పాలగెడ్డలో మునిగి యువకుడి మృతి
ABN, Publish Date - Jun 03 , 2025 | 11:27 PM
పాలగెడ్డలో కాలకృత్యాలు తీర్చుకోవడానికి వెళ్లిన ఒక యువకుడు.. ప్రమాదవశాత్తూ కాలుజారి నీటిలో పడిపోయాడు. అక్కడే వున్న స్నేహితుడు కాపాడడానికి చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. దీంతో నీటమునిగి మృతిచెందాడు. ఈ సంఘటనకు సంబంధించి వివరాలిలా వున్నాయి.
కాలకృత్యాలు తీర్చుకోవడానికి వెళ్లి మృత్యువాత
సొంతూరు విశాఖలోని అక్కయ్యపాలెం
మాడుగుల, జూన్ 3 (ఆంధ్రజ్యోతి): పాలగెడ్డలో కాలకృత్యాలు తీర్చుకోవడానికి వెళ్లిన ఒక యువకుడు.. ప్రమాదవశాత్తూ కాలుజారి నీటిలో పడిపోయాడు. అక్కడే వున్న స్నేహితుడు కాపాడడానికి చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. దీంతో నీటమునిగి మృతిచెందాడు. ఈ సంఘటనకు సంబంధించి వివరాలిలా వున్నాయి.
విశాఖ నగరంలోని అక్కయ్యపాలెం ప్రాంతానికి చెందిన కెరటాల రోషన్ (18) మంగళవారం చీడికాడ మండలం ఖండివరం గ్రామానికి చెందిన తన స్నేహితుడి ఇంటికి వచ్చాడు. ఇతని (స్నేహితుడి) తాత మాడుగులలో ఉండడంతో ఇక్కడ జరుగుతున్న మోదకొండమ్మ అమ్మవారి జాతరను తిలకించేందుకు ఇద్దరూ కలిసి మాడుగుల వచ్చారు. మధ్యాహ్నం 12 గంటల సమయంలో కాలకృత్యాలు తీర్చుకునేందుకు పాలగెడ్డకు వెళ్లారు. రోషన్ ప్రమాదవశాత్తూ నీటిలో పడిపోయి మునిగిపోతూ కేకలు వేశాడు. ఒడ్డున ఉన్న స్నేహితుడు కాపాడడానికి ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోయింది. దీంతో రోషన్ నీటిలో మునిగిపోయాడు. అగ్నిమాపక శాఖకు సమాచారం ఇవ్వడంతో సిబ్బంది వచ్చి గాలించారు. కొద్దిసేపటి తరువాత మృతదేహాన్ని బయటకు తీశారు. ఈ విషయం తెలుసుకున్న రోషన్ కుటుంబ సభ్యులు సంఘటన స్థలానికి చేరుకొని కన్నీరుమున్నీరయ్యారు.
Updated Date - Jun 03 , 2025 | 11:27 PM