నల్లబెల్లి జలపాతంలో యువకుడి మృతి
ABN, Publish Date - Aug 02 , 2025 | 11:30 PM
గూడెంకొత్తవీధి మండలం దామనాపల్లి పంచాయతీ నల్లబెల్లి జలపాతంలో ఓ యువకుడు ప్రమాదవశాత్తు మునిగిపోయి మృతిచెందాడు.
చింతపల్లి, ఆగస్టు 2 (ఆంధ్రజ్యోతి): గూడెంకొత్తవీధి మండలం దామనాపల్లి పంచాయతీ నల్లబెల్లి జలపాతంలో ఓ యువకుడు ప్రమాదవశాత్తు మునిగిపోయి మృతిచెందాడు. ఈ సంఘటనకు సంబంధించి స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం వివరాలిలా వున్నాయి.
చింతపల్లికి చెందిన కంచర్ల అరవింద్(22) స్నేహితులతో కలిసి శనివారం మధ్యాహ్నం నల్లబెల్లి జలపాతం వద్దకు వెళ్లారు. స్నేహితులతో కలిసి జలపాతం వద్ద ఎంజాయ్ చేస్తుండగా యువకుడు అరవింద్ కాలుజారి చాపరాయి నుంచి లోతట్టు ప్రాంతంలో పడిపోయి మునిగిపోయాడు. స్నేహితులు సమీపంలోనున్న గ్రామానికి చెందిన గిరిజనులకు సమాచారం ఇవ్వడంతో వారు వచ్చి అరవింద్‌ని బయటకు తీశారు. అప్పటికే యువకుడు మృతి చెందాడు. అయితే మృతుడు అరవింద్ తండ్రి కృష్ణ గత ఏడాది తిరుపతిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. తల్లి జ్యోతి చింతపల్లిలో అల్పాహార దుకాణం నిర్వహిస్తున్నది. మృతుడుకి అక్క, తల్లి ఉన్నారు. అరవింద్ గత ఏడాది ఇంటర్ పూర్తి చేశాడు. కాగా మృతదేహాన్ని అంబులెన్స్‌లో చింతపల్లి ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఈఘటనపై జీకేవీధి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Updated Date - Aug 02 , 2025 | 11:30 PM