A Check to Those Hardships! ఆ కష్టాలకు చెక్!
ABN, Publish Date - May 29 , 2025 | 11:34 PM
A Check to Those Hardships! వచ్చేనెల నుంచి రేషన్ డిపోల ద్వారా నిత్యావసర సరుకులు పంపిణీ చేయాలని ప్రభుత్వం ఆదేశించడంతో గిరిజనులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇకపై ఎండీయూ వాహనాల ద్వారా గంటల తరబడి నిరీక్షించాల్సిన అవసరం లేదని చెబుతున్నారు.
ఆ దిశగా ఏర్పాట్లు చేస్తున్న అధికారులు
గిరిజనులకు తప్పనున్న కష్టాలు
జీసీసీకి పునరుత్తేజం
సీతంపేట రూరల్, మే 29(ఆంధ్రజ్యోతి): వచ్చేనెల నుంచి రేషన్ డిపోల ద్వారా నిత్యావసర సరుకులు పంపిణీ చేయాలని ప్రభుత్వం ఆదేశించడంతో గిరిజనులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇకపై ఎండీయూ వాహనాల ద్వారా గంటల తరబడి నిరీక్షించాల్సిన అవసరం లేదని చెబుతున్నారు. కాగా సర్కారు ఆదేశాలతో ఏజెన్సీలో డీఆర్ డిపోల ద్వారా సరుకుల పంపిణీకి జీసీసీ (గిరిజన సహకార సంస్థ) ఏర్పాట్లు చేస్తోంది. పాత పద్ధతిలోనే సరుకుల సరఫరాకు చర్యలు చేపడుతోంది. వాస్తవంగా గత వైసీపీ ప్రభుత్వం (ఎండీయూ)వాహనాల ద్వారా రేషన్ పంపిణీ చేపట్టింది. అయితే సరుకుల సరఫరాలో పలు అవకతవకలు జరుగుతున్నట్లు గుర్తించిన కూటమి ప్రభుత్వం ఈ పద్ధతికి ఫుల్‌స్టాప్ పెట్టింది. ఇకపై జీసీసీ డీఆర్ డిపోల ద్వారా సరుకుల పంపిణీకి ఉత్తర్వులు విడుదల చేయడంతో ఆ మేరకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.
గిరిజనులకు తప్పనున్న ఇక్కట్లు
సీతంపేట గిరిజన సహకార సంస్థ డివిజన్ పరిధిలో మొత్తంగా 36 డీఆర్ డిపోలు ఉన్నాయి. సీతంపేట మండలంలో 23, భామిని 7, కొత్తూరు 4, మర్రిగూడ 1, వీరఘట్టంలో ఒకటి చొప్పున ఉన్నాయి. వీటి పరిధిలో సుమారు 22,856 రేషన్ కార్డుదారులు ఉన్నారు. అయితే సీతంపేట మన్యంలో సిగ్నల్ వ్యవస్థ లోపం కారణంగా ఎండీయూ వాహనాల ద్వారా రేషన్ సరుకులు పంపిణీలో ఇబ్బందులు తలెత్తేవి. సిగ్నల్ ఎక్కడైతే వస్తుందో అక్కడే ఎండీయూ వాహనాలను నిలుపుదల చేసి గిరిజనులకు రేషన్ అందజేసేవారు. దీంతో ప్రతినెలా గిరిజనులకు ఇబ్బందులు తప్పేవి కావు. కొండ దిగువ ప్రాంతానికి నడిచి వచ్చి గంటల తరబడి వేచి ఉండేవారు. కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో గిరిశిఖర గ్రామాల్లో నివసిస్తున్న గిరిజనులకు ఇక్కట్లు తప్పనున్నాయి. ప్రతినెలా ఒకటో తేదీ నుంచి 15వ తేదీలోగా నేరుగా డీఆర్ డిపోలకు వెళ్లి రేషన్ సరుకులను పొందొచ్చు.
జీసీసీకి పూర్వవైభవం
గత వైసీపీ ప్రభుత్వ పాలనలో నిర్వీర్యమైన జీసీసీ(గిరిజన సహకార సంస్థ)కి కూటమి ప్రభుత్వ నిర్ణయంతో పునరుత్తేజం రానుంది. గడిచిన నాలుగేళ్లుగా ఎటువంటి కార్యకలాపాలు లేక వెలవెలబోయిన జీసీసీకి జవసత్వాలు రానున్నాయి. కూటమి ప్రభుత్వంలో గిరిజన సహకార సంస్థ కార్యాలయాలు, కార్యాలయ సిబ్బంది, డీఆర్ డిపోలు ఇకపై యాక్టివ్‌గా పనిచేయనున్నాయి. జీసీసీ డీఆర్ డిపోల ద్వారా ఇకపై గిరిజనులకు రేషన్ సరుకులు పంపిణీ చేయడంతో అక్రమాలకు చెక్ పడే అవకాశం కనిపిస్తోంది. ఎండీయూ వాహనాల ఆపరేటర్లపై ప్రభుత్వం ఏవిధంగా ముందుకు వెళ్తుందన్నది వేచి చూడాల్సి ఉంది.
డీఆర్ డిపోల పరిస్థితి ఇలా..
సీతంపేట జీసీసీ డివిజన్ పరిధిలో ఉన్న డీఆర్ డిపోల పరిస్థితి అధ్వానంగా ఉంది. గత వైసీపీ ప్రభుత్వం వాటిపై దృష్టి సారించకపోవడంతో 36 డీఆర్ డిపోల్లో 20కి పైగా భవనాలు శిథిలావస్థలో ఉన్నాయి. ఈ డిపోల్లో బియ్యం, పంచదార, ఆయిల్ ఇతరాత్ర నిత్యావసర సరుకులు నిల్వ చేయడం తలకుమించిన భారమే. అయినప్పటికీ తప్పనిసరి పరిస్థితుల్లో వాటి మరమ్మ తులకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక జీసీసీలో సేల్స్‌మెన్ కొరత కూడా తీవ్రంగా ఉంది. రెగ్యులర్ సేల్స్‌మెన్ ఆరుగురు మాత్రమే ఉన్నారు. ఎడిషనల్ చార్జి ముగ్గురు, కాంట్రాక్ట్ ప్రాతిపదికన పది మంది, ఇన్‌చార్జి సేల్స్‌మెన్ నలుగురు, ఎస్‌హెచ్‌జీ ముగ్గురు, డీలర్‌లు 11 మంది ఉన్నారు. వీరిలో కొందరు సేల్స్‌మెన్ రెండు డీఆర్ డిపోలకు ఒక్కరు చొప్పున సేవలు అందిస్తున్నారు.
జీసీసీ బీఎం ఏమన్నారంటే..
‘ప్రభుత్వ ఆదేశాల మేరకు జూన్ ఒకటోతేదీ నుంచి జీసీసీ డీఆర్ డిపోల ద్వారా కార్డుదారులకు రేషన్ సరుకులు పంపిణీ చేయనున్నాం. కొన్ని డీఆర్ డిపోలకు మరమ్మతులు చేయించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. గిరిజన ప్రాంతాల్లోని రేషన్ కార్డుదారులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా నిత్యావసర సరుకులు అందిస్తాం.’ అని సీతంపేట జీసీసీ బ్రాంచ్ మేనేజర్ డి.కృష్ణారావు తెలిపారు.
Updated Date - May 29 , 2025 | 11:34 PM