తవుడు ముసుగులోగంజాయి రవాణా
ABN, Publish Date - May 14 , 2025 | 12:48 AM
తవుడు రవాణా ముసుగులో గంజాయి తరలిస్తున్న నలుగురు ఒడిశా వాసులను టాస్క్‌ఫోర్స్, ఆనందపురం పోలీసులు సంయుక్తంగా పట్టుకున్నారు.
ఒడిశా నుంచి నగరానికి...
200 కిలోల గంజాయి స్వాధీనం
నలుగురి అరెస్టు
విశాఖపట్నం, మే 13 (ఆంధ్రజ్యోతి):
తవుడు రవాణా ముసుగులో గంజాయి తరలిస్తున్న నలుగురు ఒడిశా వాసులను టాస్క్‌ఫోర్స్, ఆనందపురం పోలీసులు సంయుక్తంగా పట్టుకున్నారు. వారి నుంచి 200 కిలోలు గంజాయి స్వాధీనం చేసుకున్నారు. పోలీస్ కమిషనరేట్‌లో మంగళవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో డీసీపీ-1 అజిత వేజెండ్ల దీనికి సంబంధించిన వివరాలను వెల్లడించారు. ఒక బొలేరో వాహనంలో గంజాయి రవాణా అవుతున్నట్టు టాస్క్‌ఫోర్స్ పోలీసులకు సమాచారం అందడంతో ఆనందపురం పోలీసుల సహకారంతో బోయిపాలెం జంక్షన్ వద్ద వాహనాల తనిఖీ చేపట్టారు. ఈ క్రమంలో ఆనందపురం వైపు నుంచి నగరంలోకి వస్తున్న ఒక బొలేరో వాహనం, దాని ముందున్న బైక్ తిరిగి వెనక్కి వెళ్లిపోబోయాయి. వాటిని గుర్తించిన ఆనందపురం సీఐ సీహెచ్ వాసునాయుడు తన సిబ్బందితో కలిసి వెంబడించి ఆపారు. బొలేరోలో చూడగా తవుడు బస్తాలు కనిపించాయి. అయితే తమను చూసి వెనక్కి వెళ్లిపోవాల్సిన అవసరం ఏముందనే అనుమానంతో లోడును క్షుణ్ణంగా తనిఖీ చేయగా, నాలుగు బస్తాల్లో 40 గంజాయి ప్యాకెట్‌లు కనిపించాయి. వాటిని తూకం వేయగా 200 కిలోలు ఉన్నట్టు డీసీపీ వివరించారు. బొలేరో వాహనంలో ఉన్న ముగ్గురితోపాటు బైక్ మీద పైలట్‌గా వచ్చిన వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారించగా...ఒడిశాలోని కోలాపూర్ జిల్లా నుంచి గంజాయిని విశాఖ తీసుకువస్తున్నారని తేలిందన్నారు. విశాఖలో విక్రయించాలని నిందితులు పథకం రచించారన్నారు. బొలేరో వాహనంలో ఉన్న కోరాపుట్ జిల్లా జమ్మగుడ గ్రామానికి చెందిన రఘు హంటల్ (27), హోరగుడకు చెందిన నరేంద్ర పాంగి (28), కోరాపుట్ జిల్లా పుజారిపుట్ గ్రామానికి చెందిన బినయ మండల్ (30), రబీంద్ర ఖిల (24)లను అరెస్టు చేశామన్నారు. వారి నుంచి బొలేరో వాహనంతోపాటు ద్విచక్ర వాహనం, మూడు సెల్‌ఫోన్‌లు స్వాధీనం చేసుకున్నామన్నారు. ఈ సమావేశంలో ఆనందపురం సీఐ వాసునాయుడు, టాస్క్‌ఫోర్స్ సీఐ భాస్కరరావు తదితరులు పాల్గొన్నారు.
Updated Date - May 14 , 2025 | 12:48 AM