గిరిజనులకు న్యాయం చేస్తాం
ABN, Publish Date - Jul 23 , 2025 | 12:47 AM
జీవో:3 రద్దు నేపథ్యంలో గిరిజనులకు సంపూర్ణంగా న్యాయం చేసేందుకు ప్రణాళికాబద్ధంగా చర్యలు చేపడుతున్నామని రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ డైరెక్టర్ ఎస్.భార్గవి తెలిపారు. స్థానిక ఐటీడీఏ కార్యాలయంలో మంగళవారం జీవో:3, గిరిజన చట్టాలు, రిజర్వేషన్లపై నిర్వహించిన వర్క్‌షాప్‌లో ఆమె మాట్లాడారు.
- ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకుంటున్నాం
- జీవో:3 ప్రత్యామ్నాయానికి నిబద్ధతతో కృషి
- సలహాలు, సూచనలు స్వీకరించి ప్రభుత్వానికి నివేదిక
- గిరిజన సంక్షేమ శాఖ డైరెక్టర్ ఎస్.భార్గవి
పాడేరు, జూలై 22(ఆంధ్రజ్యోతి): జీవో:3 రద్దు నేపథ్యంలో గిరిజనులకు సంపూర్ణంగా న్యాయం చేసేందుకు ప్రణాళికాబద్ధంగా చర్యలు చేపడుతున్నామని రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ డైరెక్టర్ ఎస్.భార్గవి తెలిపారు. స్థానిక ఐటీడీఏ కార్యాలయంలో మంగళవారం జీవో:3, గిరిజన చట్టాలు, రిజర్వేషన్లపై నిర్వహించిన వర్క్‌షాప్‌లో ఆమె మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు గిరిజన ప్రాంతాల్లో శత శాతం ఉద్యోగాలు గిరిజనులకే వర్తించే జీవోను రూపొందించేందుకు కసరత్తు జరుగుతున్నదన్నారు. ఇందులో భాగంగా రంపచోడవరం, పార్వతీపురం ఐటీడీఏ కార్యాలయాల్లో వర్క్‌షాప్‌లు నిర్వహించి గిరిజన ప్రతినిధుల అభిప్రాయాలు, సూచనలు, సలహాలను స్వీకరించామన్నారు. అలాగే తాజాగా పాడేరులో నిర్వహించిన వర్క్‌షాప్‌లో స్వయంగా పలువురు గిరిజన ప్రతినిధుల అభిప్రాయాలు, నిర్దేశించిన ప్రొఫార్మాలో మరికొందరి అభిప్రాయాల సేకరణ చేస్తున్నామన్నారు. వీటన్నిటినీ క్రోడీకరించి ప్రభుత్వానికి తాము నివేదిక సమర్పిస్తామన్నారు. 2000లో వచ్చిన జీవో:3 ఆధారంగా రాష్ట్ర వ్యాప్తంగా 4,626 టీచర్ ఉద్యోగాలు గిరిజనులు పొందారన్నారు. జీవో:3ని సుప్రీంకోర్టు రద్దు చేయడంతో అది చచ్చిపోయింది కదా?, తిరిగి బతికిస్తారా? అంటూ పలువురు ప్రశ్నిస్తున్నారని ఆమె అన్నారు. అన్ని ప్రయత్నాలు చేసి గిరిజనులకు లబ్ధి చేకూరేలా కృషి చేస్తున్నామన్నారు. ఐటీడీఏ ఇన్‌చార్జి పీవో డాక్టర్ ఎంజే.అభిషేక్ గౌడ మాట్లాడుతూ జీవో:3ని వాపసు తీసుకురావాలనే ఆలోచనతోనే ప్రభుత్వం చర్యలు చేపడుతుందన్నారు. రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ న్యాయ సలహాదారు, న్యాయవాది పల్లా త్రినాఽథరావు జీవో:3 రద్దు నేపథ్యం గతంలో గిరిజనులకు శత శాతం రిజర్వేషన్ కల్పించిన జీవో: 275, జీవో:73, జీవో:375, 1/70 చట్టం, గిరిజనులకు సంబంధించిన హక్కులు, చట్టాలు, తదితర అంశాలను వివరించారు. అనంతరం జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ జల్లిపల్లి సుభద్ర, ఎమ్మెల్సీ కుంభా రవిబాబు, వివిధ గిరిజన ప్రజా, ఉపాధ్యాయ, విద్యార్థి సంఘాల నేతలు రామారావుదొర, పి.అప్పలనర్ప ముఖిశేషాద్రి, కిల్లో సురేంద్ర, రేగం సూర్యనారాయణ, చెండా ఏలియా, సీహెచ్.శ్రీనివాస్‌పడాల్, ఎస్.మాణిక్యం, తదితరులు మాట్లాడారు.
Updated Date - Jul 23 , 2025 | 12:47 AM