వైద్య వర్గాల్లో కలకలం
ABN, Publish Date - Jul 29 , 2025 | 01:29 AM
స్థానిక జిల్లా కేంద్ర ఆస్పత్రి (ఎన్టీఆర్ వైద్యాలయం)లో గత వైసీపీ పాలనలో జరిగిన అవినీతి, అక్రమాలపై సమగ్ర విచారణ చేపట్టాలని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ చేసిన జారీ చేసిన ఆదేశాలు ప్రభుత్వ వైద్య వర్గాల్లో కలకలం సృష్టించాయి.
ఎన్టీఆర్ ఆస్పత్రిలో అవినీతి, అక్రమాలపై త్వరితగతిన విచారణకు మంత్రి ఆదేశాలు
బాధ్యులైన వైద్యులు, సిబ్బందిపై చర్యలు చేపట్టాలి
రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు డిమాండ్
అనకాపల్లి టౌన్, జూలై 28 (ఆంధ్రజ్యోతి) :
స్థానిక జిల్లా కేంద్ర ఆస్పత్రి (ఎన్టీఆర్ వైద్యాలయం)లో గత వైసీపీ పాలనలో జరిగిన అవినీతి, అక్రమాలపై సమగ్ర విచారణ చేపట్టాలని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ చేసిన జారీ చేసిన ఆదేశాలు ప్రభుత్వ వైద్య వర్గాల్లో కలకలం సృష్టించాయి. అప్పట్లో అవినీతి, అక్రమాలకు పాల్పడిన వైద్యులు, సిబ్బందిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని పలు రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు.
వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత అనకాపల్లిలోని ఎన్టీఆర్ వైద్యాలయంలో పలు అక్రమాలు జరిగాయి. ఇన్‌పెషేంట్ల తప్పుడు లెక్కలు, మందుల వినియోగాన్ని రికార్డుల్లో సక్రమంగా నమోదు చేయకపోవడం, లెసెన్సు లేకుండా క్యాంటీన్ నిర్వహణ, రోజూ ఎంతమంది రోగులకు భోజనాలు సరఫరా చేస్తున్నారో రికార్డుల్లో నమోదు చేయకపోవడం, రోగులకు సరఫరా చేసే ఆహారంలో నాణ్యత లేకపోవడం వంటి ఆరోపణలు వచ్చాయి. వీటిపై అందిన ఫిర్యాదుల మేరకు 2020 ఫిబ్రవరిలో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు తనిఖీలు నిర్వహించారు. అప్పటి డీసీహెచ్‌ఎస్‌తోపాటు తొమ్మిది మంది వైద్యులు, 12 మంది హెడ్ నర్సులు/ స్టాఫ్ నర్సులు అవినీతి, అక్రమాలకు పాల్పడినట్టు ఏసీబీ అధికారుల బృందం గుర్తించింది. వీరిపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి నివేదికను సమర్పించింది. అయితే తరువాత నాలుగేళ్లపాటు అధికారంలో వున్న వైసీపీ ప్రభుత్వం.. అక్రమార్కులపై చర్యలు తీసుకోకుండా, ఏసీబీ ఇచ్చిన నివేదికను బుట్టదాఖలు చేసింది. కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత ప్రభుత్వ ఆస్పత్రుల్లో రోగులకు మెరుగైన వైద్యసేవలందించాలనే ఉద్దేశంతో ఐదేళ్ల క్రితం అనకాపల్లి ఎన్టీఆర్ వైద్యాలయంలో జరిగిన ఏసీబీ తనిఖీలు, అప్పటి ప్రభుత్వానికి సమర్పించిన నివేదికపై వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ దృష్టి సారించారు. వైసీపీ ప్రభుత్వం బుట్టదాఖలు చేసిన ఏసీబీ నివేదికను క్షుణ్ణంగా పరిశీలించారు. అవినీతి, అక్రమాలకు పాల్పడిన 22 మంది వైద్యులు, సిబ్బందిపై శీఘ్రగతిన విచారణ చేయాలని ఆదేశించారు. ఈ విషయం పత్రికల్లో ప్రముఖంగా రావడం చర్చనీయాంశంగా మారింది. ఆస్పత్రిలో జరిగిన అవినీతి, అక్రమాలపై పలు రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాల నేతలు మండిపడుతున్నారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
అవినీతిపరులపై చర్యలు చేపట్టాలి
కొణతాల హరినాథబాబు, అమ్ ఆద్మీ పార్టీ
ప్రభుత్వ ఆస్పత్రులపై ప్రజా ప్రతినిధులు పర్యవేక్షణ చేయాలి. ఎన్టీఆర్ వైద్యాలయంలో ఐదేళ్ల క్రితం జరిగిన అవినీతి, అక్రమాలపై ఏసీబీ అధికారులు నివేదికలు ఇచ్చినప్పటికీ అప్పటి ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోలేదు. కూటమి ప్రభుత్వంలో వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి స్పందించి శీఘ్ర విచారణకు ఆదేశించడం శుభపరిణామం. అవినీతి, అక్రమాలకు పాల్పడిన వైద్యులు, సిబ్బందిపై శాఖపరంగా చర్యలు చేపట్టాలి.
మంత్రి ఆదేశాలను స్వాగతిస్తున్నాం
రాజాన దొరబాబు, సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి
ఎన్టీఆర్ వైద్యాలయంలో ఐదేళ్ల క్రితం జరిగిన అవినీతి, అక్రమాలపై చర్యలకు మంత్రి జారీ చేసిన ఆదేశాలను స్వాగతిస్తున్నాం. ఎన్టీఆర్ వైద్యాలయంలో ఇన్ పేషెంట్ల రిజిస్టర్ సక్రమంగా నిర్వహించేవారు కాదు. మందులను పక్కదారి పట్టించారు. రోగులకు నాణ్యమైన ఆహారాన్ని అందించలేదు. 2020లో ఏసీబీ అధికారులు ఇచ్చిన నివేదికను గత ప్రభుత్వం నాలుగేళ్లపాటు బయటపెట్టకపోవడం శోచనీయం. కూటమి ప్రభుత్వం ఇప్పుడు బయటపెట్టి, చర్యలకు ఉపక్రమించడం మంచి నిర్ణయం
సమగ్ర విచారణ చేపట్టాలి
జి.కోటేశ్వరరావు, సీపీఎం జిల్లా కార్యదర్శి
అనకాపల్లి ఎన్టీఆర్ వైద్యాలయంలో వైసీపీ పాలనలో జరిగిన అవినీతిపై సమగ్ర విచారణ జరిపించాలి. అప్పట్లో అక్రమాలకు పాల్పడిన 22 మంది వైద్యులు, నర్సులపై చర్యలు తీసుకోవాలని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఆదేశాలు జారీ చేయడం అభినందనీయం. ఇదే సమయంలో ఆస్పత్రిలో రోగులకు వైద్య సేవలు మెరుగుపరచాలి. వైద్య పరీక్షలతోపాటు స్కానింగ్ సౌకర్యాలు నిరంతరంం అందుబాటులో ఉండేలా చూడాలి.
Updated Date - Jul 29 , 2025 | 01:29 AM