వైసీపీలో జడ్పీ లొల్లి
ABN, Publish Date - Jul 27 , 2025 | 01:23 AM
వైసీపీకి చెందిన జడ్పీటీసీ సభ్యుల మధ్య విభేదాలు పొడచూపాయి.
పార్టీ సభ్యుల మధ్య విభేదాలు
ఫోరం అధ్యక్షుడి మార్పు
దొండా రాంబాబు స్థానంలో దేవరాపల్లి జడ్పీటీసీ సభ్యుడు కర్రి సత్యం ఎన్నిక
ఫ్లోర్ లీడర్‌కు సమాచారం నిల్
విశాఖపట్నం, జూలై 26 (ఆంధ్రజ్యోతి):
వైసీపీకి చెందిన జడ్పీటీసీ సభ్యుల మధ్య విభేదాలు పొడచూపాయి. ఈ నేపథ్యంలో జడ్పీటీసీ సభ్యుల ఫోరం అధ్యక్షునిగా ఉన్న దొండా రాంబాబును తప్పించి ఆ స్థానంలో దేవరాపల్లి జడ్పీటీసీ సభ్యుడు కర్రి సత్యాన్ని ఎన్నుకున్నారు. శనివారం జడ్పీ స్టాండింగ్ కమిటీ మీటింగ్‌కు హాజరైన సభ్యులు తరువాత విడిగా సమావేశమయ్యారు. జడ్పీ చైర్‌పర్సన్ జల్లిపల్లి సుభద్ర వ్యక్తిగత సహాయకుడు ప్రసాద్ (జడ్పీ ఉద్యోగి)ను తప్పించాలని కోరుతూ సంతకాలు సేకరించారు. ఫిర్యాదు కాపీపై 23 మంది సంతకాలు చేశారు. అయితే బుచ్చెయ్యపేట జడ్పీటీసీ సభ్యుడు, వైసీపీ జడ్పీటీసీ సభ్యుల ఫోరం అధ్యక్షుడు దొండా రాంబాబు తొలుత సంతకం చేసి, ఆ తరువాత కొట్టేశారు. అప్పటికే ఫోరం అధ్యక్షుడిగా తనను తప్పిస్తారని ఆయనకు సమాచారం ఉండడంతోనే సంతకం కొట్టేశారని చెబుతున్నారు. ఇదిలావుండగా సీసీపై ఫిర్యాదు గురించి వైసీపీ ఫ్లోర్‌లీడర్, పరవాడ జడ్పీటీసీ సభ్యుడు పైల సన్యాసిరాజుకు సమాచారం లేదని తెలిసింది. ఆయనతోపాటు మరికొందరు సభ్యులు సంతకాలు చేయలేదు. కాగా జిల్లాలో 39 జడ్పీటీసీ స్థానాల్లో చైర్‌పర్సన్ జల్లిపల్లి సుభద్రతో కలిపి వైసీపీకి 36 మంది సభ్యులు ఉన్నారు. చైర్‌పర్సన్ సుభద్రపై అసంతృప్తితో ఈ నెల తొమ్మిదో తేదీన జరిగిన సర్వసభ్య సమావేశాన్ని 22 మంది సభ్యులు బహిష్కరించారు. తరువాత పార్టీ పెద్దలు జోక్యం చేసుకుని చైర్‌పర్సన్, సభ్యుల మధ్య సయోధ్య కుదిర్చినా అది తాత్కాలికమేనని తాజా ఘటనలతో స్పష్టమైంది. ఫోరం అధ్యక్షుడిగా రాంబాబు స్థానంలో దేవరాపల్లి జడ్పీటీసీ సభ్యుడు కర్రి సత్యాన్ని ఎన్నుకోవడంతో సభ్యుల మధ్య విభేదాలు బహిర్గతమయ్యాయి. అందరం కలిసి మాట్లాడదామని సత్యం చెప్పినా తరువాత ఏమి జరిగిందోగానీ ఆయనే ఫోరం అధ్యక్షుడు అంటూ సభ్యులు వెల్లడించారు. జడ్పీటీసీ సభ్యులుగా ఎన్నికైన తరువాత వైసీపీ ప్రభుత్వంలో ఆరు నెలల కాలానికి గౌరవ వేతనం అందగా, కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత మరో ఆరు నెలల వేతనం అందింది. సుమారు 18 నెలల కాలానికి గౌరవ వేతనం జడ్పీటీసీ సభ్యులకు రాలేదని అనేక పర్యాయాలు ఆవేదన వ్యక్తం చేసినా ఫోరం అధ్యక్షుడు పట్టించుకోలేదని పలువురు సభ్యులు పేర్కొన్నారు. అందుకే ఫోరం అధ్యక్షుడిని మార్చుకున్నామని వెల్లడించారు. ఈ నేపథ్యంలో వైసీపీ జడ్పీటీసీ సభ్యులు రెండు వర్గాలుగా విడిపోయినట్టేనని ఒక సభ్యుడు వ్యాఖ్యానించారు.
Updated Date - Jul 27 , 2025 | 01:23 AM