ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

వైసీపీ నేత భూ మాయ

ABN, Publish Date - May 23 , 2025 | 01:32 AM

వైసీపీ పాలనలో కాదేదీ కబ్జాకు అనర్హం అన్నట్టుగా జిల్లాలో దోపిడీ సాగిపోయింది.

  • జెర్రిపోతులపాలెంలో చెరువు కబ్జా

  • అతుకుబడి పట్టాగా రికార్డుల్లో మార్పు

  • ఎన్‌హెచ్‌ విస్తరణలో పరిహారం కొట్టేసిన వైనం

  • ఎఫ్‌ఎంబీలో చెరువుగానే పేర్కొన్న అధికారులు

  • గతంలో గ్రావెల్‌ తవ్వకాలకు అనుమతులు

  • పెందుర్తి రెవెన్యూ అధికారుల లీల

  • కలెక్టర్‌కు ఫిర్యాదు చేసిన జనసేన నేత

  • పట్టించుకోని ఉన్నతాధికారులు

పెందుర్తి, మే 22 (ఆంధ్రజ్యోతి):

వైసీపీ పాలనలో కాదేదీ కబ్జాకు అనర్హం అన్నట్టుగా జిల్లాలో దోపిడీ సాగిపోయింది. ప్రభుత్వ భూములు, కొండలు, సాగునీటి కాలువలను సైతం ఆక్రమించుకుని, బలవంతంగా పట్టాలు చేయించుకున్న బాగోతాలు బయటపడుతూనే ఉన్నాయి. ఇదే కోవలో పెందుర్తి రెవెన్యూ అధికారుల లీలతో ఏకంగా చెరువునే డీ పట్టా భూమిగా మార్చేసి, చదును చేయడమే కాకుండా, జాతీయ రహదారి విస్తరణలో భూమి పోతోందంటూ రూ.50 లక్షల పరిహారాన్ని కూడా ఓ వైసీపీ నేత తీసుకున్నారు.

పెందుర్తి మండలం జెర్రిపోతులపాలెం సరిహద్దు పెదగాడి రెవెన్యూ సర్వే నంబరు 420లో 4.75 ఎకరాల చెరువు ఉంది. రెవెన్యూ ఫీల్డ్‌ మెజర్‌మెంట్‌ రికార్డులు, ఎఫ్‌ఎంబీ స్కెచ్‌లో ఇప్పటికీ దీనిని చెరువుగానే చూపిస్తున్నారు. ఇది చెరువు భూమి అని 2017లో రెవెన్యూ అధికారులు నిర్ధారించడంతో అక్కడ 1.92 హెక్టార్లలో గ్రావెల్‌ తవ్వకాల కోసం గనుల శాఖ అనుమతినిచ్చింది.

అతుకుబడి భూమిగా మార్చి..

కాలక్రమంలో చెరువు స్వరూపం మారడంతో జెర్రిపోతులపాలేనికి చెందిన వైసీపీ నేత కన్ను దానిపై పడింది. ఆ భూమి తనదేనంటూ కొన్నిపత్రాలు చూపి రెవెన్యూ అధికారుల సహకారంతో రికార్డుల్లో మార్పించుకున్నారని టీడీపీ, జనసేన నేతలు ఆరోపిస్తున్నారు. సర్వే నంబరు 420లో చెరువు ఉంటే 420/1 సబ్‌ డివిజన్‌గా చూపించినట్టు ఆరోపణలున్నాయి. వెబ్‌ల్యాండ్‌లో అతుకుబడి భూమిగా నమోదు కావడంతో విచారణ లేకుండనే అధికారులు డీ పట్టా ఇచ్చేశారు. దీంతో చెరువు స్థలాన్ని చదును చేసి మొత్తం పూడ్చివేశారు. వ్యవసాయ భూమి అని నమ్మించేందుకు సరుగుడు మొక్కలు పెంచారు.

రహదారి విస్తరణ పరిహారం

షీలానగరం-సబ్బవరం ఆరు వరుసల రహదారి విస్తరణకు జరిపిన భూ సేకరణలో వైసీపీ నేత ఆధీనంలో ఉన్న చెరువు స్థలంలో అర ఎకరా పోయింది. ఇది చెరువు భూమి అని ఎఫ్‌ఎంబీ స్కెచ్‌లో ఉండడంతో మొదట పరిహారం దక్కలేదు. దీంతో జాతీయ రహదారి సంస్థ అధికారులపై రాజకీయ ఒత్తిడి తీసుకువచ్చి, ఉన్నతస్థాయి అధికారితో రహస్య ఒప్పందం చేసుకుని, రూ.50 లక్షలు పరిహారం తీసుకున్నారు. ఇందులో అప్పటి ఎన్‌హెచ్‌ అధికారి ప్రమేయం ఉందన్న ఆరోపణలున్నాయి.

అధికారుల లీల

ఎఫ్‌ఎంబీలో పక్కాగా చెరువుగా నమోదై ఉండగా దానిని అతుకుబడి పట్టా భూమిగా మార్చడం వెనుక రెవెన్యూ అధికారుల హస్తం ఉందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. సర్వే నంబరు 420లో చెరువుండగా, దానిని సబ్‌ డివిజన్‌ ఎలా చేశారో అంతుబట్టడం లేదంటున్నారు. ఏదైనా భూమి స్వరూపం మార్చేందుకు ల్యాండ్‌ క్లాసిఫికేషన్‌ జరగాలి. చెరువులో నాలుగు ఎకరాలకు డి.పట్టా మంజూరుచేసిన అధికారులు, మిగిలిన భూమిలో 25 సెంట్లను మాత్రమే చెరువుగా చూపించారు. అంతేకాదు ఇందులో మరో 50 సెంట్ల స్థలానికి మరొకరికి డీ పట్టా మంజూరుచేశారని సమాచారం. ఈ చెరువు కబ్జా వ్యవహారంపై ఇప్పటికే పలుమార్లు రెవెన్యూ అధికారులు, కలెక్టర్‌కు ఫిర్యాదు చేశామని జనసేన నేత గల్లా రమణ తెలిపారు. అయినప్పటికీ చర్యలు లేవన్నారు. ఉన్నత స్థాయి అధికారులు విచారణ చేపడితే మొత్తం వ్యవహారం బయటపడుతుందని చెబుతున్నారు.

విచారణ చేపడతాం

- ఎం.ఆనంద్‌కుమార్‌, తహశీల్దార్‌, పెందుర్తి

పెదగాడి సర్వే నంబరు 420లో 4.75 ఎకరాల చెరువు అతుకుబడి పట్టాలపై శాఖాపరమైన విచారణ చేపడతాం. స్థానిక రెవెన్యూ కార్యాలయం రికార్డుల్లో 1978లో అతుకుబడి అనుభవదారుల వివరాలు, డీ పట్టాలు జారీచేసిన వారి పేర్లు, ఆన్‌లైన్‌లో నమోదు చేసిన అంశంపై సమగ్ర పరిశీలన చేస్తాం. చెరువు క్లాసిఫికేషన్‌పై ఉన్నతాధికారులకు నివేదిస్తాం.

Updated Date - May 23 , 2025 | 01:32 AM