తొట్లకొండపై యోగాసనాలు
ABN, Publish Date - Jun 02 , 2025 | 01:07 AM
ఈ నెల 21న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రం తొట్లకొండపై యోగాసనాల కార్యక్రమాన్ని ఆదివారం నిర్వహించారు.
యోగాంధ్ర వేడుకల్లో భాగంగా నిర్వహణ
21న ప్రపంచ రికార్డు నెలకొల్పేలా 5 లక్షల మందితో యోగాసనాలు: కలెక్టర్ హరేంధిర ప్రసాద్
విశాఖపట్నం, జూన్ 1 (ఆంధ్రజ్యోతి):
ఈ నెల 21న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రం తొట్లకొండపై యోగాసనాల కార్యక్రమాన్ని ఆదివారం నిర్వహించారు. యోగాంధ్ర వేడుకల్లో భాగంగా ప్రత్యేక యోగాసనాల కార్యక్రమాన్ని ఉదయం 6.30 నుంచి 8 గంటల వరకు నిర్వహించారు. ఇందులో సుమారు వెయ్యి మంది పాల్గొని యోగాసనాలు వేశారు. ముందుగా మయన్మార్‌కు చెందిన బౌద్ధ గురువులు రాజదమ్మ, కాంబోడియాకు చెందిన బర్మరే, విశాఖ బౌద్ధ సంఘ సభ్యులు ధర్మాచారి, తదితరుల ప్రార్థనలతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంధిర ప్రసాద్ మాట్లాడుతూ 21న నిర్వహించనున్న అంతర్జాతీయ యోగా వేడుకల్లో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొంటారన్నారు. ప్రధాన వేదిక అయిన ఆర్కే బీచ్ నుంచి భీమిలి వరకు యోగాసనాలు వేసేందుకు ఏర్పాట్లు చేశామన్నారు. సుమారు ఐదు లక్షల మంది ప్రజలు ఇందులో భాగస్వాములు కానున్నారని పేర్కొన్నారు. యోగాసనాల ద్వారా ప్రపంచ రికార్డు నెలకొల్పేలా ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నామన్నారు. ప్రతి సచివాలయ పరిధిలో గల ట్రైనింగ్ సెంటర్‌లో వందమంది చొప్పున మూడు ట్రైనింగ్ సెంటర్లను ఏర్పాటు చేసి ప్రజలకు యోగాసనాలపై శిక్షణ ఇస్తున్నామన్నారు. కాగా 21న జరిగే అంతర్జాతీయ యోగా కార్యక్రమంలో పాల్గొనే వారి కోసం రవాణా సదుపాయాన్ని కల్పిస్తున్నామని కలెక్టర్ వెల్లడించారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్, భీమిలి ఆర్డీవో సంగీత మాధూర్, పలువురు జిల్లా అధికారులు, నావికాదళ అధికారులు, బ్రహ్మకుమారీస్ సంస్థ సభ్యులు, యోగా అసోసియేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు.
Updated Date - Jun 02 , 2025 | 01:07 AM