సంతల్లో షేడ్ నెట్‌లు ఏవీ?
ABN, Publish Date - Jun 04 , 2025 | 11:40 PM
ఎండల నేపథ్యంలో ఏజెన్సీలోని వారపు సంతల్లో షేడ్ నెట్‌లు ఏర్పాటు చేయాలని కలెక్టర్ ఆదేశించినా అధికారులు పట్టించుకోలేదు. దీంతో గిరిజన వర్తకులు ఎటువంటి నీడ లేని చోట వ్యాపారాలు సాగిస్తున్నారు.
కలెక్టర్ ఆదేశించినా అధికారులు బేఖాతరు
ఎండల్లోనే అవస్థలు పడుతున్న గిరిజన చిరు వర్తకులు
వారపు సంతల్లో సదుపాయాలపై అధికారుల నిర్లక్ష్యం
(పాడేరు- ఆంధ్రజ్యోతి)
ఎండల నేపథ్యంలో ఏజెన్సీలోని వారపు సంతల్లో షేడ్ నెట్‌లు ఏర్పాటు చేయాలని కలెక్టర్ ఆదేశించినా అధికారులు పట్టించుకోలేదు. దీంతో గిరిజన వర్తకులు ఎటువంటి నీడ లేని చోట వ్యాపారాలు సాగిస్తున్నారు. ప్రతి వారపు సంతలో అవసరమైన మేరకు షేడ్ నెట్‌లు ఏర్పాటు చేయాలని గత నెల 16న అధికారులను కలెక్టర్ ఏఎస్ దినేశ్‌కుమార్ ఆదేశించినా ఇప్పటి వరకు అధికారులు దీనిని అమలు చేయలేదు.
ఏజెన్సీలో ప్రతి వారపు సంతల్లోనూ ఆశీలు వసూలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఆశీలు కాంట్రాక్టర్ ద్వారా వారపు సంతల్లో షేడ్ నెట్‌లు ఏర్పాటు చేసేందుకు పంచాయతీ అధికారులు చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు. అయితే దీనిని పంచాయతీ అధికారులు పట్టించుకున్న దాఖలాలు లేవు. కనీసం ఆ విషయంపై సంతల్లో ఆశీలు వసూలు చేస్తున్న కాంట్రాక్టర్‌కు పంచాయతీ అధికారులు సమాచారం అందించినట్టు కనిపించడం లేదు. ఈ క్రమంలో గురువారం పాడేరు మండలం గుత్తులపుట్టు, శనివారం హుకుంపేట మండల కేంద్రం, సోమవారం పెదబయలు మండల కేంద్రం, మంగళవారం జి.మాడుగుల మండల కేంద్రాల్లోని వారపు సంతలను ‘ఆంధ్రజ్యోతి’ ప్రతినిధులు పరిశీలించారు. ఎక్కడా కలెక్టర్ ఆదేశాల మేరకు షేడ్ నెట్‌లు ఏర్పాటు చేసిన పాపాన పోలేదు. దీంతో ఎండల్లోనే గిరిజన చిరు వర్తకులు వారి వ్యాపారాలు సాగిస్తున్నారు. కొందరు ప్లాస్టిక్ పరదాలను సమకూర్చుకుని నీడకు ఏర్పాటు చేసుకుంటున్నారు. అంతకు మించి అధికారులు ప్రత్యేకంగా ఎక్కడా షేడ్ నెట్‌లు ఏర్పాటు చేయలేదని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
సంతల్లో సదుపాయాల కల్పనపై నిర్లక్ష్యం
వారపు సంతల్లో కనీస సదుపాయాల కల్పనలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే వాదన బలంగా వినిపిస్తున్నది. ఏజెన్సీలో ప్రతి వారపు సంతల్లో వర్తకుల నుంచి ఆశీలు వసూలు చేస్తున్నారు. కానీ ఆయా సొమ్ముతో సంతల్లో కనీస సదుపాయాలైన తాగునీరు, మరుగదొడ్లు వంటి సదుపాయాలు కల్పించడం లేదు. వాస్తవానికి ఆశీలు వసూలుకు అనుమతి ఇచ్చే పంచాయతీరాజ్ శాఖాధికారులు సంతల్లో సదుపాయాల కల్పనపై ప్రత్యేక దృష్టిపెట్టాలి. అలాగే రెవెన్యూ, ఇతర అధికారులు సంతల్లో సదుపాయాలపై పర్యవేక్షణ నిర్వహించి ఉన్నతాధికారులకు నివేదించాలి. కానీ అధికారులు సంతల్లోని సమస్యలు, మౌలిక సదుపాయాలపై కనీసం దృష్టి సారించడం లేదు. దీంతో గిరిజన చిరు వర్తకులకు ఇబ్బందులు తప్పడం లేదు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి మన్యం వారపు సంతల్లో సదుపాయాలపై ప్రత్యేక శ్రద్ధ కనబరచాలని పలువురు కోరుతున్నారు.
Updated Date - Jun 04 , 2025 | 11:40 PM