దారికొచ్చేది ఎన్నడో?
ABN, Publish Date - Jun 23 , 2025 | 11:41 PM
రోడ్డంతా గోతులమయం. వర్షమొస్తే పరిస్థితి దారుణం. రాకపోకలకు నాలుగు పంచాయతీల ప్రజల ఇబ్బందులు. ఎన్నో ఏళ్లుగా తప్పని అవస్థలు. ఆర్‌అండ్‌బీ అధికారులు పట్టించుకోవడం లేదు. ప్రజాప్రతినిధులు కన్నెత్తి చూడడం లేదు.. ఇదీ మండలంలోని మారుమూల పెదకోట పంచాయతీ కేంద్రం నుంచి కివర్ల పంచాయతీ జాలడ గ్రామం వరకు సుమారు 13 కిలో మీటర్లు రోడ్డు దుస్థితి.
గోతులమయంగా పెదకోట- జాలడ రోడ్డు
13 కిలోమీటర్ల మేర అధ్వానం
నాలుగు పంచాయతీల గిరిజనుల అవస్థలు
పట్టించుకోని ఆర్‌అండ్‌బీ అధికారులు
అనంతగిరి, జూన్ 23 (ఆంధ్రజ్యోతి): రోడ్డంతా గోతులమయం. వర్షమొస్తే పరిస్థితి దారుణం. రాకపోకలకు నాలుగు పంచాయతీల ప్రజల ఇబ్బందులు. ఎన్నో ఏళ్లుగా తప్పని అవస్థలు. ఆర్‌అండ్‌బీ అధికారులు పట్టించుకోవడం లేదు. ప్రజాప్రతినిధులు కన్నెత్తి చూడడం లేదు.. ఇదీ మండలంలోని మారుమూల పెదకోట పంచాయతీ కేంద్రం నుంచి కివర్ల పంచాయతీ జాలడ గ్రామం వరకు సుమారు 13 కిలో మీటర్లు రోడ్డు దుస్థితి.
పెదకోట నుంచి జాలడ వరకు 13 ఏళ్ల క్రితం తారు రోడ్డు వేశారు. అయితే నిర్వహణ లేకపోవడంతో రోడ్డంతా గోతులమయమైంది. దీంతో నాలుగు పంచాయతీల గిరిజనులు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రెండేళ్ల క్రితం జీనబాడు పంచాయతీ దిబ్బపాలెం నుంచి పెదకోట వరకు 5.8 కిలోమీటర్ల రోడ్డుకు మరమ్మతులు చేశారు. అలాగే దిబ్బపాలెం నుంచి జీనబాడు వరకు కూడా మరమ్మతు పనులు చేపట్టారు. అక్కడి వరకు సమస్య పరిష్కారమైనప్పటికీ పెదకోట నుంచి జాలడ వరకు సుమారు 13 కిలోమీటర్లు రోడ్డంతా దారుణంగా ఉంది. పెదకోట నుంచి కుడియా మధ్యలో రోడ్డు వర్షాలకు కొట్టుకుపోయి రాళ్లు తేలి ప్రమాదకరంగా తయారైంది. కుడియా సమీపంలోని కాజ్‌వేపై నుంచి గెడ్డ పారుతుండడంతో వర్షకాలంలో పూర్తిగా రాకపోకలు నిలిచిపోతున్నాయి. కాజ్‌వే ప్రదేశంలో వంతెన నిర్మించాల్సి ఉంది. కాగా పెదకోట, కివర్ల పంచాయతీ పరిధిలో గల సుమారు 35 గ్రామాలతో పాటు పినకోట, జీనబాడు పంచాయతీల్లోని పలు గ్రామాల గిరిజనులు రాకపోకలకు ఇబ్బందులు పడుతున్నారు.
తరచూ ప్రమాదాలు
పెదకోట నుంచి జాలడ వరకు రోడ్డు గోతులమయంగా ఉన్నా ఆర్‌అండ్‌బీ అధికారులు పట్టించుకోవడం లేదు. దీంతో ఈ మార్గంలో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. 2024 మార్చి నెలలో హుకుంపేట నుంచి దేవరాపల్లి వెళుతున్న వ్యాన్ కుడియా సమీపంలో బోల్తా పడి పలువురు తీవ్రంగా గాయపడగా, కాశీపురం గ్రామానికి చెందిన దాసరి లక్ష్మణరావు మృతి చెందాడు. 2024 మే 13న కుడియా సమీపంలో వ్యాన్ బోల్తా పడి పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఇవి ఉదాహరణ మాత్రమే.. ఇటువంటి ప్రమాదాలు చాలా జరిగాయి. కానీ ఆర్‌అండ్‌బీ అధికారులు స్పందించడం లేదని పలు గ్రామాల ప్రజలు ఆరోపిస్తున్నారు.
Updated Date - Jun 23 , 2025 | 11:41 PM