22 Packets.. 44 Kilograms 22 ప్యాకెట్లు.. 44 కేజీలు
ABN, Publish Date - Apr 26 , 2025 | 11:57 PM
22 Packets.. 44 Kilograms ఒడిశా నుంచి పార్వతీపురం మీదుగా తమిళనాడుకు గంజాయి రవాణా చేస్తున్న ఆరుగురిని పట్టణ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఓ కారును సీజ్ చేశారు. 44 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.
పోలీసుల అదుపులో నిందితులు
పార్వతీపురంటౌన్, ఏప్రిల్ 26(ఆంధ్రజ్యోతి): ఒడిశా నుంచి పార్వతీపురం మీదుగా తమిళనాడుకు గంజాయి రవాణా చేస్తున్న ఆరుగురిని పట్టణ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఓ కారును సీజ్ చేశారు. 44 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. సీఐ మురళీధర్ తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణ శివారులోని పెట్రోల్ బంకు వద్ద శనివారం ఉదయం ఎస్‌ఐ గోవిందరావు, సిబ్బంది వాహన తనిఖీలు చేపట్టారు. ముందస్తు సమాచారం మేరకు ఒడిశా నుంచి తమిళనాడు వెళ్తున్న ఓ కారును ఆపారు. తనిఖీలు చేయగా 22 ప్యాకెట్లతో 44 కేజీల గంజాయి ఉన్నట్లు గుర్తించారు. ఈ లోపుగా కారులో ఉన్న ఆరుగురు వ్యక్తులు పారిపోవడానికి ప్రయత్నించగా.. పోలీసులు అప్రమత్తమై వారిని అదుపులోకి తీసుకున్నారు. వారిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. అక్రమంగా తరలిస్తున్న గంజాయి విలువ రూ.5 లక్షల వరకు ఉంటుందని సీఐ వెల్లడించారు. ఎవరైనా గంజాయి రవాణా చేసినా, సహకరించినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
ఒడిశా నుంచి తమిళనాడుకు..
‘తమిళనాడుకు చెందిన గోపాలకృష్ణన్ అనే వ్యక్తి 15 ఏళ్ల కిందట ఆ రాష్ట్రంలోని ధర్మవరం నుంచి చిప్స్ వ్యాపారం నిమిత్తం ఒడిశా రాష్ట్రం రాయగడ వచ్చాడు. కుమారుడు మణికంఠన్ గోపాలన్‌తో కలిసి అక్కడే నివసిస్తున్నాడు. కాగా వారి సమీప బంధువు సురేష్ కృష్ణ గంజాయి అమ్మకాల ద్వారా అధిక మొత్తంలో డబ్బు సంపాదించొచ్చని మణికంఠన్ గోపాలన్‌కు ఆశ చూపాడు. ఈ నేపథ్యంలో తమిళనాడుకు చెందిన మరో నలుగురి సాయంతో గంజాయిని రవాణా చేయాలని ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. అనుకున్న విధంగా శనివారం కారులో గంజాయి తరలిస్తుండగా పట్టణ పోలీసులకు చిక్కారు.’ అని సీఐ తెలిపారు.
Updated Date - Apr 26 , 2025 | 11:57 PM