ఐటీడీఏకి ఎందుకీ దుస్థితి
ABN, Publish Date - Jul 17 , 2025 | 11:00 PM
రాష్ట్రంలోనే అత్యధిక మంది గిరిజనులున్న ఐటీడీఏగా గుర్తింపు పొందిన పాడేరు ఐటీడీఏలో గత ఆరు నెలలుగా ముఖ్యమైన ప్రాజెక్టు అధికారి పోస్టు భర్తీ కాలేదు. వాస్తవానికి శాశ్వత ప్రాజెక్టు అధికారి ఉన్న సందర్భాల్లోనే సంపూర్ణంగా గిరిజనాభివృద్ధి జరగని పరిస్థితుల్లో సదరు పోస్టు ఆరు నెలలుగా ఇన్‌చార్జితోనే కొనసాగుతుందంటే గిరిజనాభివృద్ధి ఎటు పోతుందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు.
ఆరు నెలలుగా ఇన్‌చార్జి పాలన
జాయింట్ కలెక్టర్‌కే పీవోగా అదనపు బాధ్యతలు
భర్తీకి నోచుకోని పీవో, కాఫీ ఏడీ, టీడబ్ల్యూ డీడీ, పీఏవో, పలుముఖ్యమైన పోస్టులు
గిరిజన సంక్షేమ శాఖా మంత్రే జిల్లా ఇన్‌చార్జి మంత్రిగా ఉన్నా దక్కని ఫలితం
రాష్ట్రంలోని పెద్ద ఐటీడీఏలోనే ఇటువంటి పరిస్థితి
పాలకుల నిర్లక్ష్యం కొనసాగుతున్నదని గిరిజన సంఘాల విమర్శలు
(పాడేరు- ఆంధ్రజ్యోతి)
రాష్ట్రంలోనే అత్యధిక మంది గిరిజనులున్న ఐటీడీఏగా గుర్తింపు పొందిన పాడేరు ఐటీడీఏలో గత ఆరు నెలలుగా ముఖ్యమైన ప్రాజెక్టు అధికారి పోస్టు భర్తీ కాలేదు. వాస్తవానికి శాశ్వత ప్రాజెక్టు అధికారి ఉన్న సందర్భాల్లోనే సంపూర్ణంగా గిరిజనాభివృద్ధి జరగని పరిస్థితుల్లో సదరు పోస్టు ఆరు నెలలుగా ఇన్‌చార్జితోనే కొనసాగుతుందంటే గిరిజనాభివృద్ధి ఎటు పోతుందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు.
వాస్తవానికి గిరిజనుల అభివృద్ధి, సంక్షేమానికి ఐటీడీఏ కార్యాలయాన్ని దేవాలయంగా, ప్రాజెక్టు అధికారిని దేవుడుగా గిరిజనులు భావిస్తారు. కానీ అటువంటి గుర్తింపు, ప్రాధాన్యత పొందిన ఐటీడీఏను దేవుడు లేని ఆలయంగా మార్చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖా మంత్రి, జిల్లా ఇన్‌చార్జి మంత్రి ఒక్కరే అయినప్పటికీ స్థానిక ఐటీడీఏకు ఈ దుస్థితి ఏర్పడడం విచారకర మని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఏడు ఐటీడీఏల పరిధిలో మొత్తం 27 లక్షల మంది గిరిజనులుండగా, ఒక్క పాడేరు ఐటీడీఏలోనే ఏడున్నర లక్షల మంది గిరిజనులున్నారు. ఈ క్రమంలో రాష్ట్రంలోని ఇతర ఐటీడీఏల కంటే స్థానిక ఐటీడీఏపై ప్రత్యేక శ్రద్ధ కనబరచి, బలోపేతం చేసేందుకు చర్యలు చేపట్టాల్సి ఉండగా, పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. దీంతో ప్రస్తుతం ప్రాజెక్టు అధికారి, అసిస్టెంట్ ప్రాజెక్టు అధికారి, గిరిజన సంక్షేమ శాఖ ఉప సంచాలకుడు, కాఫీ విభాగం సహాయ సంచాలకుడు, ఉపాధి హామీ పథకం ఏపీడీ, ప్రాజెక్టు వ్యవసాయాధికారి వంటి కీలకమైన పోస్టులు సైతం చాలా కాలంగా ఇన్‌చార్జుల పాలనలో కొనసాగుతుండగా రెండేళ్లుగా ఖాళీగా ఉన్న అదనపు జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి పోస్టును ఇటీవల ఒక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్‌కు పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు.
ఇన్‌చార్జుల పాలనతో ఐటీడీఏ ఆశయానికి గండి
సామాజికంగా, ఆర్థికంగా ఎంతో వెనుకబాటుకు గురైన గిరిజనుల సంక్షేమం, అభివృద్ధికి ప్రత్యేక చర్యలు చేపట్టాలనే లక్ష్యంతో సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థ(ఐటీడీఏ)లను 1974లో కేంద్ర ప్రభుత్వ సూచనలతో ఏర్పాటు చేశారు. రాజ్యాంగం ఐదో షెడ్యూల్ ఆధారంగా వీటిని ఏర్పాటు చేయడంతో కలెక్టర్ ఐటీడీఏకు చైౖర్మన్‌గా వ్యవహరించేలా ప్రాజెక్టు అధికారి ఆధ్వర్యంలో ఐటీడీఏ ద్వారా వివిధ ప్రభుత్వ శాఖలతో సింగిల్ లైన్ అడ్మినిస్ట్రేషన్ చేసేందుకు గానూ పీవోకు ప్రత్యేక అధికారులు కల్పించారు. దీంతో ఐటీడీఏ పరిధిలోని అన్ని ప్రభుత్వ శాఖలపై ఆధిపత్యం చెలాయించే అవకాశాన్ని రాజ్యాంగం కల్పించింది. అలాగే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సైతం గిరిజనుల సంక్షేమం, అభివృద్ధికి ప్రత్యేక నిధులు విడుదల చేస్తాయి. జిల్లాలో కలెక్టర్ తరువాత అదే స్థాయిలో అధికారాలు కేవలం ఐటీడీఏ పీవోకు మాత్రమే ఉంటాయి. అటువంటి ప్రత్యేకత కలిగిన పీవో పోస్టులో శాశ్వత అధికారి ఉన్నప్పుడే ఆశించిన ఫలితాలు సాధించలేని దుస్థితి. ఇక ఆ పోస్టును సైతం ఇన్‌చార్జులకు అప్పగిస్తే పరిస్థితి ఎలా ఉంటుందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఇన్నాళ్లు ఇక్కడ పీవోగా పని చేసిన వి.అభిషేక్‌ను ఈ ఏడాది జనవరి 20న పోలవరం ప్రాజెక్టు అడ్మినిస్ట్రేటర్‌గా బదిలీ చేసినప్పటికీ, ఆయన స్థానంలో ఇప్పటికీ ఎవర్ని నియమించలేదు. దీంతో అప్పటి నుంచి స్థానిక జాయింట్ కలెక్టర్ డాక్టర్ ఎంజే.అభిషేక్‌గౌడ ఐటీడీఏ పీవోగా ఇన్‌చార్జి బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు.
గిరిజన సంక్షేమ శాఖ మంత్రే జిల్లా ఇన్‌చార్జి మంత్రిగా ఉన్నా....
రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖా మంత్రే జిల్లా ఇన్‌చార్జి మంత్రిగా ఉన్నప్పటికీ స్థానిక ఐటీడీఏను బలోపేతం చేసేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఐటీడీఏ పీవో, ఏపీవోతో పాటు ఖాళీగా ఉన్న ఇతర ముఖ్య అధికారుల పోస్టులు భర్తీ చేసి, తను ఇన్‌చార్జి మంత్రిగా ఉన్న ఐటీడీఏను ప్రగతి పథంలో నడిపించాల్సిన మంత్రి గుమ్మడి సంధ్యారాణి ఆ దిశగా కనీస చర్యలు చేపట్టకపోవడం ఘోరమని గిరిజన సంఘాల ప్రతినిధులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనే పాడేరు ఐటీడీఏ కేంద్రంగా రాష్ట్రంలోని పది ఐటీడీఏలకు సంబంధించిన గిరిజన సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలపై గిరిజన సంక్షేమ శాఖా మంత్రి, గిరిజన సంక్షేమ శాఖ ప్రధాన కార్యదర్శి, గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్ వంటి అధికారులు సమీక్షలు నిర్వహించే వారు. అటువంటి ప్రాధాన్యత కలిగిన స్థానిక ఐటీడీఏలో నేడు పీవో పోస్టు సైతం ఆరు నెలలుగా భర్తీ కాని పరిస్థితి కొనసాగడం గమనార్హం. స్థానిక ఐటీడీఏ కార్యాలయంపై గత వైసీపీ ప్రభుత్వం చూపిన నిర్లక్ష్యమే ఇప్పుడు కూటమి ప్రభుత్వం సైతం కొనసాగిస్తుందనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి.
Updated Date - Jul 17 , 2025 | 11:00 PM