భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా సంక్షేమ పథకాలు
ABN, Publish Date - May 24 , 2025 | 11:02 PM
భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా సంక్షేమ పథకాలను రూపొందించి అమలు చేయాలని 20 సూత్రాల అమలు కమిటీ చైర్మన్ లంకా దినకర్ సూచించారు. అనకాపల్లి కలెక్టరేట్‌లో శనివారం కేంద్ర ప్రయోజిత పథకాలు, ప్రాజెక్టుల అమలు పురోగతి, మౌలిక సదుపాయాలకు సంబంధించిన అంశాలపై శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు, కలెక్టర్ విజయకృష్ణన్‌తో కలిసి అధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు.
వికసిత భారత్, స్వర్ణాంధ్ర సాధనే ధ్యేయం
20 సూత్రాల అమలు కమిటీ చైర్మన్ లంకా దినకర్
అనకాపల్లి, మే 24 (ఆంధ్రజ్యోతి): భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా సంక్షేమ పథకాలను రూపొందించి అమలు చేయాలని 20 సూత్రాల అమలు కమిటీ చైర్మన్ లంకా దినకర్ సూచించారు. అనకాపల్లి కలెక్టరేట్‌లో శనివారం కేంద్ర ప్రయోజిత పథకాలు, ప్రాజెక్టుల అమలు పురోగతి, మౌలిక సదుపాయాలకు సంబంధించిన అంశాలపై శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు, కలెక్టర్ విజయకృష్ణన్‌తో కలిసి అధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వికసిత్ భారత్, స్వర్ణాంధ్ర సాధనే ధ్యేయంగా పని చేయాలన్నారు. భవిష్యత్తులో అనకాపల్లి జిల్లా 15 శాతం ఆర్థిక వృద్ధి సాధించాలన్నారు. జిల్లాలో ఇప్పుడున్న సవాళ్లను అధిగమించి విజయవంతంగా వికసిత అనకాపల్లి జిల్లాగా రూపొందించడమే అందరి లక్ష్యం కావాలని సూచించారు. ఉపాధి హామీ పథకం పనిదినాల కల్పన, మెటీరియల్ కాంపోనెంట్‌లో లక్ష్యాన్ని మించి పనిచేసినందుకు అధికార యంత్రాంగాన్ని అభినందించారు. సమీక్షలో ఉపాధి హామీ పథకం మెటీరియల్ కంపోనెంట్, 2019-24 మధ్య జరిగిన అవకతవకలు, ప్రస్తుతం పథకం అమలుపై వివరాలు తెలుసుకున్నారు. జల్‌జీవన్ పథకం పనులు వేగవంతం చేయాలన్నారు. పలు కేంద్ర ప్రభుత్వ పథకాల అమలు తీరుతో పాటు పర్యాటకరంగ అభివృద్ధిపై చర్చించారు. తాటిబెల్లం, ఆర్గానిక్ బెల్లం ఉత్పత్తికి అనకాపల్లి బ్రాండ్ ఇమేజ్ కల్పన దిశగా కార్యాచరణ, తదితర అంశాలపై చర్చించి పలు సూచనలు చేశారు.
ప్రజలకు అవగాహన కల్పించాలి
శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ 20 సూత్రాల కార్యక్రమాల అమలుపై ప్రజలకు అవగాహన కల్పించేలా ప్రచారం చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఉపాధి హామీ పనులు చేసే ముందు గతంలో చేసిన పనులనే మళ్లీ చేయకుండా జాగ్రత్తలు పాటించాలన్నారు. చెరువుల తవ్వడంతో పాటు కాలువల్లో పూడిక తొలగింపు పనులు చేపట్టాలని సూచించారు. గ్రామాల్లో 80 శాతం సిమెంట్ రోడ్డు పనులు పూర్తయ్యాయని, మిగిలిన 20 శాతం రోడ్డు పనులు పూర్తి చేశాక పంట కాలువల పనులు చేపట్టాలని సూచించారు. జల్‌జీవన్ పథకం పనులు చేపట్టేందుకు రోడ్లు తవ్వేస్తున్నారని, తవ్విన రోడ్ల పునరుద్ధరణ పనులు వెంటనే చేపట్టాలన్నారు. ఈ సమావేశానికి ఏపీ స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ బత్తుల తాతయ్యబాబు, గవర కార్పొరేషన్ చైర్మన్ మళ్ల సురేంద్ర, కొప్పల వెలమ కార్పొరేషన్ చైర్మన్ పీవీజీ కుమార్, అర్బన్ ఫైనాన్స్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పీలా గోవింద సత్యనారాయణ హాజరయ్యారు. జిల్లా రెవెన్యూ అధికారి వై.సత్యనారాయణరావు, వివిధ ప్రభుత్వ శాఖల జిల్లా అధికారులు హాజరై కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకాల అమలుపై నివేదికలు సమర్పించారు.
వికసిత అనకాపల్లి జిల్లాగా అభివృద్ధి
జిల్లాలో కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకాల పనులను మరింత వేగవంతం చేసి వికసిత అనకాపల్లి లక్ష్యంగా పని చేయాలని అధికారులను ఆదేశించామని 20 సూత్రాల అమలు కమిటీ చైర్మన్ లంకా దినకర్ తెలిపారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ జిల్లాలో 2024-25 సంవత్సరంలో ఉపాధి హామీ కింద 120 లక్షల పని దినాలు బడ్జెట్ అయితే 124.67 లక్షల పని దినాలు పూర్తి చేయడం అభినందనీయమన్నారు. గ్రామీణ సడక్ యోజన పథకం కింద రహదారులు లేని గ్రామాలకు రోడ్లు వేసేందుకు ప్రణాళిక రూపొందించి అమలు చేయాలని అధికారులకు సూచించినట్టు ఆయన చెప్పారు.
Updated Date - May 24 , 2025 | 11:02 PM