పోలీస్ శాఖలో వసూల్ రాజాలు!
ABN, Publish Date - Jul 14 , 2025 | 12:43 AM
మహా నగర పోలీస్ శాఖలో కొందరు సిబ్బంది అక్రమ సంపాదనకు పరితపిస్తున్నారు.
బెల్ట్ దుకాణాలపై దాడుల పేరుతో వసూళ్లు
సీజ్ చేసిన మద్యంలో చేతివాటం
సీపీ చర్యలు తీసుకుంటున్నా మారని సిబ్బంది వైఖరి
(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)
మహా నగర పోలీస్ శాఖలో కొందరు సిబ్బంది అక్రమ సంపాదనకు పరితపిస్తున్నారు. అవకాశం దొరికితే చాలు నగదు రాబట్టడమే ధ్యేయంగా పనిచేస్తున్నారు. మద్యం దుకాణాల వద్ద న్యూసెన్స్, బెల్ట్ షాపులపై దాడులు పేరుతో అందినకాడికి దోచుకుని జేబులు నింపుకుంటున్నారు. గత కొంతకాలంగా ఈ తరహా పోలీసుల దందాలు భారీగా జరుగుతుండగా.. కొన్ని ఉదంతాలు మాత్రమే బయటపడుతున్నాయి. ఇలాంటి ఘటనల్లో బాధ్యులపై సీపీ శంఖబ్రత బాగ్చి చర్యలు తీసుకుంటున్నప్పటికీ పోలీసుల వసూళ్ల పర్వానికి అడ్డుకట్ట పడకపోవడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
నగర పోలీస్ కమిషనరేట్‌లో పనిచేస్తున్న పలువురు పోలీస్ అధికారులు, సిబ్బంది అడ్డగోలు సంపాదనపై ఇటీవల కాలంలో ఫోకస్ పెంచారు. సీపీగా శంఖబ్రత బాగ్చి బాధ్యతలు చేపట్టిన కొత్తలో నగరంలో పనిచేయడానికి చాలామంది అధికారులు భయపడి రేంజ్‌కు వెళ్లిపోవడానికి ప్రయత్నించగా, రేంజ్ నుంచి నగరానికి రావాలనే ప్రయత్నాల్లో ఉన్నవారు సైతం తమ ప్రయత్నాలను విరమించుకున్నారు. విధి నిర్వహణలో అలసత్వం, అవినీతి వంటి విషయాల్లో సీపీ కఠినంగా వ్యవహరిస్తారనే అభిప్రాయం పోలీస్ శాఖలో ఉండడమే ఇందుకు కారణంగా చెప్పుకోవాలి. అయితే సీపీగా బాధ్యతలు చేపట్టి ఏడాది పూర్తవడంతో శంఖబ్రతబాగ్చితో నగరంలో పనిచేస్తున్న కొందరు అధికారులతో చనువు పెరిగింది. సీఐలు, ఏసీపీ స్థాయి అధికారులు సైతం సీపీకి ఎదురు సమాధానం చెప్పడానికి భయపడే పరిస్థితి పోయి, ఏదైనా జరిగితే దానికి గల కారణాలతోపాటు బాధ్యులపై తీసుకోవాల్సిన చర్యల గురించి కూడా చర్చించే పరిస్థితి వచ్చిందనే అభిప్రాయం పోలీస్ వర్గాల్లో వ్యక్తమవుతోంది. ఈ క్రమంలో కొంతమంది అధికారులు, వారి అండదండలు కలిగిన సిబ్బంది అవినీతి విషయంలో కాస్త దూకుడు పెంచారు. అవకాశం దొరికితే డబ్బులు వస్తాయనుకునే ఎలాంటి అవకాశాన్ని కూడా వదిలిపెట్టడం లేదు. స్టేషన్‌కు వచ్చే కేసులు, సివిల్ సెటిల్‌మెంట్ల సంగతి సరేసరి. మద్యం దుకాణాల నుంచి వసూళ్లతో పాటు మద్యం షాపుల వద్ద తాగి తిరిగే వారిని గుర్తించి న్యూసెన్స్ పేరుతో కేసులు పెడతామని బెదిరించడం, బెల్ట్ షాపుల పేరుతో మద్యాన్ని అనధికారికంగా విక్రయించే వారి ఇళ్లు, దుకాణాల్లో సోదాలు చేయడం ద్వారా సంబంధిత నిర్వాహకులను బెదిరించి డబ్బులు గుంజేస్తున్నారన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. పైగా బెల్ట్ షాపుల వద్ద సీజ్ చేసిన మద్యం సీసాలను కూడా చాలావరకు పక్కదారి పట్టించేసి అధికారికంగా కొద్ది మొత్తంలోనే దొరికినట్టు చూపించి, మిగిలిన సీసాలను సొంతానికి వాడుకుంటున్నారు. రెండు నెలల కిందట సాగర్‌నగర్ వద్ద బీచ్ రోడ్డులోని ఓ మద్యం దుకాణంలో మద్యం కొనుగోలు చేసిన వ్యక్తితో పాటు సమీపంలో ఏకాంతంగా గడుపుతున్న ఒక జంటను పీఎంపాలెం పోలీస్ స్టేషన్‌కు చెందిన హెడ్ కానిస్టేబుల్ బెదిరించి వారి నుంచి వేరొక వ్యక్తికి డబ్బులను ఫోన్ పే చేయించి.. ఆ తరువాత అతని వద్ద నుంచి తన అకౌంట్‌కు పంపించుకున్నాడు. దీనిపై బాధితులు ‘ఆంధ్రజ్యోతి’కి సమాచారం ఇవ్వడంతో దీనిపై కథనం ప్రచురించగా, సీపీ స్పందించి విచారణకు ఆదేశించారు. విచారణలో హెడ్ కానిస్టేబుల్ పలువురు నుంచి ఫోన్ పే ద్వారా డబ్బులు వసూలు చేసినట్టు తేలడంతో ఆయనను ఇటీవల విధుల నుంచి సస్పెండ్ చేశారు.
అలాగే కంచరపాలెం వద్ద బెల్ట్ షాపుపై దాడి పేరుతో ఓ కానిస్టేబుల్, ఇద్దరు హోంగార్డులు వెళ్లి కొన్ని మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు. నిర్వాహకుడితో పాటు అతనికి మద్యం సరఫరా చేసిన మద్యం దుకాణం నిర్వాహకులను బెదిరించి డబ్బులు వసూలు చేసినట్టు తెలిసింది. అనంతరం యథావిధిగా ఉన్నతాధికారుల దృష్టిలో పెట్టి కేసు నమోదు చేసినట్టు ఆరోపణలు వెల్లువెత్తాయి. కాగా సీజ్ చేసిన మద్యం సీసాల్లో సగం బాటిళ్లను సిబ్బంది పక్కన పెట్టి, మిగిలిన సగం సీసాలనే సీజ్ చేసినట్టు రికార్డుల్లో చూపడంతో బాధితులు ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. దీనిపై విచారణ జరిపిన సీపీ.. బాధితుల ఆరోపణలు నిజమేనని తేలడంతో ముగ్గురినీ విధుల నుంచి సస్పెండ్ చేస్తూ రెండు రోజుల కిందట ఉత్తర్వులు జారీ చేశారు.
ఇదిలావుండగా భీమిలిలో ఇటీవల పోలీసులు ఒక బెల్ట్ షాప్‌పై దాడిచేసి 123 మద్యం సీసాలను పట్టుకున్నారు. గ్రామంలో జాతర కోసం మద్యం కొనుగోలు చేసుకున్నామని చెప్పినాసరే... నిబంధనలకు విరుద్ధంగా భారీగా మద్యం నిల్వ ఉండడంతో బెల్ట్ షాపుగానే భావించి పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే స్వాధీనం చేసుకున్న 123 సీసాల్లో కేవలం 58 బాటిళ్లను మాత్రమే సీజ్ చేసినట్టు చూపించిన పోలీసులు, మిగిలిన మద్యం సీసాలను ఏం చేశారనే దానిపై మద్యం దుకాణం నిర్వాహకులతోపాటు బెల్ట్ షాప్ కేసులో అరెస్టయిన బాధితుడు సిబ్బందిని ప్రశ్నించారు. అంత పెద్దసంఖ్యలో మద్యం సీసాలు దొరికనట్టు చూపిస్తే పెద్ద కేసు అయిపోతుందని పోలీసులు బెదిరించడంతో వారంతా కిమ్మనకుండా ఉండిపోయారు.
తాజాగా శనివారం గోపాలపట్నం లక్ష్మీనగర్‌లో నిర్వహిస్తున్న బెల్ట్ షాపుపై పోలీసులు దాడి చేసి కొన్ని మద్యం సీసాలను సీజ్ చేసి స్టేషన్‌కు తీసుకువచ్చారు. కానీ స్టేషన్‌లో కీలకంగా వ్యవహరించే ఓ హెడ్ కానిస్టేబుల్ సీజ్ చేసిన మద్యంలో సగానికి పైగా సీసాలను పక్కన పెట్టేసి మిగిలినవి మాత్రమే సీజ్ చేసినట్టు చూపించారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. నగరంలో ఈ తరహా ఘటనలు ప్రతిరోజూ జరుగుతున్నాయని పలువురు మద్యం వ్యాపారులు చెబుతుండడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. సీపీ శంఖబ్రత బాగ్చి ఇప్పటికైనా క్షేత్ర స్థాయిలో సిబ్బంది, అధికారుల పనితీరుపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయకపోతే పోలీస్ శాఖ ప్రతిష్ట మసకబారడం ఖాయమని ఆ శాఖకు చెందన పలువురు అధికారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Updated Date - Jul 14 , 2025 | 12:43 AM