రోడ్లకు మోక్షం ఎప్పుడో?
ABN, Publish Date - Jul 13 , 2025 | 12:54 AM
జిల్లాలో గోతులమయమై అధ్వానంగా మారిన పలు తారురోడ్ల పునర్నిర్మాణానికి ప్రభుత్వం నిధులు మంజూరు చేసినా సంబంధిత కాంట్రాక్టర్లు పనులు చేపట్టేందుకు ముందుకు రాకపోవడంతో ఆయా మార్గాల్లో రాకపోకలు సాగించే వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. జిల్లాలో పలుచోట్ల ఆర్‌అండ్‌బీ రహదారులు అఽధ్వానంగా దర్శనమిస్తున్నాయి.
పలుచోట్ల నిధులు మంజూరైనా ప్రారంభం కాని నిర్మాణ పనులు
నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న పలువురు కాంట్రాక్టర్లు
వాహనదారుల సహనాన్ని పరీక్షిస్తున్న రహదారులు
ఎన్ని ఫిర్యాదులు చేసినా అధికారులు పట్టించుకోవడం లేదని ప్రజల ఆవేదన
(అనకాపల్లి-ఆంధ్రజ్యోతి)
జిల్లాలో గోతులమయమై అధ్వానంగా మారిన పలు తారురోడ్ల పునర్నిర్మాణానికి ప్రభుత్వం నిధులు మంజూరు చేసినా సంబంధిత కాంట్రాక్టర్లు పనులు చేపట్టేందుకు ముందుకు రాకపోవడంతో ఆయా మార్గాల్లో రాకపోకలు సాగించే వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. జిల్లాలో పలుచోట్ల ఆర్‌అండ్‌బీ రహదారులు అఽధ్వానంగా దర్శనమిస్తున్నాయి. పలు రోడ్లకు పునర్నిర్మాణ నిధులు మంజూరుకే పరిమితమయ్యాయి. కొన్ని రోడ్ల పనుల విషయంలో కాంట్రాక్టర్ల జాప్యం కారణంగా నత్తనడకన సాగుతున్నాయి. మరికొన్ని రహదారులకు గతంలో చేసిన పనులకే బిల్లులు అందలేదని, కొత్తగా పనులు చేపడితే తాము నష్టపోతామంటూ కాంట్రాక్టర్లు పనులు చేపట్టేందుకు ముందుకు రావడం లేదు. దీంతో చోడవరం నుంచి వయా వడ్డాది బుచ్చెయ్యపేట, రావికమతం, రోలుగుంట మండలాల మీదుగా బీఎన్ రోడ్ల పరిస్థితి దారుణంగా మారింది. అడుక్కో గొయ్యి ఉండడంతో ఆయా మార్గాల్లో రాకపోకలు సాగించడం నరకాన్ని తలపిస్తోందని స్థానికులతో పాటు పలువురు వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
బుచ్చెయ్యపేట మండలం ఎల్.సింగవరం రోడ్డుపై భారీ గుంతలను తాత్కాలికంగా కప్పేసి మమా.. అనిపించారు. టెండర్లపై పనులు చేజిక్కించుకున్న పలువురు కాంట్రాక్టర్లు రోడ్ల నిర్మాణాలను వేగవంతం చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. అనకాపల్లి నుంచి వెంకన్నపాలెం వరకు సుమారు ఆరు కిలోమీటర్ల పొడవునా ఆర్‌అండ్‌బీ రోడ్డు పనులు అర్ధంతరంగా నిలిచిపోయాయి. నర్సీపట్నం నుంచి రేవుపోలవరం రోడ్డు, వడ్డాది నుంచి తాటిపర్తి వరకు గల రహదారి పరిస్థితి అంతే. సుమారు 13 కిలోమీటర్ల పొడవు గల ఈ రోడ్డు పనులను గతనెలలో కాంట్రాక్టరు ప్రారంభించి మధ్యలోనే నిలిపివేశాడు. అలాగే చోడవరం నుంచి వడ్డాది వరకు బీఎన్ రోడ్డు పనులను అరకొరగా చేపట్టి వదిలేసి నెలలు గడుస్తున్నా మోక్షం లభించడం లేదు. ఈ పనుల నిర్వహణ బాధ్యతలను అధికార పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యే చేజిక్కించుకున్నా పనులు మాత్రం చేపట్టడం లేదు. దీంతో నిత్యం రద్దీగా ఉండే ఈ రోడ్డు మీదుగా వయా వడ్డాది మాడుగుల, తాటిపర్తి మీదుగా పాడేరు రాకపోకలు సాగించే వాహనదారులు గత వైసీపీ ప్రభుత్వంలో పడిన కష్టాలనే మళ్లీ అనుభవిస్తున్నారు. గుంతలమయమైన రహదారులపై రాకపోకలు సాగించడం వల్ల తమ వెహికల్స్ తరచూ మరమ్మతులకు గురవుతున్నాయని పలువురు వాహనదారులు వాపోతున్నారు.
ఫిర్యాదులు చేసినా ఫలితం లేదాయె..
జిల్లాలోని రహదారుల దుస్థితిపై అనేకసార్లు అధికారులకు ఫిర్యాదులు చేసినా ఫలితం లేకుండా పోతుందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల చోడవరం నుంచి వడ్డాది రోడ్డు బాగు చేయాలని కొందరు న్యాయవాదులు ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. జిల్లాలోని రోడ్ల దుస్థితిపై తగిన చర్యలు చేపట్టవలసిందిగా అనకాపల్లి ఎంపీ సీఎం రమేశ్ ఇటీవల స్వయంగా సీఎం చంద్రబాబునాయుడును కలిసి కోరారు. రోడ్లను బాగు చేయాల్సిన ఆవశ్యకత ఉందని వివరించారు. కాగా రహదారుల దుస్థితిపై ఎన్నిమార్లు ఫిర్యాదు చేసినా అధికారులు స్పందించడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి రోడ్ల పునర్నిర్మాణ పనులను వేగవంతం చేసేందుకు పటిష్ట చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.
Updated Date - Jul 13 , 2025 | 12:54 AM