నాన్నకు ప్రేమతో...
ABN, Publish Date - Jun 15 , 2025 | 12:34 AM
‘అమ్మ తొమ్మిది నెలలు మోస్తే...నాన్న పాతికేళ్లు మోస్తాడు.
పిల్లలకు వెన్నుదన్ను నాన్న
పిల్లల ఎదుగుదలలో కీలక పాత్ర తండ్రిదే
అయినా వారి ప్రేమను పొందడంలో మాత్రం ఎప్పుడూ వెనుకే..
తండ్రి త్యాగాన్ని, ప్రేమను గుర్తించి గౌరవించాల్సింది పిల్లలే
నేడు ఫాదర్స్ డే సందర్భంగా ప్రత్యేక కథనం
విశాఖపట్నం, జూన్ 14 (ఆంధ్రజ్యోతి):
‘అమ్మ తొమ్మిది నెలలు మోస్తే...నాన్న పాతికేళ్లు మోస్తాడు. రెండూ సమానమే... అయినా నాన్న ఎందుకో వెనుకబడ్డాడు. ఇంట్లో జీతం తీసుకోకుండా అమ్మ...తన జీతం అంతా కుటుంబం కోసమే ఖర్చు పెడుతూ నాన్న... ఇద్దరూ సమానమే అయినా నాన్న ఎందుకో వెనుకబడ్డాడు. నాన్న ఇలా వెనుకబడిపోవడానికి కారణం ఆయన అందరికీ వెన్నుముక కావడమే. వెన్నుముక వెనుక ఉండబట్టే దన్నుగా నిలబడగలుగుతున్నాం. ఇదేనేమో నాన్న వెనుకబడిపోవడానికి కారణం’...అంటూ తండ్రి గురించి ఓ ప్రముఖ రచయిత గొప్పగా చెప్పారు. నిజంగానే తండ్రి కష్టాన్ని, ప్రేమను చాలామంది పిల్లలు గుర్తించలేకపోతున్నారు. కుటుంబం కోసం, పిల్లల కోసం నిరంతరం శ్రమించే తండ్రి త్యాగాన్ని గుర్తు చేసుకుంటూ వారి గౌరవార్థం ఏటా జూన్ మూడో ఆదివారం ఫాదర్స్ డేను నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ‘ఆంధ్రజ్యోతి’ ప్రత్యేక కథనం...
తొలిసారి 1910లో ఫాదర్స్ డేను నిర్వహించారు. అమెరికాకు చెందిన సోనోరా స్మార్ట్ డాడ్ అనే మహిళ తన తండ్రి గౌరవార్థం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రస్తుతం వందకుపైగా దేశాల్లో ఫాదర్స్ డే వేడుకలను నిర్వహిస్తున్నారు. ఈ ప్రత్యేకమైన రోజున పిల్లలు తమ తండ్రితో ఎక్కువ సమయం గడపడం, విలువైన బహుమతులను అందించడం ద్వారా వారిని ఆనందంగా ఉంచే ప్రయత్నం చేస్తుంటారు.
తండ్రి త్యాగాన్ని గుర్తించాలి
పిల్లల శ్రేయస్సు కోసం నిరంతరం తండ్రి ఎంతగానో పరితపిస్తుంటాడు. శ్రమిస్తుంటాడు. పిల్లల ఎదుగుదలలో తండ్రి పాత్ర ఎంతో ఉంటుంది. ఈ విషయాన్ని ప్రతిఒక్కరూ గుర్తుంచుకోవాలి. తండ్రికి గౌరవాన్ని ఇవ్వడంతో పాటు వారి త్యాగాలను గుర్తించాలి.
ఇలా చేయండి..
ప్రతిరోజూ ఎంతో కొంత సమయం తండ్రితో గడిపేందుకు యత్నించాలి. దూరంగా ఉంటే వారితో రోజుకు ఒకసారైనా ఫోన్‌లో మాట్లాడాలి. ఆరోగ్యం గురించి వాకబు చేయాలి. హెల్త్ బీమా వంటివి తీసుకుని వారి ఆరోగ్యానికి రక్షణ కవచాన్ని ఏర్పాటుచేయాలి. ఆర్థిక ఇబ్బందులు లేకుండా చూసుకోవాలి. చివరి దశలో కంటికి రెప్పలా చూసుకుంటూ ముందుకుసాగాలి.
నాన్న క్రమశిక్షణ, నిబద్ధతే నాకు స్ఫూర్తి
ఎం.ఎన్.హరేంధిరప్రసాద్, కలెక్టర్, విశాఖపట్నం
మాది తమిళనాడులోని నమ్మక్కల్ జిల్లా గురుస్వామిపాల్యెం. నాన్న నాగమాణిక్యం, అమ్మ అలిమేలు. ఇద్దరూ ఎయిడెడ్ పాఠశాలల్లో పీజీటీలుగా పనిచేసేవారు. వారికి ఇద్దరు సంతానం. నేను, తరువాత చెల్లి. అమ్మ, నాన్న ఇద్దరు టీచర్లు కావడంతో చదువుపై శ్రద్ధ ఎక్కువగా ఉండేది. నాన్న క్రమశిక్షణతో ఉండేవారు. నిబద్ధతగా ఆయన ఉండడంతోపాటు మమ్మల్ని అలాగే ఉండాలని చెప్పేవారు. ఏ పనైనా కచ్చితంగా చేసినప్పుడే అనుకున్న లక్ష్యం సాధించగలమనేవారు. నాన్న పనిచేసే స్కూలు మా ఊరికి 60 కి.మీ. దూరంలో ఉండేది. ప్రతిరోజు ఇంటి నుంచి బస్టాండ్ వరకు సైకిల్‌పై వెళ్లి, అక్కడ నుంచి మూడు బస్సులు మారి మళ్లీ అక్కడ సైకిలు తీసుకుని స్కూలుకు వెళ్లేవారు. తిరిగి సాయంత్రం ఇంటికి వచ్చేవారు. మా కోసం ఆయన అంత కష్టపడ్డారు. క్రమశిక్షణ, నిబద్ధత, అనుకున్న పని కచ్చితంగా చేయాలన్న నాన్న మాటలే నాకు స్ఫూర్తిగా నిలిచాయి. చెన్నైలో 2014లో సివిల్స్ మెయిన్స్ పరీక్ష రెండుపూటలా జరిగినప్పుడు నాన్న ఇంటి నుంచి క్యారియర్ తీసుకుని వచ్చారు. సివిల్స్ ఇంటర్వ్యూ సమయంలో నాకు తోడుగా ఢిల్లీ వచ్చారు. ఇంటర్వ్యూకు వెళ్లే సమయంలో భుజం తట్టి ధైర్యంగా వెళ్లు...విజయం తథ్యమని ఆశీర్వదించారు. సివిల్స్‌లో ఎంపికైన వెంటనే నాన్న, అమ్మకు ఫోన్ చేసినప్పుడు వారు వ్యక్తపరిచిన ఆనందం ఇప్పటికీ మరిచిపోలేను. ఆయన నుంచి నేర్చుకున్న క్రమశిక్షణ, కష్టపడేతత్వం ఉద్యోగ జీవితంలో దినచర్యగా మారాయి.
స్నేహితుల్లా ఉండేవాళ్లం..
- జీపీ రాజశేఖర్, ఆంధ్రా యూనివర్సిటీ వైస్ చాన్సలర్
మా నాన్న పేరు బలరామకృష్ణ. ముగ్గురు సంతానంలో నేను రెండోవాడిని. పిల్లలను ఉన్నత స్థాయికి తీసుకువచ్చేందుకు ఆయన ఎంతో శ్రమించారు. చదువుల విషయంలో ఎప్పుడూ రాజీ పడలేదు. ఏమి చేస్తామన్న ప్రోత్సహించేవాళ్లు. ఇది చేయాలి, అది చేయాలని ఎప్పుడూ చెప్పలేదు. మేము చేస్తామనే వాటిని పరిశీలించి, మంచి,చెడులు తెలుసుకుని చెప్పేవాళ్లు. గత నెల 16న ఆయన కన్నుమూశారు. చనిపోయేంత వరకూ కూడా మేము స్నేహితుల్లా ఉండేవాళ్లం. చిన్నప్పుడు కాస్త నాన్న అంటే భయం ఉండేది. ఇంటర్ స్థాయికి వచ్చేసరికి స్నేహితులుగా మారిపోయాం. ప్రతి చిన్న విషయాన్ని కూడా నాన్నతో షేర్ చేసుకునేవాళ్లం. ఉద్యోగ రీత్యా ఎక్కడ ఉన్నా ప్రతిరోజూ కొంత సమయం నాన్నతో మాట్లాడే ప్రయత్నం చేస్తూ వచ్చాను. పిల్లల ఔన్నత్యం కోసం అహర్నిశలూ శ్రమించే వ్యక్తి నాన్న మాత్రమే. అటువంటి నాన్నను ప్రేమగా చివరి వరకూ చూసుకోవడం మినహా ఆయనకు మరేమీ ఇవ్వలేం.
నాన్నే ఎప్పటికీ మా హీరో
వీఎంఆర్‌డీఏ కమిషనర్ విశ్వనాథన్
మేము ఇద్దరు అన్నదమ్ములం. మా కోసం మా నాన్న చాలా త్యాగం చేశారు. ఆయన అనేక సౌకర్యాలు వదులుకొని మమ్మల్ని చదివించారు. నేను సివిల్స్ పాసై ఐఏఎస్ అధికారిగా ఈ రోజు ఇలా ఉన్నానంటే నాన్న ఇచ్చిన ప్రోత్సాహమే కారణం. ఆయనే ఎప్పటికీ మా హీరో.
Updated Date - Jun 15 , 2025 | 12:34 AM