వైసీపీ నిర్లక్ష్యం.. మెడికల్ కాలేజీకి శాపం
ABN, Publish Date - Jul 21 , 2025 | 11:20 PM
గత వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీకి శాపంగా మారింది. వాస్తవానికి ఒప్పందం ప్రకారం కళాశాల భవన నిర్మాణాలు 2023 డిసెంబరు నాటికి పూర్తయితే 2024 నుంచే వంద ఎంబీబీఎస్ సీట్లతో తరగతులు ప్రారంభించాల్సి ఉంది.
సకాలంలో భవన నిర్మాణాలు పూర్తికాక ఈ ఏడాది సీట్ల పెంపునకు ఎన్‌ఎంసీ నిరాకరణ
వాస్తవానికి 2023 డిసెంబరు నాటికే పూర్తి కావలసిన నిర్మాణాలు
సక్రమంగా నిధులు విడుదల చేయని గత ప్రభుత్వం
ఈ విద్యా సంవత్సరంలోనూ 50 సీట్లకే పరిమితం కానున్న అడ్మిషన్లు
(పాడేరు- ఆంధ్రజ్యోతి)
గత వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీకి శాపంగా మారింది. వాస్తవానికి ఒప్పందం ప్రకారం కళాశాల భవన నిర్మాణాలు 2023 డిసెంబరు నాటికి పూర్తయితే 2024 నుంచే వంద ఎంబీబీఎస్ సీట్లతో తరగతులు ప్రారంభించాల్సి ఉంది. కానీ అప్పటికి తగినన్ని భవనాలు పూర్తికాకపోవడంతో 2024-25 విద్యా సంవత్సరంలో 50 సీట్లతో మాత్రమే తరగతులు ప్రారంభించేందుకు నేషనల్ మెడికల్ కౌన్సిల్(ఎఎన్‌ఎంసీ) అనుమతి ఇచ్చింది. అలాగే అవసరమైన మేరకు భవన సదుపాయాలు లేకపోవడంతో ఈ ఏడాది మిలిగిన 50 సీట్ల అడ్మిషన్లకు అనుమతిరాని పరిస్థితి నెలకొంది. ఒప్పందం ప్రకారం 2023లోనే భవన నిర్మాణాలు పూర్తయితే ఈ సమస్య వచ్చేది కాదని పలువురు అంటున్నారు.
రాష్ట్రంలో ప్రతి పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో ఒక మెడికల్ కాలేజీని నిర్మించాలనే కేంద్ర ప్రభుత్వ లక్ష్యంతో పాడేరుకు మెడికల్ కాలేజీని మంజూరు చేశారు. స్థానిక ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలకు చెందిన 35 ఎకరాల్లో 100 ఎంబీబీఎస్ సీట్లు, 500 పడకల సామర్థ్యంతో రూ.500 కోట్లతో మెడికల్ కాలేజీని నిర్మించాలనేది ప్రణాళిక. ఇందులో కేంద్రం వాటాగా రూ.350 కోట్లు కాగా, రాష్ట్రం వాటా రూ.150 కోట్లుగా కేటాయించారు. 2020 అక్టోబరు రెండో తేదీన గాంధీ జయంతిని పురస్కరించుకుని అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి వర్చువల్ విధానంలో స్థానిక మెడికల్ కాలేజీ నిర్మాణానికి ప్రారంభోత్సవం చేశారు. దీనిని డిసెంబరు 2023 నాటికి పూర్తి చేసి 2024-25 విద్యా సంవత్సరంలోనే 100 ఎంబీబీఎస్ సీట్లతో తరగతులు ప్రారంభించాలనేది ప్రణాళిక.
సకాలంలో నిధులు విడుదల కాకపోవడంతో..
స్థానిక మెడికల్ కాలేజీ నిర్మాణ పనులకు సంబంధించిన నిధుల విడుదలలో గత వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో నిర్మాణ పనులు మందగించాయి. వాస్తవానికి 2020లో ప్రారంభమైన నిర్మాణ పనులు 2023 డిసెంబరు నాటికి పూర్తి కావాల్సింది. కానీ అందుకు అనుగుణంగా పనులు చేపట్టేందుకు దశల వారీగా విడుదల కావాల్సిన నిధులు సక్రమంగా సదరు నిర్మాణ కంపెనీకి రాష్ట్ర ప్రభుత్వం నుంచి రాలేదు. దీంతో సుమారుగా ఏడాది పైబడి పనులు జరగని దుస్థితి ఏర్పడింది. తరువాత 2022 నుంచి ఒక మోస్తరుగా నిర్మాణ పనులు జోరందుకోవడంతో 2024 నాటికి మెయిన్ బ్లాక్, పలు హాస్టల్ గదులు, ప్రొఫెసర్ల నివాస భవనాలు పూర్తికాగా, గతేడాది అక్టోబరులో 50 సీట్లతో తరగతులు ప్రారంభించారు.
ఈ ఏడాది 50 సీట్లు పెంచే పరిస్థితి లేనట్టేనా?
స్థానిక ప్రభుత్వ మెడికల్ కాలేజీకి తగినన్ని భవనాల నిర్మాణం పూర్తికాకపోవడంతో ఈ ఏడాది పెరగాల్సిన రెండో దశ 50 సీట్లు పెరిగే పరిస్థితి లేదని తెలుస్తున్నది. భవన నిర్మాణాలు పూర్తయితే ఈ ఏడాది 50 సీట్ల అడ్మిషన్లకు(అంటే మొత్తం 100 సీట్లు) నేషనల్ మెడికల్ కౌన్సిల్ అనుమతి ఇచ్చేందుకు సిద్ధంగా ఉంది. ఈ మేరకు ఈ ఏడాది మే నెలలో నేషనల్ మెడికల్ కౌన్సిల్ బృందం పరిశీలించింది. వంద సీట్లకు అనుగుణంగా వసతి, ఇతర సదుపాయాలు లేవని గుర్తించింది. దీంతో అక్టోబరు నాటికి తగినన్ని భవనాలు పూర్తయితే అనుమతి ఇస్తామన్నా సంకేతాలిచ్చి నేషనల్ మెడికల్ కౌన్సిల్ మిన్నకుంది. అయితే ఈ ఏడాది మే నుంచి ఎడతెరిపిలేని వర్షాలతో మెడికల్ కాలేజీ భవన నిర్మాణాలు వేగం పుంజుకోలేదు. ఈ పరిణామాల నేపథ్యంలో ఈ ఏడాది కూడా 100 సీట్లకు అడ్మిషన్లు నిర్వహించలేని పరిస్థితి నెలకొంది.
Updated Date - Jul 21 , 2025 | 11:20 PM