బంగారు కుటుంబాల దత్తతకు ముందుకు రావాలి
ABN, Publish Date - Jul 29 , 2025 | 12:53 AM
పేదరిక నిర్మూలనకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన పీ4 విధానంలో భాగంగా బంగారు(పేద) కటుంబాలను దత్తత తీసుకునేందుకు దాతలు(మార్గదర్శి) ముందుకు రావాలని కలెక్టర్ ఏఎస్ దినేశ్‌కుమార్ పిలుపునిచ్చారు.
పీ4పై కలెక్టర్ ఏఎస్ దినేశ్‌కుమార్ పిలుపు
జిల్లా వ్యాప్తంగా 92,683 పేద కుటుంబాల గుర్తింపు
పాడేరు, జూలై 28(ఆంధ్రజ్యోతి): పేదరిక నిర్మూలనకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన పీ4 విధానంలో భాగంగా బంగారు(పేద) కటుంబాలను దత్తత తీసుకునేందుకు దాతలు(మార్గదర్శి) ముందుకు రావాలని కలెక్టర్ ఏఎస్ దినేశ్‌కుమార్ పిలుపునిచ్చారు. కలెక్టరేట్‌లో పీ4పై సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలోని 22 మండలాల్లో 352 గ్రామ సచివాలయాల పరిధిలో ఈ ఏడాది మార్చిలో నిర్వహించిన సర్వేలో 144 సచివాలయాల పరిధిలో 92,683 కుటుంబాలు, 3 లక్షల 13 వేల 41 మంది కుటుంబ సభ్యులు పేదరికంలో ఉన్నారని గుర్తించామన్నారు. ఈ క్రమంలో పీ4లో భాగంగా ఆయా కుటుంబాలను దత్తత తీసుకునేందుకు దాతలు ముందుకు రావాలని కోరుతున్నామన్నారు. దీనిపై ఇటీవల జిల్లా ఇన్‌చార్జి మంత్రి గుమ్మడి సంధ్యారాణి వివిధ శాఖల అధికారులతో కలెక్టరేట్‌లో సమావేశం నిర్వహించారన్నారు. ఆమె సైతం పది కుటుంబాలను దత్తత తీసుకుంటున్నట్టు ప్రకటించారని తెలిపారు. ముఖ్యంగా ఒక పేద కుటుంబాన్ని దత్తత తీసుకోవడమంటే వారికి ఆర్థికంగా సాయం చేయాలనే అపోహతో కొందరున్నారని, కానీ సదరు కుటుంబానికి అవసరమైన సలహాలు, సూచనలు, ఆత్మ స్థైర్యం, తదితరాలు అందించి వారి అభ్యున్నతికి తమవంతు సాయం చేస్తే సరిపోతుందన్నారు. జిల్లాలో సుమారుగా పది వేల మంది ప్రభుత్వ ఉద్యోగులున్నారని, వారికి అవకాశం ఉన్న మేరకు బంగారు కుటుంబాల దత్తతకు ముందుకు రావాలని కలెక్టర్ సూచించారు. అలాగే ఎక్కడి నుంచైనా ఎక్కడి కుటుంబాన్ని అయినా ఆన్‌లైన్ ద్వారా దత్తత తీసుకునే సదుపాయం ఉందన్నారు. ఇప్పటికి జిల్లాలో 50 మంది దాతలు(మార్గదర్శి) ముందుకు వచ్చారని, వాళ్లలో కొందరు ఇతర జిల్లాలకు చెందిన వారున్నారని కలెక్టర్ పేర్కొన్నారు.
వ్యవసాయ ఉత్పత్తులకు మార్కెటింగ్ లక్ష్యం
జిల్లాలోని వ్యవసాయ ఉత్పత్తులకు మార్కెటింగ్ సదుపాయాల కల్పనే లక్ష్యంగా అధికారులు చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఏఎస్.దినేశ్‌కుమార్ ఆదేశించారు. కలెక్టరేట్‌లో వ్యవసాయ, అనుబంధ రంగాలకు చెందిన అధికారులతో సోమవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో వ్యవసాయ ఉత్పత్తులకు మార్కెటింగ్, పంటలకు బీమా, ఆధునిక పద్దతులపై రైతులకు అవసరమైన శిక్షణ అందించేందుకు చర్యలు చేపట్టాలన్నారు. రైతులకు కిసాన్ క్రెడిట్ కార్డులు, అవసరమైన ఆధునిక, సాంకేతిక వ్యవసాయ పరికరాలు అందించి, రైతుల ఆదాయం పెంపునకు అవసరమైన చర్యలు చేపట్టాలన్నారు. వచ్చే నెల నుంచి రైతు సదస్సుల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ సూచించారు.
కిసాన్ డ్రోన్లను సద్వినియోగం చేసుకోవాలి
రైతులకు ప్రభుత్వం రాయితీపై అందిస్తున్న కిసాన్ డ్రోన్లను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సూచించారు. జిల్లాలో వై.రామవరం మండలం దాలిపాడు గ్రామానికి చెందిన శ్రీదుర్గా భవానీ గ్రూప్‌నకు మంజూరు చేసిన డ్రోన్‌ను సోమవారం ఆయన కలెక్టరేట్‌లో పరిశీలించారు. రూ.9 లక్షల 80 వేలు విలువ చేసే కిసాన్ డ్రోన్‌ను రైతుల గ్రూప్‌లకు 80 శాతం రాయితీతోనే అందిస్తున్నామన్నారు. ఇటువంటి చక్కని అవకాశాలను రైతులు సద్వినియోగం చేసుకుని లబ్ధి పొందాలని కలెక్టర్ అన్నారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ డాక్టర్ ఎంజే.అభిషేక్‌గౌడ, రంపచోడవరం, చింతూరు ఐటీడీఏ పీవోలు కె.సింహాచలం, అపూర్వభరత్, జిల్లా వ్యవసాయాధికారి ఎస్‌బీఎస్.నందు, ఉద్యావనాధికారి కేవీ.ప్రకాశ్‌బాబు, జిల్లా మత్యశాఖాధికారి శ్రీనివాసరావు, సీపీవో ప్రసాద్, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.
Updated Date - Jul 29 , 2025 | 12:53 AM