డుడుమ జలపాతంలో యువకుడి గల్లంతు
ABN, Publish Date - Jun 15 , 2025 | 12:14 AM
డుడుమ జలపాతంలో యువకుడి గల్లంతు
ఫొటోరైటప్: 14ఎంపీటీ1: డుడుమ జలపాతంలో గల్లంతైన అనిమెష్‌దాస్(వృత్తంలో ఉన్న వ్యక్తి)
ముంచంగిపుట్టు, జూన్ 14 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రా, ఒడిశా సరిహద్దు ప్రాంతం(ఏవోబీ)లో గల డుడుమ జలపాతంలో శనివారం ఓ యువకుడు గల్లంతయ్యాడు. దీనికి సంబంధించి బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. కోల్‌కతాకు చెందిన అనిమెష్‌దాస్(27) కుటుంబ సభ్యులతో కలసి ఒడిశా కోరాపుట్టు జిల్లాలో పర్యాటక ప్రాంతాలను సందర్శించేందుకు శుక్రవారం వచ్చారు. శుక్రవారం దేవ్‌మాలి, గాలిగబ్దర్, తదితర ప్రాంతాలను సందర్శించారు. శనివారం ఇరురాష్ట్రాల సరిహద్దు ప్రాంతంలో ఉన్న డుడుమ జలపాతాన్ని చూసేందుకు వచ్చారు. మొదట జలపాతం వ్యూపాయింట్ వద్ద కుటుంబ సమేతంగా ఫొటోలు దిగారు. అనంతరం జలపాతాన్ని దగ్గర నుంచి చూసేందుకు సుమారు 550 అడుగుల లోయలోకి మెట్ల మార్గం మీదుగా కిందికి దిగారు. అక్కడ ఎవరికి వారు సరదాగా కొంత సమయం గడుపుతున్న సమయంలో అనిమెష్ కనిపించలేదు. అతని చెప్పులు మాత్రం జలపాతం పక్కన గల బండరాళ్లపై ఉండడంతో అతను గల్లంతైనట్టు గ్రహించారు. దీంతో స్థానికుల సహాయంతో జలపాతం ప్రాంతంలో గాలింపులు చేపట్టినప్పటికీ ఫలితం కనిపించలేదు. విషయం తెలుసుకున్న లమతాపుట్టు అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని గాలింపు చేపట్టారు. అయినా ఆ యువకుడి ఆచూకీ లభించలేదు.
సరియా జలపాతం అవతలి వైపు చిక్కుకున్న పర్యాటకులు
అనంతగిరి: మండలంలోని ప్రముఖ పర్యాటక కేంద్రమైన సరియా జలపాతం వద్ద భారీ వర్షం కారణంగా పర్యాటకులు అవతలి వైపు చిక్కుకున్నారు. గెడ్డను దాటుకుంటూ సరియా జలపాతం చూసేందుకు వెళ్లిన పర్యాటకులు శనివారం సాయంత్రం వారు వచ్చే సమయానికి గెడ్డ ఉధృతంగా ప్రవహిస్తుండడంతో అటువైపు సుమారు 50 మంది పర్యాటకులు ఉండిపోయారు. హుకుంపేట మండలం గనికే, గేదేలపాడు భారీ వర్షం పడడంతో గెడ్డ ఉధృతంగా ప్రవహిస్తుందని స్థానికులు చెప్పారు. గెడ్డ ఉధృతి తగ్గిన తరువాత పర్యాటకులు ఇటు వైపు రావాలని స్థానికులు సూచించారు.
Updated Date - Jun 15 , 2025 | 12:14 AM