థైరాయిడ్‌తో తంటా
ABN, Publish Date - Jun 04 , 2025 | 01:04 AM
కొన్నాళ్లుగా థైరాయిడ్ బారినపడుతున్న వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది.
జిల్లాలో పెరుగుతున్న బాధితులు
కేజీహెచ్‌కు నెలకు 300 మంది వరకూ రాక
కొత్తగా వ్యాధిబారినపడేవారు 40 నుంచి 50 మంది...
పురుషుల కంటే మహిళలు అధికం
లక్షణాలు...బరువు పెరగడం, నిస్సత్తువ, ఒళ్లంతా ఉబ్బినట్టు, మత్తుగా ఉండడం, ఆకలి తగ్గడం, కంగారు, దిగులు, గుండె కొట్టుకునే వేగం పెరగడం
అశ్రద్ధ చేయవద్దంటున్న వైద్యులు
విశాఖపట్నం, జూన్ 2 (ఆంధ్రజ్యోతి):
కొన్నాళ్లుగా థైరాయిడ్ బారినపడుతున్న వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. గతంతో పోలిస్తే నాలుగు నుంచి ఐదు శాతం మేర పెరిగి నట్టు వైద్యులు చెబుతున్నారు. యుక్త వయ స్కుల్లో ఈ సమస్య అధికంగా కనిపిస్తుండడం ఆందోళన కలిగిస్తోందంటున్నారు. థైరాయిడ్ కార ణంగా అనేక ఇబ్బందులు ఎదురవుతాయని, అందువల్ల సమస్యను సకాలంలో గుర్తించి వైద్యం పొందాలని సూచిస్తున్నారు.
కీలకమైన గ్రంథి
మానవ శరీరంలోని అతి ముఖ్యమైన గ్రంథుల్లో థైరాయిడ్ ఒకటి. శరీర ఎదుగుదలకు, మెదడు పరిపక్వతకు అవసరమయ్యే థైరాక్సిన్ (టి4) అనే హార్మోన్‌ను ఇది ఉత్పత్తి చేస్తుంది. ప్రతి మనిషి జీవ రసాయన ప్రక్రియలకు శరీరంలో ఆరు నుంచి 12 మైక్రో యూనిట్ల థైరాక్సిన్ ఉండాలి. అంతకంటే తక్కువ లేదా ఎక్కువ ఉంటే కొన్నిరకాల ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. థైరాయిడ్ గ్రంథి స్వరపేటిక కింది భాగంలో సీతాకోక చిలుక ఆకారంలో శ్వాసనాళానికి ఇరువైపులా ఉంటుంది. ఈ గ్రంథి పనితీరు గతి తప్పడం వల్ల లేదా థైరాక్సిన్ ఎక్కువ లేదా తక్కువ ఉత్పిత్తి కావడం వల్ల హైపో థైరాయిడ్, హైపర్ థైరాయిడ్, గాయిటర్ వంటి సమస్యలు వస్తాయి.
మహిళల్లో ఎక్కువ
పురుషులతో పోలిస్తే మహిళల్లో థైరాయిడ్ ఎక్కువగా కనిపిస్తోంది. ప్రతి ముగ్గురు బాధితుల్లో ఇద్దరు మహిళలు ఉన్నారు. థైరాయిడ్‌తో బాధపడే మహిళల్లో సంతాన లేమి, నెలసరి క్రమం తప్పడం వంటి సమస్యలు కనిపిస్తుంటాయి. ఇంకా బాధితుల్లో బరువు పెరగడం, నిస్సత్తువ, ఒళ్లంతా ఉబ్బినట్టు, మత్తుగా ఉండడం, ఆకలి తగ్గడం, కంగారు, దిగులు, చర్మం పొడిబారడం, కండరాల నొప్పులు, గుండె కొట్టుకునే వేగం పెరగడం, చలి, వేడిని తట్టుకోలేకపోవడం వంటి లక్షణాలు ఉంటాయి. థైరాయిడ్‌ను నిర్ధారించేందుకు టీ 3, టీ 4, టీఎస్‌హెచ్ వంటి పరీక్షలు నిర్వహిస్తుంటారు. వీటితోపాటు థైరాయిడ్ స్కాన్ చేసి నిర్ధారిస్తారు. కొందరిలో థైరాయిడ్ గ్లాండ్ వాపు వస్తే స్వర పేటిక పరీక్ష నిర్వహిస్తారు. థైరాయిడ్ బాధితుల్లో థైరాయిడ్ కేన్సర్ వచ్చే అవకాశం అరుదుగా ఉంటుంది.
ఇదీ లెక్క..
కేజీహెచ్‌లోని ఎండోక్రైనాలజీ విభాగానికి ప్రతినెలా 300 మంది వరకూ రోగులు వస్తుంటారు. వారిలో కొత్తగా వ్యాధి బారినపడిన వారు 40 నుంచి 50 మంది వరకు ఉంటారని వైద్యులు చెబుతున్నారు. అలాగే, నగర పరిధిలోని ప్రైవేటు ఆస్పత్రులు, క్లినిక్‌లలో మరో వెయ్యి నుంచి రెండు వేల మంది వరకూ రోగులు వైద్య సేవలు పొందుతుంటారు. 35 ఏళ్లలోపు మహిళల్లో ఈ సమస్య అధికంగా కనిపిస్తోంది. గర్భధారణ సమస్యతో వస్తున్న వారికి పరీక్ష చేయించినప్పుడు థైరాయిడ్ ఉన్నట్టు తేలుతోంది.
థైరాయిడ్ వ్యాధిని నిర్లక్ష్యం చేయవద్దు
- డాక్టర్ కేఏవీ సుబ్రహ్మణ్యం, ఎండోక్రైనాలజీ విభాగాధిపతి, కేజీహెచ్
థైరాయిడ్ బారినపడినట్టు కొన్ని లక్షణాలు చెబుతుంటాయి. కానీ, చాలామంది పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేస్తుంటారు. ఇది వారిని మరింత బలహీనపర్చే అవకాశం ఉంది. చిన్నారుల నుంచి వృద్ధుల వరకూ అందరిలోనూ ఈ సమస్య కనిపిస్తోంది. థైరాయిడ్‌తో బాధపడే అమ్మాయిల్లో సంతానలేమి సమస్య పెరుగుతోంది. సకాలంలో గుర్తించి మందులు వినియోగిస్తే ఈ సమస్య బారినుంచి బయటపడే అవకాశం ఉంది. లక్షణాలు కనిపించిన వెంటనే అప్రమత్తం కావడం అవసరం.
Updated Date - Jun 04 , 2025 | 01:04 AM