ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

ఐటీ హబ్‌గా విశాఖ

ABN, Publish Date - Jul 25 , 2025 | 01:17 AM

పెట్టుబడిదారులను ప్రోత్సహించి యువతకు పెద్దఎత్తున ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే ధ్యేయంతో రాష్ట్ర ప్రభుత్వం విశాఖలో పలు సంస్థలకు భూములు కేటాయించింది.

  • పలు కంపెనీలకు భూ కేటాయింపులు

  • మంత్రి మండలి ఆమోదం

  • ఉద్యోగాల కల్పనే లక్ష్యం

  • ఫీనమ్‌ పీపుల్‌, సిఫీ ఇన్ఫినిటీ స్పేసెస్‌, సత్వ, బీవీఎం ఎనర్జీ, ఏఎన్‌ఎస్‌ఆర్‌ సంస్థల రాక

  • మెడ్‌టెక్‌ జోన్‌లో లాన్సమ్‌ 5 స్టార్‌ హోటల్‌

  • సిటీలో ఐటీసీ హోటల్‌

విశాఖపట్నం, జూలై 24 (ఆంధ్రజ్యోతి):

పెట్టుబడిదారులను ప్రోత్సహించి యువతకు పెద్దఎత్తున ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే ధ్యేయంతో రాష్ట్ర ప్రభుత్వం విశాఖలో పలు సంస్థలకు భూములు కేటాయించింది. ఎకరా రూ.30 కోట్లకు పైగా విలువ చేసే భూములను 5 శాతం, అంత కంటే తక్కువ ధరకు ఇచ్చింది. మధురవాడ, రుషికొండ, ఎండాడ ప్రాంతాల వైపు భూములు కేటాయిస్తూ గురువారం నిర్వహించిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం నిర్ణయం తీసుకుంది. ఈ సంస్థల రాకతో ఐటీ రంగంలో విశాఖపట్నం అగ్రస్థానానికి చేరనుంది. డేటా హబ్‌గా మారుతుంది.

బీవీఎం ఎనర్జీ అండ్‌ రెసిడెన్సీ: ఈ సంస్థకు ఎండాడలో పనోరమ హిల్స్‌ వెనుక ఒకేచోట ఏపీఐఐసీ ద్వారా 30 ఎకరాలు కేటాయించారు. వీరు రూ.1,250 కోట్ల పెట్టుబడి పెట్టి 15 వేల మందికి ఉపాధి కల్పిస్తారు. ఎకరా రూ.1.5 కోట్లకు ఇచ్చారు.

ఫీనమ్‌ పీపుల్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌: ఈ సంస్థకు మొత్తం 4.45 ఎకరాలు కేటాయించారు. రుషికొండ హిల్‌ నంబరు 2లోని నాన్‌ సెజ్‌ ఏరియాలో 45 సెంట్లు, మధురవాడ హిల్‌ నంబరు 4లో నాలుగు ఎకరాలు కేటాయించారు. వీరు దశల వారీగా ఐదేళ్లలో 2,500 మందికి ఉద్యోగాలు కల్పిస్తారు. ఏడాదిలో క్యాంపస్‌ ఏర్పాటు చేసి, రెండేళ్లలో 1,250 మందికి, ఆ తరువాత మరో రెండేళ్లలో ఇంకో 1,250 మందికి ఉద్యోగాలు ఇస్తారు. వీరి పెట్టుబడి రూ.207.5 కోట్లు కాగా వారికి ఎకరాకు రూ.4.05 కోట్ల చొప్పున ధర నిర్ణయించారు.

సిఫీ ఇన్ఫినిటీ స్పేస్‌: ఈ సంస్థకు రుషికొండ హిల్‌ నంబర్‌ 3లో 3.6 ఎకరాలు ఎకరా కోటి రూపాయల చొప్పున ఇచ్చారు. అదేవిధంగా పరదేశిపాలెంలో 50 ఎకరాలు, ఎకరా కేవలం రూ.50 లక్షలకు ఇచ్చారు. వీరు రూ.16,466 కోట్లు పెట్టుబడి పెట్టి 600 మందికి ఉద్యోగాలు ఇస్తారు. ఈ సంస్థ కీలకమైన డేటా హబ్‌ను అభివృద్ధి చేస్తుంది. డేటా స్టోరేజ్‌, క్లౌడ్‌ కంప్యూటింగ్‌లను అభివృద్ధి చేస్తుంది. దీని ద్వారా మరింత మందికి ఉపాధి లభిస్తుందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.

సాత్వా డెవలపర్స్‌: ఈ సంస్థకు మధురవాడలోని హిల్‌ నంబరు 4లో 30 ఎకరాలు, ఎకరా రూ.1.5 కోట్లు చొప్పున కేటాయించారు. వీరు రూ.1,500 కోట్ల పెట్టుబడితోనే 25 వేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని ఒప్పందం చేశారు.

ఏఎన్‌ఎస్‌ఆర్‌ గ్లోబల్‌: ఈ సంస్థకు రుషికొండ హిల్‌ నంబరు 3పై 2.5 ఎకరాలు, మధురవాడ హిల్‌ నంబరు 4లో 7.79 ఎకరాలు కేటాయించారు. వీరు రూ.వేయి కోట్ల పెట్టుబడితో పది వేల మందికి ఉద్యోగాలు ఇవ్వనున్నారు.

అగనంపూడి సమీపానున్న ఏపీ మెడ్‌టెక్‌ జోన్‌లో 5 స్టార్‌ హోటల్‌ ఏర్పాటుకు లాన్సమ్‌ లీజర్స్‌ సంస్థ ఒప్పందం చేసింది. అదేవిధంగా కోల్‌కతాకు చెందిన ఐటీసీ కంపెనీ కూడా విశాఖలో 5 స్టార్‌ హోటల్‌ ఏర్పాటుకు ముందుకురాగా దానికి కూడా తగిన భూములు ఇవ్వడానికి రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయింది.

మెట్రో రైలు ప్రాజెక్టుకు గ్రీన్‌సిగ్నల్‌

నేడు టెండర్లు

ప్రాజెక్టు వ్యయం రూ.11,498 కోట్లు

60 శాతం నిధులు పీపీపీలో సేకరణ

40 శాతం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెరి సగం భరించాలని నిర్ణయం

రాష్ట్ర వాటా నిధులు సమకూర్చే బాధ్యత వీఎంఆర్‌డీఏకు

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న విశాఖపట్నం మెట్రో రైలు ప్రాజెక్టుకు శుక్రవారం టెండర్లు పిలవనున్నారు. ఈ ప్రాజెక్టుదశాబ్ద కాలంగా నలుగుతోంది. ఇప్పటివరకూ దీనికి సమగ్ర ప్రాజెక్టు నివేదిక ఖరారు కాలేదు. వంద శాతం నిధులు కేంద్రం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం కోరుతుండగా ఢిల్లీ నుంచి స్పందన కనిపించడం లేదు. దాంతో నిబంధనల ప్రకారం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రాజెక్టు వ్యయంలో 40 శాతం చెరో సగం భరించాలనే ప్రాతిపదికన తొలుత టెండర్లు పిలవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఒకవైపు కేంద్రం నుంచి పూర్తిసాయం కోసం ప్రయత్నం చేస్తూనే దానికి ఆమోదం లభించేలోపు పనులు పట్టాలపైకి తేవాలని ఈ టెండర్లను పిలుస్తున్నట్టు సమాచారం.

విశాఖ మెట్రో రైలు ప్రాజెక్టు మొదటి దశకు రూ.11,498 కోట్లు అవసరమని అంచనా వేశారు. స్టీల్‌ ప్లాంటు నుంచి కొమ్మాది వరకు మూడు కారిడార్లు నిర్మిస్తారు. వీటి పొడవు 46.43 కిలోమీటర్లు. ఈ ప్రాజెక్టుకు మొత్తం 99.8 ఎకరాలు అవసరం కాగా అందులో ప్రైవేటు భూములు పది ఎకరాల వరకూ ఉన్నాయి. వాటికి జీవీఎంసీ ద్వారా టీడీఆర్‌లు ఇవ్వాలని యోచిస్తున్నారు. టెండర్ల లెక్కల ప్రకారం ప్రాజెక్టు వ్యయంలో 60 శాతం పీపీపీ విధానంలో సమీకరిస్తారు. మిగిలిన 40 శాతంలో రాష్ట్ర వాటా 20 శాతం కాగా దానిని వీఎంఆర్‌డీఏ సమకూర్చాల్సి ఉంది. అందులో భూ సేకరణ, ఇతర ఖర్చులు ఉంటాయి. దీనికి సుమారు రూ.882 కోట్లు నిధులు కావాలని అంచనా వేశారు.

Updated Date - Jul 25 , 2025 | 01:17 AM