గిరి మహిళలు వ్యాపారవేత్తలుగా ఎదగాలి
ABN, Publish Date - May 23 , 2025 | 12:46 AM
గిరిజన మహిళలు వ్యాపారవేత్తలుగా ఎదగాలని ఐటీడీఏ ఇన్‌చార్జి పీవో డాక్టర్ ఎంజే అభిషేక్‌గౌడ అన్నారు. వన్‌దన్ వికాస కేంద్రాల సభ్యులతో గురువారం ఇక్కడ నిర్వహించిన ఒక రోజు శిక్షణ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా మాట్లాడారు. అటవీ ఉత్పత్తులకు అదనపు విలువలు జోడించే ప్రధానమంత్రి వన్‌దన్ వికాస కేంద్రాలను(వీడీవీకేలు) సద్వినియోగం చేసుకుని గిరిజన మహిళలు వ్యాపారవేత్తలుగా ఎదగాలన్నారు.
- ఐటీడీఏ ఇన్‌చార్జి పీవో డాక్టర్ ఎంజే డాక్టర్ అభిషేక్‌గౌడ
- పీఎం వన్‌దన్ వికాస కేంద్రాల సభ్యులకు శిక్షణ
పాడేరు, మే 22(ఆంధ్రజ్యోతి): గిరిజన మహిళలు వ్యాపారవేత్తలుగా ఎదగాలని ఐటీడీఏ ఇన్‌చార్జి పీవో డాక్టర్ ఎంజే అభిషేక్‌గౌడ అన్నారు. వన్‌దన్ వికాస కేంద్రాల సభ్యులతో గురువారం ఇక్కడ నిర్వహించిన ఒక రోజు శిక్షణ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా మాట్లాడారు. అటవీ ఉత్పత్తులకు అదనపు విలువలు జోడించే ప్రధానమంత్రి వన్‌దన్ వికాస కేంద్రాలను(వీడీవీకేలు) సద్వినియోగం చేసుకుని గిరిజన మహిళలు వ్యాపారవేత్తలుగా ఎదగాలన్నారు. ఐటీడీఏ పరిధిలో ఉన్న 106 వీడీవీకేలకు చెందిన మహిళలకు గిరిజన ఉత్పత్తుల ప్యాకింగ్, బ్రాండింగ్, మార్కెటింగ్, ఇ-కామర్స్ రంగాల్లో శిక్షణ అందిస్తామన్నారు. వన్‌దన్ వికాస కేంద్రాలకు అదనపు మౌలిక సదుపాయాలు కల్పిస్తామని, ఇ-కామర్స్‌లో గిరిజన ఉత్పత్తులను విక్రయించేలా కృషి చేయాలన్నారు. ప్రస్తుతం ఆర్గానిక్ ఉత్పత్తులకు మార్కెట్‌లో మంచి గిరాకీ ఉందని, గిరిజన ఉత్పత్తులకు అదనపు విలువలను జోడిస్తే చక్కని డిమాండ్ ఉంటుందని, ప్రజల్లో నమ్మకం పెరుగుతుందన్నారు. ఆయా ఉత్పత్తులకు ఆర్గానిక్ సర్టిఫికేషన్ తీసుకువస్తే మార్కెట్ విస్తరణ పెరుగుతుందని తెలిపారు. గిరిజన మహిళల ఉత్పత్తులకు ట్రైఫెడ్‌కు అనుసంధానం చేస్తామని, గిరిజన ఉత్పత్తులను దేశ వ్యాప్తంగా విస్తరించాలన్నారు. వీడీవీకే ఉత్పత్తులు, వాటి సమస్యలపై వెలుగు ఏపీఎంలు నివేదికలు సమర్పిస్తే వాటి పరిష్కారానికి చర్యలు చేపడతామన్నారు. అడ్డాకులతో తయారు చేసిన ప్లేట్లు, కప్పుల తయారీపై సభ్యులను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ కార్యక్రమాలు, సభలు, సమావేశాలకు చిరుధాన్యాలతో తయారు చేసిన బిస్కెట్లను సరఫరా చేయాలని ఆయన సూచించారు.
వీడీవీకేలకు ఉచితంగా యంత్రాలు, శిక్ష ణ
వన్‌దన్ వికాస కేంద్రాలకు అవసరమైన యంత్ర పరికరాలు, మహిళలకు శిక్షణను ఉచితంగా అందిస్తామని జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ పీడీ వి.మురళి తెలిపారు. ప్రస్తుతం కాఫీ, అడ్డాకులు, చింతపండు, చీపుర్లు తయారీ, చిరుధాన్యాల బిస్కెట్ల తయారీ, విక్రయం వంటి కార్యక్రమాలు వీడీవీకేల ద్వారా జరుగుతున్నాయన్నారు. ఐటీడీఏ పరిధిలో మొత్తం 106 వీడీవీకేల నుంచి గిరిజన ఉత్పత్తుల ప్రక్రియ జరుగుతుందన్నారు. వీడీవీకే సభ్యులు ఇంకా అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనపై నివేదికలు అందిస్తే వాటిని సమకూరుస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీఎంలు వీఎస్ ప్రసాద్, జె.చిన్నారావు, ఇతర ఏపీఎంలు, 106 వీడీవీకేలకు చెందిన ముఖ్యమైన సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.
Updated Date - May 23 , 2025 | 12:46 AM