జీవో 3 ప్రత్యామ్నాయానికి కట్టుబడి ఉన్నాం
ABN, Publish Date - May 06 , 2025 | 12:36 AM
సుప్రీం కోర్టు జీవో:3ను రద్దు చేసిన నేపథ్యంలో దానికి ప్రత్యామ్నాయంగా రాజ్యాంగబద్ధంగా మరో జీవోను తీసుకువచ్చేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర మహిళా శిశు, గిరిజన సంక్షేమ శాఖల మంత్రి గుమ్మడి సంధ్యారాణి స్పష్టం చేశారు.
గిరిజనులకు న్యాయం చేసేందుకు ప్రభుత్వం కసరత్తు
రాష్ట్ర మహిళా శిశు, గిరిజన సంక్షేమ శాఖల మంత్రి గుమ్మడి సంధ్యారాణి
గిరిజన సమస్యలపై స్పెషల్ డీఎస్‌సీ సాధన సమితి నేతలతో భేటీ
పాడేరు, మే 5(ఆంధ్రజ్యోతి): సుప్రీం కోర్టు జీవో:3ను రద్దు చేసిన నేపథ్యంలో దానికి ప్రత్యామ్నాయంగా రాజ్యాంగబద్ధంగా మరో జీవోను తీసుకువచ్చేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర మహిళా శిశు, గిరిజన సంక్షేమ శాఖల మంత్రి గుమ్మడి సంధ్యారాణి స్పష్టం చేశారు. సాలూరులో స్పెషల్ డీ ఎస్‌సీ సాధన సమితి నేతలతో సోమవారం ఆమె భేటీ అయిన సందర్భంగా మాట్లాడారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు గిరిజనులకు ఇచ్చిన హామీ మేరకు జీవో:3కి ప్రత్యామ్నాయ జీవోను రూపొందించేందుకు, గిరిజనులకు న్యాయం చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తుందన్నారు. గతంలో వలే చట్టపరమైన అడ్డంకులు లేకుండా రాజ్యాంగబద్ధంగా గిరిజనులకు మేలు జరిగేలా సదరు జీవోను తీసుకురావాలనే లక్ష్యంతో ఉన్నత స్థాయిలో అనేక మార్లు చర్చలు జరిపామని మంత్రి తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వంలో గిరిజనులకు జరిగిన అన్యాయాన్ని తాము మరిచిపోలేమని, ఆయా సమస్యలను పరిష్కరించాలనే ఆలోచనతోనే ఉన్నామన్నారు. ఈ మెగా డీఎస్‌సీలో సైతం గిరిజనులకు అన్యాయం జరగకుండా అవసరమైన చర్యలు చేపడతామని చెప్పారు.
పలు సమస్యలపై మంత్రి సంధ్యారాణికి వినతి
గిరిజనులకు సంబంధించిన పలు సమస్యలపై మంత్రి గుమ్మడి సంధ్యారాణికి స్పెషల్ డీఎస్‌సీ సాధన సమితి నేతలు వినతిపత్రం సమర్పించారు. షెడ్యూల్డ్ ప్రాంతాల్లోని టీచర్ పోస్టులన్నీ గిరిజనులతోనే భర్తీ చేయాలని, మెగా డీఎస్‌సీలో గిరిజన ప్రాంత టీచర్ పోస్టులను మినహాయించి గిరిజనులకు స్పెషల్ డీఎస్‌సీ నోటిఫికేషన్ జారీ చేయాలని, జీవో:3కి ప్రత్యామ్నాయంగా ఇచ్చే జీవోకు చట్టబద్ధత కల్పించాలని కోరారు. అందుకు మంత్రి సానుకూలంగా స్పందించి, ఆయా సమస్యలను సీఎం చంద్రబాబునాయుడు దృష్టికి తీసుకువెళతానన్నారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ డీఎస్‌సీ సాధన సమితి ప్రతినిధులు పి.అప్పలనర్స, కె.రాధాకృష్ణ, కె.కాంతారావు, ఎస్.మాణిక్యం, ఆర్.జగన్మోహనరావు, కె.సత్యారావు, తదితరులు పాల్గొన్నారు.
Updated Date - May 06 , 2025 | 12:36 AM