ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

ఏఐ ట్రాఫిక్‌ సిగ్నల్స్‌ ఏవీ?

ABN, Publish Date - May 16 , 2025 | 12:10 AM

నగరంలో నానాటికీ పెరుగుతున్న ట్రాఫిక్‌ సమస్యలను అధిగమించేందుకు ట్రాఫిక్‌ సిగ్నల్‌ వద్ద ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ)సీసీ కెమెరాలను ఏర్పాటుచేసే ప్రతిపాదనను నగర పోలీస్‌కమిషనర్‌ శంఖబ్రత బాగ్చి రూపొందించారు.

  • నగరంలో ట్రాఫిక్‌ సమస్యల పరిష్కారానికి సీపీ యోచన

  • 110 కూడళ్లలో ఏర్పాటు చేయాలని ప్రతిపాదన

  • పైలట్‌ ప్రాజెక్టుగా తొలుత పదిచోట్ల ఏర్పాటు చేస్తామని ప్రకటన

  • ఆరు నెలలైనా ఆచరణకు నోచుకోని వైనం

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

నగరంలో నానాటికీ పెరుగుతున్న ట్రాఫిక్‌ సమస్యలను అధిగమించేందుకు ట్రాఫిక్‌ సిగ్నల్‌ వద్ద ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ)సీసీ కెమెరాలను ఏర్పాటుచేసే ప్రతిపాదనను నగర పోలీస్‌కమిషనర్‌ శంఖబ్రత బాగ్చి రూపొందించారు. దీనివల్ల ట్రాఫిక్‌ సమస్యల పరిష్కారంతో పాటు రోడ్డు ప్రమాదాలు, నేరాల నియంత్రణకు అవకాశం కలుగుతుందని సీపీ ఆశాభావం వ్యక్తం చేశారు. ఇందుకు సంబంధించి గత ఏడాది నవంబరులోనే ప్రతిపాదనలు తయారుచేశామని ఆయన ప్రకటించారు. అయితే ఇది జరిగి ఆరు నెలలు గడుస్తున్నా ఇప్పటివరకు ఆచరణలోకి రాకపోవడంతో ఏఐ ట్రాఫిక్‌ సిగ్నల్స్‌ ఏర్పాటుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

నగరంలో రోడ్డు ప్రమాదాల కారణంగా ఏటా సగటున 350 మంది వరకు ప్రాణాలు కోల్పోతున్నారు. కూడళ్ల వద్ద రెడ్‌ సిగ్నల్స్‌ ఉన్నప్పటికీ అక్కడున్న ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌ తమను చూడడం లేదనే భావనతో నిబంధనలను ఉల్లంఘించి చాలామంది ముందుకు వెళుతూ ప్రమాదాలకు కారణంగా మారుతున్నారు. కొంతమంది వాహనచోదకులు అయితే ఎన్నిసార్లు జరిమానా విధించినా సరే హెల్మెట్‌ ధరించకుండా వాహనాలను నడపడం, ట్రిపుల్‌ రైడింగ్‌ చేయడం, రాంగ్‌ రూట్‌లో వాహనాలను నడపడం, సెల్‌ఫోన్‌ మాట్లాడుతూ డ్రైవింగ్‌ చేయడం వంటి ఉల్లంఘనలకు పాల్పడుతున్నారు. దీనివల్ల కూడా తరచూ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. మరికొందరైతే పోలీసులు జరిమానా విధిస్తారనే భయంతో వారున్నచోట హెల్మెట్‌ పెట్టుకుని, ఆ కూడలి దాటాక హెల్మెట్‌ తీసి పక్కన పెట్టేస్తున్నారు. దీనివల్ల రోడ్డు ప్రమాదాల నియంత్రణకు పోలీసులు ఎంత కృషి చేసినా ఆశించిన ఫలితాలు మాత్రం రావడం లేదు. దీంతో ట్రాఫిక్‌ నిబంధనలను ప్రతిఒక్కరూ పక్కాగా పాటించేలా చేయాలంటే సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించాల్సిందేనని సీపీ భావించారు. ఈ మేరకు కొంతమంది ఐటీ నిపుణులతో సమావేశమై నగరంలో ట్రాఫిక్‌ సిగ్నల్స్‌ సింక్రనైజేషన్‌తోపాటు నిబంధనలను ఉల్లంఘించే వారిని గుర్తించి వారికి జరిమానాలు విధించేలా చేసే అవకాశాలపై చర్చించారు. అత్యాధునిక సీసీ కెమెరాలను కూడళ్ల వద్ద అమర్చి వాటికి ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ)ను అనుసంధానం చేస్తే మెరుగైన ఫలితాలను రాబట్టవచ్చునని ఐటీ నిపుణులు సీపీకి వివరించారు. ఏఐ ట్రాఫిక్‌ సిగ్నల్స్‌ అందుబాటులోకి వస్తే ముందు కూడలిలో గ్రీన్‌సిగ్నల్‌ పడినప్పుడు తర్వాత జంక్షన్‌కు వాహనం వచ్చినపుడు కూడా గ్రీన్‌ సిగ్నల్‌ పడేలా సింక్రనైజ్‌ చేసేందుకు అవకాశం ఉంటుందని, తద్వారా వాహనచోదకులు సిగ్నల్స్‌ వద్ద ఆగాల్సిన పని ఉండదని తెలియజేశారు. దీనివల్ల రోడ్లపై ట్రాఫిక్‌ సమస్య తగ్గడంతో పాటు సిగ్నల్స్‌ జంపింగ్‌ చేయాల్సిన అవసరం వాహనచోదకులకు ఉండదు. అలాగే ఎవరైనా వాహనం నడుపుతున్నప్పుడు సెల్‌ ఫోన్‌ మాట్లాడుతున్నా, హెల్మెట్‌ ధరించకపోయినా, ట్రిపుల్‌ రైడింగ్‌ చేసినా, ప్రమాదకరంగా వాహనాన్ని నడిపినా సరే సీసీ కెమెరాలు ఆటోమెటిక్‌గా ఉల్లంఘనను గుర్తించి సదరు వాహనం నంబర్‌ ప్లేట్‌ ఆధారంగా దాని యజమానికి ఈ-చలానా జారీ అయిపోతోంది. ఎక్కడైనా ట్రాఫిక్‌ జామ్‌ అయినట్టయితే సమీపంలోని పోలీస్‌ స్టేషన్‌కు లేదా సిబ్బందికి సమాచారం వెంటనే చేరిపోతుంది. దీనివల్ల వారు అక్కడకు చేరుకుని సమస్యను పరిష్కరించేందుకు అవకాశం ఉంటుంది. ఎక్కువ పెండింగ్‌ చలానాలు ఉన్న వాహనం రోడ్డుపై వెళుతున్నా సరే.. ఆ వివరాలను ఆ కూడలిలోని సిబ్బందికి తెలిసిపోతుంది. ఏఐ టెక్నాలజీ కలిగిన సీసీ కెమెరాలు అందుబాటులోకి వస్తే ట్రాఫిక్‌ పోలీసులకు పెద్దగా పని ఉండదు. ట్రిపుల్‌ రైడింగ్‌, ర్యాష్‌ డ్రైవింగ్‌, సెల్‌ ఫోన్‌ డ్రైవింగ్‌, సిగ్నల్‌ జంపింగ్‌ వంటి ఉల్లంఘనలను ఏఐ టెక్నాలజీ కలిగిన సీసీ కెమెరాలే పసిగట్టి ఆటోమెటిక్‌గా చలానాలను జారీ చేస్తుంది. పోలీసులు కేవలం డ్రంకన్‌ డ్రైవ్‌ పరీక్షలు చేయడం, పెండింగ్‌ చలానాలను వసూలు చేయడం వంటి పనులు చేయాల్సి ఉంటుంది. అలాంటప్పుడు ట్రాఫిక్‌లో పనిచేసే సిబ్బందిని తగ్గించి ఇతర విధులకు కేటాయించేందుకు అవకాశం ఉంటుంది.

మరోవైపు ఏఐ టెక్నాలజీ కలిగిన సీసీ కెమెరాలు పాత నేరస్థులు, రౌడీషీటర్లు, ఎక్కడైనా నేరం చేసి పరారైపోయేవారిని గుర్తించడం పోలీసులకు సులభతరమవుతుంది. పాత నేరస్థులు, రౌడీషీటర్ల వివరాలు, చిరునామా, ఫొటోలను ఆన్‌లైన్‌ చేసి ఏఐ టెక్నాలజీ కలిగిన సీసీ కెమెరాలకు అనుసంధానం చేసినట్టయితే అలాంటివారు ఎక్కడైనా సీసీ కెమెరాకు చిక్కితే వారి వివరాలను తక్షణమే సమీపంలోని పోలీసులకు తెలియజేస్తుంది. అప్పుడు పోలీసులు అప్రమత్తమై అలాంటివారిని అదుపులోకి తీసుకోవడం ద్వారా నేరం జరగకుండా చూసేందుకు అవకాశం ఉంటుంది.

ఈ నేపథ్యంలో నగరంలో 110 కూడళ్లలో ఏఐతో కూడిన సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని సీపీ శంఖబ్రత బాగ్చి ప్రతిపాదనలు తయారుచేశారు. ఒక్కో జంక్షన్‌లో ఎన్ని కెమెరాలను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది, ఇందుకోసం ఎంత ఖర్చు అవుతుందనే దానిపై అంచనాలను తయారుచేశారు. సీసీ కెమెరాల ఏర్పాటుకు పలు ప్రైవేటు సంస్థలు ఆసక్తి చూపడంతో వారిలో మెరుగైన ప్రతిపాదనతో వచ్చేవారిని ఎంపిక చేసి వారితో పనులు చేయించేలా జీవీఎంసీసి సిఫారసు చేస్తామని గత ఏడాది నవంబరులో సీపీ తెలిపారు. పైలట్‌ ప్రాజెక్టుగా పదిచోట్ల వీటిని ఏర్పాటు చేయాలని జీవీఎంసీని కోరగా, సంబంధిత అధికారులు కౌన్సిల్‌లో ఈ అంశాన్ని చర్చించి ఆమోదించారు. అయితే ఆ తరువాత దీనిపై అతీగతీ లేకపోవడంతో ఆ ప్రతిపాదనలు అక్కడితోనే నిలిచిపోయాయి. దీంతో సీపీ ప్రతిపాదనలు ఆగిపోయినట్టేనా? అనే అనుమానాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి.

Updated Date - May 16 , 2025 | 12:10 AM