ఆర్థిక శక్తిగా విశాఖ
ABN, Publish Date - Apr 01 , 2025 | 01:24 AM
విశాఖపట్నం రాష్ట్రానికి గుండె వంటిదని, దీనిని ఓ ఆర్థిక శక్తి (ఎకనామిక్ పవర్ హౌస్)గా మారుస్తామని ఐటీ శాఖా మంత్రి నారా లోకేశ్ అన్నారు.
పర్యాటకం, వాణిజ్యం, ఇన్నోవేషన్ కేంద్రంగా అభివృద్ధి
కొత్త తరం కంపెనీలకు కేంద్రంగా నగరం
విశాఖను ఐటీ హబ్‌గా అభివృద్ధి చేసి ఐదు లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాం
మంత్రి నారా లోకేశ్
విశాఖపట్నం, మార్చి 31 (ఆంధ్రజ్యోతి):
విశాఖపట్నం రాష్ట్రానికి గుండె వంటిదని, దీనిని ఓ ఆర్థిక శక్తి (ఎకనామిక్ పవర్ హౌస్)గా మారుస్తామని ఐటీ శాఖా మంత్రి నారా లోకేశ్ అన్నారు. నగరంలో సోమవారం ఓ ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ, విశాఖను పర్యాటకం, వాణిజ్యం, ఆవిష్కరణ (ఇన్నోవేషన్)ల కేంద్రంగా అభివృద్ధి చేయనున్నామని ప్రకటించారు. భారతదేశం భవిష్యత్తును నిర్దేశించే కొత్త తరం కంపెనీలకు విశాఖపట్నం కేంద్రంగా ఉండాలని తమ ప్రభుత్వం భావిస్తున్నదని చెప్పారు. యువతకు 20 లక్షల ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని తాము ఎన్నికలలో హామీ ఇచ్చామని, ఆ దిశగా సృష్టించే ప్రతి ఉద్యోగం పరోక్షంగా మరో నలుగురికి ఉపాధి కల్పిస్తుందన్నారు. పారిశ్రామికవేత్తలు, వ్యాపారవేత్తలకు సానుకూలంగా తాము తీసుకుంటున్న నిర్ణయాలు రాష్ట్రాన్ని స్థిరమైన ఆర్థికాభివృద్ధి దిశగా నడిపిస్తాయని మంత్రి లోకేశ్ ఆశాభావం వ్యక్తంచేశారు.
విశాఖను ఐటీ హబ్‌గా అభివృద్ధి చేసి ఐదు లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామన్నారు. విశాఖపట్నానికి మౌలిక వసతులు కల్పించేందుకు అనేక చర్యలు చేపడుతున్నామని, పర్యాటక అభివృద్ధికి సీఎం చంద్రబాబునాయుడుతో పాటు పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేశ్ కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారన్నారు. పర్యాటకం, ఇన్నోవేషన్ హబ్‌గా నగరాన్ని తీర్చిదిద్దుతామన్నారు. విశాఖ ప్రజలు ఎప్పుడూ తెలుగుదేశం వెంట అండగా ఉన్నారని, పార్టీకి ఈ జిల్లా కంచుకోట అని చెప్పారు. 2019 ఎన్నికల్లో రాష్ట్రమంతా ఎదురు గాలి వీచినా విశాఖ ప్రజలు మాత్రం టీడీపీకే పట్టం కట్టారని గుర్తు చేసుకున్నారు.
పార్టీ కార్యాలయంలో ప్రజా దర్బార్
వినతులు స్వీకరించిన మంత్రి నారా లోకేశ్
బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా
విశాఖపట్నం, మార్చి 31 (ఆంధ్రజ్యోతి):
రాష్ట్ట్ర ఐటీ, మానవ వనరుల అభివృద్ధి శాఖా మంత్రి నారా లోకేశ్ సోమవారం పార్టీ కార్యాలయంలో 60వ ప్రజా దర్బార్ నిర్వహించారు. పలువురి నుంచి వినతులు స్వీకరించిన ఆయన...ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. వేపగుంట జడ్పీ ఉన్నత పాఠశాల వెనుకనున్న ప్రభుత్వానికి చెందిన స్థలాన్ని గత ప్రభుత్వంలో కీలక వ్యక్తుల అండతో కొందరు ఆక్రమించుకుని భారీ భవంతులు నిర్మించారని రాపర్తి రాజు ఫిర్యాదు చేశారు. ప్రభుత్వ స్థలాన్ని కాపాడాలని కోరగా, తప్పకుండా కబ్జాదారులపై చర్యలు తీసుకుంటామని లోకేశ్ హామీ ఇచ్చారు. ప్రత్యేక అవసరాల పిల్లలకు బోధన చేసే ఉపాధ్యాయులను డీఎస్సీ ద్వారా మాత్రమే నియమించేలా చర్యలు తీసుకోవాలని నిరుద్యోగ ఉపాధ్యాయ సమాఖ్య ప్రతినిధులు కోరారు. రిటైరైన ఇద్దరు పాడేరు ఐటీడీఏలో పనిచేస్తున్నారని, వారిరువురినీ తొలగించి అర్హులను నియమించాలని ఎన్.శ్రీనివాసరావు కోరారు. ఇంజనీరింగ్ చదువుకున్న సౌజన్య అనే యువతి మంత్రి లోకేశ్‌ను కలిసి తనకు ఉద్యోగం కల్పించాలని కోరింది. కాగా సోమవారం ఉదయం లోకేశ్‌ను ఎమ్మెల్యేలు గణబాబు, వెలగపూడి రామకృష్ణబాబు, పార్టీ పార్లమెంటరీ నియోజకవర్గ అధ్యక్షుడు గండి బాబ్జీ, జీసీసీ చైర్మన్ కిడారి శ్రావణ్‌కుమార్, తదితరులు మర్యాదపూర్వకంగా కలిశారు.
Updated Date - Apr 01 , 2025 | 01:24 AM