రోడ్డు ప్రమాదంలో ఇద్దరి మృతి
ABN, Publish Date - May 19 , 2025 | 11:27 PM
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందిన సంఘటన సోమవారం పెదబయలు మండలంలో చోటుచేసుకుంది. దీనికి సంబంధించి స్థానిక ఎస్‌ఐ కొల్లి రమణ తెలిపిన వివరాలు ఇలా వున్నాయి.
వీరిలో ఒకరు సచివాలయ ఉద్యోగి
విధులకు వెళుతుండగా ఘటన
పెదబయలు, మే 19(ఆంధ్రజ్యోతి): రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందిన సంఘటన సోమవారం పెదబయలు మండలంలో చోటుచేసుకుంది. దీనికి సంబంధించి స్థానిక ఎస్‌ఐ కొల్లి రమణ తెలిపిన వివరాలు ఇలా వున్నాయి. మండలంలోని సీతగుంట పంచాయతీ రోగులపేట గ్రామానికి చెందిన జర్సింగి కార్తీక్ ప్రసాద్(30) మండలంలోని పర్రెడా సచివాలయంలో ఇంజనీరింగ్ అసిస్టెంట్‌గా పని చేస్తున్నాడు. సోమవారం మధ్యాహ్నం ఇంటి వద్ద భోజనం చేసి బైక్‌పై విధులకు హాజరయ్యేందుకు బయలుదేరాడు. అతనికి తోడుగా వరుసకు అల్లుడైన బొండా మనోజ్‌కుమార్(21) కూడా వెళ్లాడు. అడుగులపుట్టు పంచాయతీ కొత్తపుట్టు వంతెన సమీపానికి వచ్చే సరికి బైక్ అదుపుతప్పి బూరుగుచెట్టును బలంగా ఢీకొని లోయలో పడిపోయింది. పెద్ద శబ్ధం రావడంతో సమీపంలోని దుకాణ యజమాని అక్కడికి వెళ్లి కొత్తపుట్టు గ్రామస్థుల సహాయంతో వారిద్దర్నీ బయటకు తీశారు. సంఘటన స్థలంలోనే మనోజ్‌కుమార్ మృతి చెందగా, కార్తీక్ ప్రసాద్ కొన ఊపిరితో ఉండడంతో స్థానికులు అంబులెన్స్‌లో ముంచంగిపుట్టు సీహెచ్‌సీకి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ అతను మృతి చెందాడు. ఇద్దరి మృతదేహాలను సీహెచ్‌సీ మార్చురీలో భద్రపరిచామని, మంగళవారం పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగిస్తామని ఎస్‌ఐ తెలిపారు. కాగా కార్తీక్ ప్రసాద్ తండ్రి రాజుబాబు విశాఖపట్నంలోని గోపాలపట్నం పోలీస్ స్టేషన్‌లో క్రైం ఏఎస్‌ఐగా పని చేస్తున్నారు. మనోజ్‌కుమార్ తండ్రి సదాశివరావు వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నారు. అంది వచ్చిన కుమారులు మృతి చెందడంతో వారు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.
Updated Date - May 19 , 2025 | 11:27 PM