మేయర్‌గా పీలా శ్రీను?
ABN, Publish Date - Apr 20 , 2025 | 01:05 AM
జీవీఎంసీ మేయర్ గొలగాని హరివెంకటకుమారిపై కూటమి ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గిన నేపథ్యంలో తదుపరి మేయర్ ఎవరనే చర్చ మొదలైంది.
దాదాపుగా ఖరారు
డిప్యూటీ మేయర్ పదవుల కోసం తీవ్రస్థాయిలో పోటీ
టీడీపీ, జనసేన, బీజేపీల్లో భారీగా ఆశావహులు
తలలు పట్టుకుంటున్న నేతలు
(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)
జీవీఎంసీ మేయర్ గొలగాని హరివెంకటకుమారిపై కూటమి ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గిన నేపథ్యంలో తదుపరి మేయర్ ఎవరనే చర్చ మొదలైంది. అయితే మేయర్‌గా తెలుగుదేశం పార్టీకి చెందిన పీలా శ్రీనివాసరావు పేరు దాదాపు ఖరారు కాగా, డిప్యూటీ మేయర్ పోస్టుల కోసం కార్పొరేటర్ల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ఎవరికి వారే పదవులను ఆశిస్తుండడంతో కూటమి నేతలు తలలు పట్టుకుంటున్నారు.
మేయర్‌గా టీడీపీ ఫ్లోర్ లీడర్, 96వ వార్డు కార్పొరేటర్ పీలా శ్రీనివాసరావును ఎన్నుకోవాలని కూటమి కార్పొరేటర్లతోపాటు నేతలు కూడా దాదాపు ఏకాభిప్రాయానికి వచ్చేశారు. దీంతో పీలా శ్రీనివాసరావు ఎన్నిక లాంఛనం కానున్నది. డిప్యూటీ మేయర్ జియ్యాని శ్రీధర్‌పై కూడా కూటమి నేతలు అవిశ్వాస తీర్మానానికి నోటీస్ ఇవ్వడంతో ఈనెల 26న కౌన్సిల్ ప్రత్యేక సమావేశం నిర్వహిస్తున్నట్టు జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి ఎం.ఎన్.హరేంధిరప్రసాద్ ఇప్పటికే ప్రకటించారు. ఈలోగానే జియ్యాని శ్రీధర్ తన పదవికి స్వచ్ఛందంగా రాజీనామా చేసే అవకాశం ఉందంటున్నారు. శ్రీధర్ రాజీనామాతో ఖాళీ అయ్యే డిప్యూటీ మేయర్ పోస్టు కోసం టీడీపీ, జనసేన, బీజేపీ మధ్య తీవ్ర పోటీ నెలకొంది. టీడీపీ నుంచి 76వ వార్డు కార్పొరేటర్ గంధం శ్రీనివాసరావు, 90వ వార్డు కార్పొరేటర్ బొమ్మిడి రమణ, ఐదో వార్డు కార్పొరేటర్ మొల్లి హేమలత, 18వ వార్డు కార్పొరేటర్ గొలగాని మంగవేణి, జనసేన నుంచి 33వ వార్డు కార్పొరేటర్ భీశెట్టి వసంతలక్ష్మి, 43వ వార్డు కార్పొరేటర్ పెద్దిశెట్టి ఉషశ్రీ, 64వ వార్డు కార్పొరేటర్ దల్లి గోవిందరెడ్డి పోటీపడుతున్నారు. బీజేపీ నుంచి 48వ వార్డు కార్పొరేటర్ గంకల కవిత డిప్యూటీ మేయర్ పదవి ఆశిస్తున్నారు. మేయర్ పదవిని టీడీపీ తీసుకుంటుండడంతో, డిప్యూటీ మేయర్ పదవి తమకు ఇవ్వాలని జనసేన నేతలు గట్టిగా పట్టుబడుతున్నారు. అయితే మేయర్‌గా ఉన్న యాదవ సామాజిక వర్గానికి చెందిన మహిళను తొలగిస్తున్నందున డిప్యూటీ మేయర్ పదవిని ఆ సామాజిక వర్గానికి చెందిన మహిళకు ఇవ్వాలని టీడీపీ నేతలు వాదిస్తున్నారు. అలాగైతే మొల్లి హేమలత, గొలగాని మంగవేణిలో ఒకరికి ఇవ్వాల్సి వస్తుంది. ఒకవేళ అదే జరిగితే విద్యావంతురాలైన హేమలతవైపే నేతలు మొగ్గుచూపే అవకాశం ఉంటుంది. అయితే కాపు సామాజికవర్గానికి చెందిన జియ్యాని శ్రీధర్‌ను తప్పిస్తే ఆ సామాజిక వర్గానికి చెందిన వారికే అవకాశం ఇవ్వాలని టీడీపీ నేతలు కొందరు వాదిస్తున్నారు. అప్పుడు 76వ వార్డు కార్పొరేటర్ గంధం శ్రీనివాసరావుకు చాన్స్ దక్కుతుంది. ఒకవేళ యాదవ సామాజిక వర్గానికి చెందినవారికి ఇవ్వాలనుకుంటే మాత్రం 90వ వార్డు కార్పొరేటర్ బొమ్మిడి రమణ పేరును పరిశీలించే అవకాశం ఉంది.
జనసేనకు డిప్యూటీ మేయర్ పదవి చాన్స్ వ స్తే ఎవరికి అవకాశం దక్కుతుందనే దానిపై ఆ పార్టీలో విశ్లేషణలు మొదలయ్యాయి. జనసేన నుంచి మొదట ఆ పార్టీ ఫ్లోర్‌లీడర్ భీశెట్టి వసంతలక్ష్మి పేరు పరిశీలనకు వస్తుంది. కానీ అదే సామాజిక వర్గానికి చెందిన కార్పొరేటర్‌కు మేయర్ పదవి దక్కినందున ఆమెకు అవకాశం ఉండదని నేతలు చెబుతున్నారు. అలాంటప్పుడు కొత్తగా పార్టీలో చేరిన కాపు సామాజిక వర్గానికి చెందిన 43వ వార్డు కార్పొరేటర్ ఉషశ్రీ పేరు పరిశీలించే అవకాశం ఉంది. అందుకోసం ఆమె తనవంతు ప్రయత్నాలు ప్రారంభించారు. అయితే ఆమె ఇటీవలే వైసీపీ నుంచి వచ్చినందున మొదటి నుంచి జనసేన, టీడీపీల్లో ఉన్న కార్పొరేటర్లు అంగీకరించే పరిస్థితి ఉండదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అలాంటప్పుడు 64వ వార్డు కార్పొరేటర్ దల్లి గోవిందరెడ్డి పేరు పరిశీలనకు రావచ్చునని, అయితే సామాజిక వర్గాల సమీకరణాల్లో ఆయనకు అవకాశం దక్కడం కష్టమేనని జనసేన నేతలు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు బీజేపీ కార్పొరేటర్ గంకల కవిత కూడా డిప్యూటీ మేయర్ పదవి కోసం ఆ పార్టీ నేతలపై ఒత్తిడి చేస్తున్నారు.
Updated Date - Apr 20 , 2025 | 01:05 AM