లంబసింగిలో ట్రైబల్ హోం స్టే టూరిజం
ABN, Publish Date - Jul 26 , 2025 | 11:03 PM
ఆంధ్రకశ్మీర్ లంబసింగిలో ట్రైబల్ హోం స్టే(గిరిజన విడిది ఇల్లు) టూరిజం అభివృద్ధికి కార్యాచరణ ప్రారంభించామని ఏపీ టూరిజం ఆర్కిటెక్ ఇష్టాగొయల్ అన్నారు.
ఆదివాసీ సంప్రదాయ గృహాల ఎంపిక
స్వదేశీ దర్శన్ పీఎం జుగాలో భాగంగా పర్యాటకులకు అతిథ్యం
అరకు, మారేడుమిల్లిలోనూ పథకం అమలుకు చర్యలు
ఏపీ టూరిజం అర్కిటెక్ ఇష్టాగొయల్
చింతపల్లి, జూలై 26 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రకశ్మీర్ లంబసింగిలో ట్రైబల్ హోం స్టే(గిరిజన విడిది ఇల్లు) టూరిజం అభివృద్ధికి కార్యాచరణ ప్రారంభించామని ఏపీ టూరిజం ఆర్కిటెక్ ఇష్టాగొయల్ అన్నారు. శనివారం జిల్లా పర్యాటక శాఖ అధికారి జి. దాసుతో కలిసి ఆమె లంబసింగి, తాజంగి పంచాయతీల పరిధిలోని ఆదివాసీ గ్రామాలను పర్యటించారు. ట్రైబల్ హోం స్టేకి అనువైన గృహాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె స్థానిక విలేకర్లతో మాట్లాడుతూ దేశ, విదేశీ పర్యాటకులకు ఆదివాసీ సంప్రదాయాలు, సంస్కృతిని పరిచయం చేస్తూ కొత్త అనుభూతిని కలిగించే విడిది అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ట్రైబల్ హోం స్టే టూరిజం పథకాన్ని రాష్ట్రానికి మంజూరు చేసిందన్నారు. పర్యాటక సీజన్‌లో లంబసింగికి లక్షల్లో సందర్శకులు వస్తుంటారని, పర్యాటకులు స్థానికంగా లభించే రిసార్ట్స్, టెంట్లలో బస చేస్తున్నారన్నారు. ఈ నేపథ్యంలో లంబసింగి, అరకు, మారేడుమిల్లి పర్యాటక ప్రాంతాల్లో ట్రైబల్ హోం టూరిజం అభివృద్ధి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ముందుకొచ్చిందన్నారు. ఈ పథకంలో భాగంగా లంబసింగి, తాజంగి ప్రాంతంలో హోం స్టేకు అనువైన 50 గృహాలను ఎంపిక చేస్తామన్నారు. అరకులో 100, మారేడుమిల్లిలో 25 నుంచి 30 గృహాలు ఎంపిక చేస్తామన్నారు. ఆదివాసీ సంప్రదాయబద్ధంగా నిర్మించిన గృహాలను మాత్రమే హోం స్టేకి తీసుకోవడం జరుగుతుందన్నారు. రెండు గదులు కలిగిన గృహం ఉంటే ఒక గదిని ట్రైబల్ హోం స్టేకి తీసుకోవడం జరుగుతుందన్నారు. ఈ గదిలో పర్యాటకులు బస చేసేందుకు అనువుగా ఆధునీకరించి, మరుగుదొడ్లు, ఇతర సదుపాయాలు కల్పిస్తామన్నారు. ఆధునికీకరణకు కేంద్ర ప్రభుత్వం అవసరమైన నిధులను ఖర్చు చేస్తుందన్నారు. ఈ నిధులను గిరిజనులు ప్రభుత్వానికి తిరిగి చెల్లించాల్సిన అవసరం లేదన్నారు. ట్రైబల్ హోం స్టేకి సిద్ధం చేసిన గదికి అద్దెను పర్యాటక శాఖ నిర్ణయిస్తుందని, ఈ అద్దె గిరిజనులే తీసుకుంటారన్నారు. భోజనం, టీ, అల్పాహారంలకు అదనంగా పర్యాటకులు నగదు చెల్లిస్తారన్నారు. ట్రైబల్ హోం స్టే ద్వారా ఆదివాసీలకు స్వయం ఉపాధి కల్పించడంతోపాటు పర్యాటకులకు విభిన్న అనుభూతి కలిగిన విడిది అందించడమే ప్రధాన లక్ష్యమన్నారు. పర్యాటకులకు గదులు కేటాయింపు, విడిది కల్పన ఏపీ టూరిజం నిర్వహిస్తుందన్నారు. లంబసింగిలో 15, తాజంగిలో 10 గృహాలను ఇప్పటికే ఎంపిక చేశామన్నారు. ఈ ఏడాది పర్యాటక సీజన్ నుంచే ట్రైబల్ హోం స్టే టూరిజం అందుబాటులోకి తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఆర్కిటెక్ తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా పర్యాటకశాఖ అధికారి జి. దాసు, డీఈఈ రాము, యూనిట్ మేనేజర్ అప్పలరాజు, తాజంగి, లంబసింగి సర్పంచులు మహేశ్వరి, కొర్ర శాంతికుమారి, మాజీ సర్పంచ్ రఘునాథ్, వీఆర్వోలు వెంగడ మానావతి, సధానందరావు పాల్గొన్నారు.
Updated Date - Jul 26 , 2025 | 11:03 PM