విద్యా శాఖలో బదిలీలు పూర్తి
ABN, Publish Date - Jun 17 , 2025 | 12:52 AM
ఉమ్మడి విశాఖపట్నం జిల్లా విద్యా శాఖలో బదిలీల కౌన్సెలింగ్ శనివారంతో ముగియడంతో బదిలీ అయిన ఉపాధ్యాయులు సోమవారం నుంచి కొత్త స్థానాల్లో బాధ్యతలు స్వీకరిస్తున్నారు.
ఉమ్మడి జిల్లాలో హెచ్‌ఎంల నుంచి ఎస్‌జీటీల వరకు 2,200 మందికి స్థానచలనం
కొత్త స్థానాల్లో చేరుతున్న ఉపాధ్యాయులు
(అనకాపల్లి-ఆంధ్రజ్యోతి)
ఉమ్మడి విశాఖపట్నం జిల్లా విద్యా శాఖలో బదిలీల కౌన్సెలింగ్ శనివారంతో ముగియడంతో బదిలీ అయిన ఉపాధ్యాయులు సోమవారం నుంచి కొత్త స్థానాల్లో బాధ్యతలు స్వీకరిస్తున్నారు. గ్రేడ్-2 హెచ్‌ఎం, పీడీలు, స్కూల్ అసిస్టెంట్‌లు, ఎస్‌జీటీలు మొత్తం 2,200 మందికి స్థానచలనం కల్పించారు. ఎస్‌జీటీల్లో మేథ్స్ 270 మంది, ఇంగ్లీష్ 272 మంది, ఫిజిక్స్ 200 మంది, సోషల్ 220 మంది, తెలుగు 170 మంది, హిందీ 170 మంది, ఎన్‌ఎస్ టీటీర్లు 170 మందికి బదిలీలు అయ్యాయి. బదిలీ ఉత్తర్వులు జారీ చేసిన తరువాత వారం రోజుల్లో కొత్త స్థానాల్లో చేరాల్సి వుంటుంది. అనకాపల్లి మండలం కొండకొప్పాక జడ్పీ ఉన్నత పాఠశాలలో 18 మంది ఉపాధ్యాయులకుగాను ఏకంగా 15 మందికి స్థానచలనం కల్పించారు. ఇక్కడ నియమితులైన వారిలో ఇప్పటికే 13 మంది ఉపాధ్యాయులు విధుల్లో చేరారు. జీవీఎంసీ అనకాపల్లి జోన్ పరిఽధిలోని 202 మంది ఉపాధ్యాయులకు స్థానచలనం కలిగింది. విశాఖపట్నం నుంచి పలువురు ఉపాధ్యాయులు అనకాపల్లి పరిధిలోని పాఠశాలలకు బదిలీపై వచ్చారు. హెచ్‌ఎం బదిలీలు ముందుగానే జరగడంతో వారంతా ఇప్పటికే విధుల్లో చేరారు... పాతవారు రిలీవ్ అయ్యారు. జిల్లా విద్యా శాఖాధికారి గిడ్డి అప్పారావునాయుడు మాట్లాడుతూ, బదిలీ అయిన ఉపాధ్యాయులంతా ఒకటి, రెండు రోజుల్లో వారికి కేటాయించిన స్కూళ్లలో చేరాలని అన్నారు. యోగాంధ్ర ఏర్పాట్ల పర్యవేక్షణ కోసం పీఈటీలు జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో రిపోర్టు చేయాలని సూచించారు.
Updated Date - Jun 17 , 2025 | 12:52 AM