ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

భూముల అప్పగింతకు ఎందుకంత అత్యుత్సాహం!

ABN, Publish Date - May 12 , 2025 | 12:07 AM

జిల్లాలో రూ.వేల కోట్ల విలువైన ప్రభుత్వ భూములు ప్రైవేటు వ్యక్తులకు అప్పగింతలో ఓ ఉన్నతాధికారి అత్యుత్సాహంపై రెవెన్యూ వర్గాల్లో విస్మయం వ్యక్తమవుతుంది.

  • ఓ ఉన్నతాధికారి తీరుపై రెవెన్యూ వర్గాల విస్మయం

  • గతంలో తప్పులు చేసిన పలువురు అధికారులపై చర్యలేవీ?

  • రెండు సిట్‌ల నివేదికలను బయటపెడితే అక్రమార్కులైన అధికారులెవరో వెల్లడి

  • ఎండాడలో మాజీ సైనికుడికి భూమి అప్పగింతలో కీలకంగా వ్యవహరించిన కూటమి నేత

విశాఖపట్నం, మే 11 (ఆంధ్రజ్యోతి):

జిల్లాలో రూ.వేల కోట్ల విలువైన ప్రభుత్వ భూములు ప్రైవేటు వ్యక్తులకు అప్పగింతలో ఓ ఉన్నతాధికారి అత్యుత్సాహంపై రెవెన్యూ వర్గాల్లో విస్మయం వ్యక్తమవుతుంది. ప్రభుత్వ భూముల రక్షణ కోసం వాటిని నిషేధిత జాబితాలో జిల్లా అధికారులు చేర్చిన విషయం తెలిసి కూడా తానేమి చేసినా చెల్లుతుందన్న దీమాతో వ్యవహరించారని రెవెన్యూ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఒకటి, రెండు కాదు... ఏకంగా 10 నుంచి 12 సర్వే నంబర్లకు చెందిన 60 నుంచి 70 ఎకరాల భూములను ధారాదత్తం చేయడానికి సాహసం చేయడమేంటనే వాదన వినిపిస్తోంది. పొరపాటున 22-ఏ జాబితాలో చేరిన ప్రైవేటు భూములను నిషేధిత జాబితా నుంచి తొలగించడానికి ప్రయత్నిస్తే ఎవరూ ఏమీ చేయలేరు. అటువంటిది చెరువులు, నీరు ప్రవహించే ప్రాంతాలు, అటవీశాఖకు చెందిన భూములను ఎలా 22-ఏ నుంచి తప్పించాలని జిల్లా యంత్రాంగానికి ఆదేశిస్తారని రిటైర్డు తహశీల్దార్‌ ఒకరు ప్రశ్నిస్తున్నారు. ముడసర్లోవ రిజర్వాయర్‌ క్యాచ్‌మెంట్‌ ఏరియాగా పేర్కొన్న భూముల్లో కొన్ని అటవీశాఖకు చెందినవి. అటవీశాఖ భూములను ప్రైవేటు వ్యక్తులకు ఇవ్వకూడదు. ముడసర్లోవలో సర్వే నంబరు 31/2లో ఉన్న భూములను 22-ఏ నుంచి తప్పించాలని ఆదేశించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఒకరి అర్జీని ఆమోదిస్తే ముడసర్లోవ పరీవాహక ప్రాంతంలో చాలా భూములు పరాధీనమవుతాయనే విషయం ఆ ఉన్నతాధికారికి తెలియదా? అన్న సందేహం వ్యక్తమవుతుంది.

జిల్లాలో తహశీల్దార్‌, ఆపై అధికారులు కొందరు పలు తప్పులు చేయడంతో అనేక సర్వే నంబర్లపై కోర్టులో కేసులు నడుస్తున్నాయి. కొందరు అధికారుల నిర్వాకంతో జిల్లాలో కోట్ల రూపాయల విలువైన భూములు పరాధీనమయ్యాయి. దళారులతో కుమ్మక్కైన అధికారులపై ఎలాంటి చర్యలు లేకపోవడంతో మరికొందరు అధికారులు చేతివాటం ప్రదర్శిస్తున్నారు. మధురవాడలో సర్వే నంబర్లు 367, 368, 369లో భూములు ప్రైవేటు వ్యక్తులకు కేటాయించే వ్యవహారంలో ఏడుగురు డిప్యూటీ కలెక్టర్లపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశించినా వారిపై విచారణకు అధికారులు ఇంకా తాత్సారం చేస్తున్నారు. భూముల అక్రమాలపై గతంలో టీడీపీ, తరువాత అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం వేర్వేరుగా సిట్‌లు వేశారు. రెండు సిట్‌ల నివేదికలు ప్రభుత్వం వద్ద పెండింగ్‌లోనే ఉన్నాయి. నగర పరిసరాల్లో అనేక భూముల పరాధీనం కావడానికి పలువురు అధికారుల పాత్ర ఉన్నట్టు రెండు సిట్‌లు నిర్ధారించాయి. ఈ రెండు సిట్‌ల నివేదికలను బహిర్గతం చేస్తే అక్రమార్కులైన అధికారుల ఎవరో వెల్లడవుతుంది. తద్వారా వారిపై చర్యలు తీసుకుంటే భవిష్యత్తులో ప్రతిఒక్కరూ విధి నిర్వహణలో పక్కాగా ఉంటారని రెవెన్యూ వర్గాలు అభిప్రాయ పడుతున్నాయి.

ఇదిలావుండగా విశాఖ రూరల్‌ మండలం ఎండాడలో సర్వే నంబర్‌ 14-1లో 5.10 ఎకరాల భూమి మాజీ సైనికాధికారికి కట్టబెట్టడంలో గత ప్రభుత్వంలో చక్రం తిప్పిన ఇద్దరు నేతలు కూటమి ప్రభుత్వంలోనూ పైరవీలు చేశారనే ఆరోపణలున్నాయి. వీరిలో ఒకరు ప్రస్తుతం కూటమి పార్టీలో కొనసాగుతుండడంతో తనకున్న పరిచయాలతో పైరవీలు చేశారనే విమర్శలున్నాయి. పార్టీ మారినా గతంలో ఉన్న పరిచయాలను కొనసాగించి భూముల ధారాదత్తంలో కీలక పాత్ర వహించడంపై కూటమి పార్టీలో కొందరు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - May 12 , 2025 | 12:07 AM