ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

రెవెన్యూలో బదిలీలు

ABN, Publish Date - Jun 11 , 2025 | 12:55 AM

ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో రెవెన్యూకు సంబంధించి 85 మందిని బదిలీ చేశారు.

12 మంది తహశీల్దార్లు, 28 మంది డీటీలు

26 మంది సీనియర్‌ అసిస్టెంట్లు, 14 మంది జూనియర్‌ అసిస్టెంట్లు,

ట్రెజరీలో బదిలీలపై విమర్శల వెల్లువ

విశాఖపట్నం, జూన్‌ 10 (ఆంధ్రజ్యోతి):

ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో రెవెన్యూకు సంబంధించి 85 మందిని బదిలీ చేశారు. వీరిలో 12 మంది తహశీల్దార్లను సోమవారం రాత్రి బదిలీ చేయగా, 28 మంది డిప్యూటీ తహశీల్దార్లు, 26 మంది సీనియర్‌ అసిస్టెంట్లు, 14 మంది జూనియర్‌ అసిస్టెంట్లు, ఐదుగురు అటెండర్లకు స్థానచలనం కల్పిస్తూ అర్ధరాత్రి తరువాత ఉత్తర్వులు వెలువరించారు. పలువురిని విశాఖ జిల్లా నుంచి అనకాపల్లి, అల్లూరి జిల్లాలకు పంపగా, అల్లూరి, అనకాపల్లి నుంచి కొందరిని విశాఖకు బదిలీ చేశారు. అయితే విశాఖ కలెక్టరేట్‌లో పనిచేస్తున్న ఉద్యోగుల్లో కొద్దిమందిని తప్ప మిగిలిన వారిని కదిలించలేదనే వాదన రెవెన్యూ ఉద్యోగుల్లో వినిపిస్తోంది. పలు కారణాలతో కొందరు బదిలీల నుంచి తప్పించుకున్నారని వ్యాఖ్యానిస్తున్నారు. ఇక పెందుర్తి తహశీల్దారుగా నియమితులైన అల్లూరి జిల్లా జీకే వీధి తహశాల్దార్‌ టి.రామకృష్ణపై పలు ఆరోపణలు ఉన్నాయని, ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో రాజాం, వంగర, కొత్తూరు మండలాల్లో పనిచేసిన సమయంలో అక్రమాలకు పాల్పడడంతో ఆయన సస్పెండ్‌ అయ్యారని అంటున్నారు. అటువంటి అధికారిని పెందుర్తి తహశీల్దారుగా ఎలా నియమిస్తారని పలువురు ప్రశ్నిస్తున్నారు.

ట్రెజరీ బదిలీల్లో ఒంటెత్తు పోకడలు

జిల్లా ఖజానా కార్యాలయంలో ఐదారు రోజుల క్రితం జరిగిన బదిలీల్లో అక్రమాలు జరిగాయని ‘ఆంధ్రజ్యోతి’లో కథనం రావడంతో అధికారులు స్పందించారు. బదిలీల కోసం ఏర్పాటైన కమిటీ సోమవారం రాత్రి చర్చించి ఉత్తర్వులను స్వల్పంగా సవరించింది. మొత్తం 34 మందిలో ఐదుగురి వ్యవహారంలో పొరపాట్లు సవరించామని ఇన్‌చార్జి డీటీవో గోవిందరావు తెలిపారు. అయితే కార్యాలయంలో భారీగా మామూళ్లు వసూలుచేసే ఉద్యోగిని వెనుకేసుకు వచ్చే ప్రయత్నం చేశారనే ఆరోపణలు ఉన్నాయి. కాగా అవుట్‌ సోర్సింగ్‌ కింద పనిచేసే డేటా ఎంట్రీ ఆపరేటర్లు, అటెండర్ల బదిలీలు వివాదాస్పదమయ్యాయి. డేటా ఎంట్రీ ఆపరేటర్లకు నెలకు రూ.16 వేలు, అటెండర్లకు రూ.12 వేలు ఇస్తున్నారు. అంత తక్కువ వేతనంతో పాడేరు, నర్సీసట్నం, ఎలమంచిలిలో ఎలా బతుకుతామని వారంతా ప్రశ్నిస్తున్నారు. దీనిపై ఇన్‌చార్జి డీటీవో గోవిందరావు మాట్లాడుతూ అవుట్‌ సోర్సింగ్‌ ఆపరేటర్లు, అటెండర్ల పోస్టులు పాడేరు, నర్సీపట్నం, ఎలమంచిలిలో ఉన్నాయని, అందుకే వారిని అక్కడకు పంపామన్నారు. అయితే పని ఒత్తిడి ఎక్కువగా ఉన్న విశాఖకు వారం, పది రోజుల తరువాత తీసుకువస్తామన్నారు.

టీచర్ల బదిలీల కౌన్సెలింగ్‌ నేటికి వాయిదా

సాంకేతిక సమస్యతో సర్వర్‌ పనిచేయకపోవడమే కారణం

మహారాణిపేట, జూన్‌ 10 (ఆంధ్రజ్యోతి):

సెకండరీగ్రేడ్‌ టీచర్ల (ఎస్జీటీ) బదిలీల కౌన్సెలింగ్‌కు సాంకేతిక సమస్య ఎదురైంది. రాష్ట్రస్థాయిలో పాఠశాల విద్యా శాఖ సర్వర్‌లో ఏర్పడిన ఇబ్బంది వల్ల కౌన్సెలింగ్‌ వాయిదా పడింది. ముందుగా అనుకున్న షెడ్యూల్‌ ప్రకారం మంగళవారం కౌన్సెలింగ్‌ ప్రారంభం కావాలి. ఐదారు రోజులు చేపట్టాల్సిన ఈ ప్రక్రియకు సంబంధించి జడ్పీ సమావేశ మందిరాన్ని వేదికగా ఖరారు చేశారు. తొలిరోజు మధ్యాహ్నం ఒంటి గంటకు కౌన్సెలింగ్‌ ప్రారంభం అవుతుందని విద్యా శాఖ ప్రకటించింది. సీనియారిటీ జాబితా ప్రకారం ఒకటి నుంచి 500 నంబర్‌ వరకూ తొలిరోజు బదిలీలు చేపడతామని వెల్లడించడంతో ఉమ్మడి జిల్లాలోని అన్ని ప్రాంతాల నుంచి టీచర్లు హాజరయ్యారు. బదిలీలు మాన్యువల్‌గా చేపట్టాల్సి ఉన్నా సీనియారిటీ జాబితా ప్రదర్శన, ఆప్షన్స్‌ కోరుకున్న తరువాత వారి వివరాలు ఆన్‌లైన్‌లో నమోదు చేయాల్సి ఉంటుంది. అందుకు సంబంధించిన సాఫ్ట్‌వేర్‌కు సాంకేతిక సమస్య వచ్చింది. దీంతో మధ్యాహ్నం నుంచి కౌన్సెలింగ్‌ను వాయిదా వేస్తూ వచ్చారు. సమస్య తొలగకపోవడంతో రాత్రి తొమ్మిది గంటల సమయంలో బదిలీ కౌన్సెలింగ్‌ బుధవారానికి వాయిదా వేస్తున్నట్టు విద్యా శాఖ ప్రకటించింది. అయితే బుధవారం ఒకటో నంబరు నుంచి 300 వరకూ మాత్రమే కౌన్సెలింగ్‌ నిర్వహిస్తామని తెలిపింది. గురువారం నుంచి ఏ ర్యాంకు నుంచి ఏ ర్యాంకు వరకూ కౌన్సెలింగ్‌ నిర్వహించేదీ ప్రకటిస్తామని పేర్కొంది. కౌన్సెలింగ్‌కు మంగళవారం ఉదయం ఏజెన్సీ, మైదానం నుంచి వచ్చిన టీచర్లు గంటల తరబడి పడిగాపులు కాశారు. తీరా బుధవారానికి కౌన్సెలింగ్‌ వాయిదా వేస్తున్నట్టు అధికారులు ప్రకటించడంతో తిరిగి సొంతూళ్లకు వెళ్లడానికి రవాణా సదుపాయం లేకపోవడంతో నగరంలోనే బస చేయాల్సి వస్తోందని పలువురు టీచర్లు వాపోతున్నారు.

ఐసీడీఎస్‌లో పలువురి బదిలీలు

విశాఖపట్నం, జూన్‌ 10 (ఆంధ్రజ్యోతి):

మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖలో 12 మంది సూపర్‌ వైజర్లు, ఇద్దరు సీడీపీవోలు, మరో ఇద్దరు సీనియర్‌ అసిస్టెంట్లకు బదిలీ అయ్యింది. ఒకేచోట ఐదేళ్లు సర్వీస్‌ పూర్తిచేసుకున్న ఉద్యోగులను బదిలీలు చేసినట్టు అధికారులు వెల్లడించారు.

ఆర్డీ కార్యాలయ పరిధిలో 1,040 దరఖాస్తులు

వైద్య, ఆరోగ్య శాఖ ప్రాంతీయ కార్యాలయ పరిధిలో బదిలీలకు సంబంధించిన ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటివరకూ 27 కేడర్లకు చెందిన 1,040 మంది ఉద్యోగులు బదిలీల కోసం దరఖాస్తు చేసుకున్నారు. మంగళవారం, బుధవారాల్లో అభ్యంతరాలను అధికారులు స్వీకరిస్తున్నారు. మరో మూడు రోజుల్లో బదిలీల ప్రక్రియ ముగిస్తుందని అధికారులు వెల్లడించారు. ఐదేళ్లు సర్వీస్‌ పూర్తి చేసుకున్న ప్రతి ఒక్కరినీ బదిలీ చేస్తున్నట్టు ఆర్డీ రాధారాణి వెల్లడించారు.

Updated Date - Jun 11 , 2025 | 12:55 AM