపోయారు. ఎన్నికల ఫలితాల కోసం ఆర్తిగా ఎదురుచూశారు. తొలుత ఉద్యోగుల ఓట్ల లెక్కింపుతో ప్రారంభమైన కౌంటింగ్ గంటకు గంటకు టెన్షన్ పెట్టింది. కొన్ని రౌండ్‌ల తర్వాత ఒక్కో అడుగు విజయం వైపు పడింది. చివరకు విజయం ఏకపక్షమైంది. దీంతో కూటమి పార్టీల శ్రేణులు సంబరాలు చేసుకున్నాయి.
ఊహకందని ఫలితాలు.. ఐదేళ్ల అధిపత్యానికి చెక్
అదే ఐక్యతగా అడుగులేస్తున్న టీడీపీ, జనసేన, బీజేపీ
పార్వతీపురం, జూన్ 3(ఆంధ్రజ్యోతి): ‘‘నరాలు తెగే ఉత్కంఠతో అందరూ టీవీలకు అతుక్కుపోయారు. ఎన్నికల ఫలితాల కోసం ఆర్తిగా ఎదురుచూశారు. తొలుత ఉద్యోగుల ఓట్ల లెక్కింపుతో ప్రారంభమైన కౌంటింగ్ గంటకు గంటకు టెన్షన్ పెట్టింది. కొన్ని రౌండ్‌ల తర్వాత ఒక్కో అడుగు విజయం వైపు పడింది. చివరకు విజయం ఏకపక్షమైంది. దీంతో కూటమి పార్టీల శ్రేణులు సంబరాలు చేసుకున్నాయి. డిజాస్టర్ ఫలితాలతో వైసీపీ శ్రేణులు తీవ్ర నిరాశలో మునిగిపోయాయి’’ ఏడాది కిందట అంటే 2024 జూన్ 4న సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వచ్చినప్పుడు ఆవిష్కృతమైన ఘటనలివి. జిల్లాలో కూటమి ఘన విజయం సాధించింది. అన్ని అసెంబ్లీ స్థానాలను క్లీన్‌స్వీప్ చేసింది.
అంచనాలను పటాపంచలు చేస్తూ..
గత ఏడాది సార్వత్రిక ఎన్నికల ముందు వెల్లడైన సర్వేలు రాష్ట్రంలో కూటమి అధికారంలోకి వస్తుందని చెప్పాయి కానీ ఉమ్మడి జిల్లాకు వచ్చేసరికి వైసీపీకి ఆధిక్యత రావొచ్చునన్నాయి. పథకాలు ఆ పార్టీకి అనుకూలంగా ఉన్నాయని, మహిళలు మొగ్గుచూపారని చెప్పుకొచ్చాయి. ఫలితాలు వచ్చేసరికి వార్ వన్‌సైడ్ అయిపోయింది. అన్నిచోట్లా కూటమి పాగా వేసింది. వైసీపీకి ఎదురుదెబ్బ తగిలింది. వైసీపీ సీనియర్ నేతలు టీడీపీ కూటమి ప్రభంజనం ముందు నిలబడలేకపోయారు. భారీ ఓట్ల తేడాతో ఓడిపోయారు.
ఆధిపత్యానికి చెక్..
ఐదేళ్లలో వైసీపీ చాలా దూకుడుగా వ్యవహరించింది. అధికారంలోకి వచ్చాక స్థానిక సంస్థల నుంచి మునిసిపల్, పంచాయతీ ఎన్నికల వరకు హవా చాటుకుంటూ వచ్చింది. అన్నింటా ఏకపక్షమే. ఉమ్మడి జిల్లాలో పరిస్థితులను చూసి నాడు టీడీపీ అధినేత చంద్రబాబు ప్రాదేశిక ఎన్నికలను బహిష్కరిస్తూ నిర్ణయం తీసుకున్నారు. అయితే ఐదేళ్ల పాటు సగటు టీడీపీ కార్యకర్త పడిన బాధలు వర్ణనాతీతం. ఆ అవమానాలు, కేసులు, అఘాయిత్యాలను చూసిన టీడీపీ శ్రేణులు ధైర్యంగా ముందుకు వచ్చి పోరాటం చేశాయి. అటు జనసేన అదనపు బలంగా నిలిచింది. బీజేపీ సాయం కూడా తోడైంది. కూటమిగా జత కట్టి వైసీపీని మట్టికరిపించారు.
ఊహకందని ఫలితాలు..
2024 సార్వత్రిక ఎన్నికల్లో జిల్లాలో నాలుగు నియోజకవర్గాల్లో కూటమి అభ్యర్థులు ఘన విజయం సాధించారు. టీడీపీ అభ్యర్థులుగా సాలూరు నుంచి గుమ్మిడి సంధ్యారాణి, పార్వతీపురం నుంచి బోనెల విజయచంద్ర, కురుపాం నుంచి తోయక జగదీశ్వరి, పాలకొండ నుంచి జనసేన పార్టీ అభ్యర్థిగా జయకృష్ణ పోటీ చేసి విజయకేతనం ఎగురవేశారు. ఊహించని మెజార్జీని సొంతం చేసుకున్నారు. ఎమ్మెల్సీగా సంధ్యారాణి పనిచేసినప్పటికీ ఎమ్మెల్యేలుగా వారంతా మొదటిసారి అసెంబ్లీలో అడుగు పెట్టారు. ఆతర్వాత సంధ్యారాణి మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. కురుపాం ఎమ్మెల్యే జగదీశ్వరి ప్రభుత్వ విప్‌గా ఉన్నారు. మొత్తంగా గత ఎన్నికల్లో కార్యకర్తలకు అసలుసిసలైన సంబరం దక్కింది.
Updated Date - Jun 04 , 2025 | 12:17 AM