A ban? Where is it? నిషేధమా.. అదెక్కడ?
ABN, Publish Date - Apr 18 , 2025 | 11:52 PM
A ban? Where is it? జిల్లాకేంద్రం పార్వతీపురం పురపాలక సంఘంలో పాలిథిన్ నిషేధం అమలు కావడం లేదు. యథేచ్ఛగా పాలిథిన్, ప్లాస్టిక్ వస్తువుల క్రయ, విక్రయాలు జరుగుతున్నాయి. సంబంధిత అధికారుల పర్యవేక్షణ లోపం కారణంగా.. నిషేధం కాగితాలకే పరిమితమైంది.
యథేచ్ఛగా వినియోగం
చూసీచూడనట్టు వ్యవహరిస్తున్న మున్సిపల్ అధికారులు
పర్యావరణానికి ముప్పు అని తెలిసినా పట్టించుకోని వైనం
నామమాత్రపు చర్యలతోనే సరి..
అమలు కాని ఉన్నతాధికారుల ఆదేశాలు
పార్వతీపురం టౌన్, ఏప్రిల్ 18(ఆంధ్రజ్యోతి) : జిల్లాకేంద్రం పార్వతీపురం పురపాలక సంఘంలో పాలిథిన్ నిషేధం అమలు కావడం లేదు. యథేచ్ఛగా పాలిథిన్, ప్లాస్టిక్ వస్తువుల క్రయ, విక్రయాలు జరుగుతున్నాయి. సంబంధిత అధికారుల పర్యవేక్షణ లోపం కారణంగా.. నిషేధం కాగితాలకే పరిమితమైంది. ‘యథా రాజ.. తథా ప్రజ’ అన్న చందంగా మున్సిపాల్టీలో పరిస్థితి మారింది. నిషేధిత పాలిథిన్, ప్లాస్టిక్ వస్తువుల వ్యాపారం జిల్లా కేంద్రంలో మూడు పూలు.. ఆరుకాయలు అన్న చందంగా సాగుతోంది. వాటి వల్ల పర్యావరణానికి ప్రమాదం పొంచి ఉందని సామాజిక వేత్తలు, ప్రజా సంఘాలు నాయకులు ఎంతగా చెబుతున్నా పట్టించుకునే వారే కరువయ్యారు. దీనిపై ఉన్నతాధి కారుల ఆదేశాలు మాత్రం అమలుకాకపోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఇదీ పరిస్థితి..
సాలూరు మున్సిపాల్టీతో పాటు పార్వతీపురానికి పక్కనే ఉన్న విజయనగరం జిల్లా బొబ్బిలి పురపాలక సంఘంలో పాలిథిన్ సంచులు, ప్లాస్టిక్ గ్లాసులు, వాటర్ ప్యాకెట్ల నిషేధం పూర్తిస్థాయిలో అమలవుతుంది. కానీ పార్వతీపురం మున్సిపాల్టీలో మాత్రం భిన్న పరిస్థితి నెలకొంది. విద్యావంతులు, మేధావులు ఉన్న అతిపెద్ద పట్టణంలో ప్లాస్టిక్ అమ్మకాలు జరగకుండా చూడాల్సిన ప్రత్యేక నిఘా టీమ్‌లు నిద్రావస్థలో ఉన్నాయి. ఈ విషయంలో పజారోగ్యశాఖాధికారులు చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలున్నాయి. గత ఐదేళ్లలో ఒడిశా, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల నుంచి లక్షలాది రూపాయలు విలువ చేసే ప్లాస్టిక్ సంచులు, గ్లాసులు , వాటర్ ప్యాకెట్లు జిల్లా కేంద్రానికి దిగుమతి అయ్యాయి. అయితే నిషేధిత ప్లాస్టిక్ వస్తువులు దొరికిన మొదటి సారి రూ. వెయ్యి , రెండో సారి రూ.5వేలు, మూడో సారి భారీ జరిమానాతో పాటు కఠిన చర్యలు చేపడతామని చెబుతున్న సంబంధిత అధికారులు ప్రకటనలకే పరిమితమయ్యారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. పాలిథిన్ వస్తువులను విక్రయించే షాపులపై తూతూ మంత్రంగా దాడులు నిర్వహిస్తున్నారు. సంబంధిత యజమానులతో జరిమానాలు కట్టించి.. నిషేధిత వస్తువులను స్వాధీనం చేసుకుని చేతులు దులుపుకుంటున్నారు. దీంతో జిల్లాకేంద్రంలో వాటి వినియోగం ఏ మాత్రం తగ్గడం లేదు. జోరుగా క్రయ విక్రయాలు జరుగుతున్నాయి. పట్టణ నడిబొడ్డులో ఉన్న వరహాల గెడ్డ నిషేధిత ప్లాస్టిక్ వస్తువులతో డంపింగ్ యార్డుగా మారడమే ఇందుకు నిదర్శనంగా చెప్పొచ్చు. వాటిని తరలించడం ప్రజారోగ్యశాఖాధికారులకు తలనొప్పిగా మారింది.
ఆదేశాలు అమలయ్యేనా?
జిల్లాకేంద్రంలో పక్కాగా ప్లాస్టిక్ నిషేధం అమలు చేయాలని కలెక్టర్ శ్యామ్ ప్రసాద్, ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర పిలుపునిచ్చారు. ఈ మేరకు స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్రలో భాగంగా గత నెల మూడో శనివారం పట్టణంలో ప్రచారం నిర్వహించారు. మున్సిపాల్టీలో నిషేధిత ప్లాస్టిక్ సంచులు, గ్లాసులు, వాటర్ ప్యాకెట్‌ల అమ్మకాలు, కోనుగోలు నిలుపుదల చేయాలని అధికారులను ఆదేశించారు. స్థానిక ప్రధాన మార్కెట్‌లో గుడ్డ సంచులను పంపిణీ చేశారు. పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగ స్వాములు కావాలని సూచించారు. అయితే ఇంతవరకూ బాగానే ఉన్నా.. ప్లాస్టిక్ నిషేధం అమలుపై వారి ఆదేశాలు ఎంతవరకు అమలవుతాయన్నది ప్రశ్నార్థకంగా మారింది. పాలిథిన్, ప్లాస్టిక్ వస్తువుల వినియోగం.. పర్యావరణానికి ప్రమాదమని ఇప్పటికే ప్రచారం చేస్తున్నప్పటికీ ఫలితం ఉండడం లేదు. క్షేత్రస్థాయిలో పరిస్థితులు ఏ మాత్రం మారడం లేదు.
ఇలా చేస్తేనే..
పాలిథిన్ నిషేధానికి సంబంధించి ప్రజారోగ్యశాఖాధికారులు కఠినంగా వ్యవహరించాల్సి ఉంది. ప్లాస్టిక్, పాలిథిన్ వస్తువులు విక్రయిస్తున్న వ్యాపారులపై భారీ జరిమానాలతో పాటు పర్యావరణ రక్షణ చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలి. లేకుంటే భవిష్యత్ తరాల వారికి ఇబ్బందులు తప్పవు. ‘పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత’ అనే నినాదంతో ప్రజలను చైతన్యవంతులను చేయాల్సి ఉంది. పర్యావరణ పరిరక్షణ కోసం స్వచ్ఛంద సంస్థలు, వాకర్స్ క్లబ్‌లను భాగస్వాములను చేయాలి. పాలిథిన్, ప్లాస్టిక్ వస్తువుల దిగుమతులపై ఎప్పటికప్పుడు ప్రజారోగ్యశాఖాధికారులు దృష్టి సారిస్తే అమ్మకాలకు అడ్డుకట్టే కాదు..నివారణ కూడా పక్కాగా జరుగుతుందని ప్రజలు భావిస్తున్నారు.
అమలుకు ప్రణాళికలు
జిల్లా కేంద్రంలో పాలిథిన్, ప్లాస్టిక్ నిషేధం అమలుకు పక్కా ప్రణాళికలు సిద్ధం చేశాం. పాలిథిన్ సంచులు, గ్లాసులు, ప్యాకెట్ల క్రయ, విక్రయాలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాం. బాధ్యులపై చర్యలు తీసుకుంటున్నాం. ఎప్పటికప్పుడు సచివాలయ అధికారులు, సిబ్బందితో దాడులు నిర్వహిస్తున్నాం.
- కె.పకీరురాజు, ప్రజారోగ్యశాఖ ఇన్‌స్పెక్టర్, పార్వతీపురం మున్సిపాల్టీ
Updated Date - Apr 18 , 2025 | 11:52 PM