నేడు అన్నదాత సుఖీభవ సొమ్ములు జమ
ABN, Publish Date - Aug 02 , 2025 | 12:51 AM
అన్నదాత సుఖీభవ పథకం కింద జిల్లాలో 18,573 మంది రైతుల ఖాతాలకు శనివారం రూ.ఐదు వేల వంతున జమ కానున్నది.
ఐదేసి వేల చొప్పున ఇవ్వనున్న కూటమి ప్రభుత్వం
జిల్లాలో 18,573 మంది రైతులకు ప్రయోజనం
పీఎం కిసాన్ కింద 18,100 మందికి రూ.రెండు వేల వంతున...
విశాఖపట్నం, ఆగస్టు 1 (ఆంధ్రజ్యోతి):
అన్నదాత సుఖీభవ పథకం కింద జిల్లాలో 18,573 మంది రైతుల ఖాతాలకు శనివారం రూ.ఐదు వేల వంతున జమ కానున్నది. ఇంకా కేంద్ర ప్రభుత్వం అమలుచేస్తున్న పీఎం కిసాన్ పథకం కింద 18,100 మంది రైతుల ఖాతాలకు రూ.రెండు వేల వంతున జమ కానున్నది. కేంద్రం ఏటా రూ.6 వేలు మూడు విడతలుగా రైతులకు అందజేస్తున్నది. ఇక రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం రూ.14 వేలు అందజేయనున్నది. తొలి విడత రూ.ఐదు వేలు శనివారం జమ చేస్తోంది. రెండో విడతలో రూ.ఐదు వేలు డిసెంబరు నెలలో, చివరి విడతగా రూ.నాలుగు వేలు వచ్చే ఏడాది మార్చి నెలలో రైతుల ఖాతాకు జమ చేయనున్నట్టు ప్రకటించింది. ఏడాదికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి రూ.20 వేలు ఇవ్వనున్నాయి. విశాఖ జిల్లాలో అన్నదాత సుఖీభవ కింద 18,573 మంది రైతులకు రూ.9.28 కోట్లు, పీఎం కిసాన్ కింద 18,100 మందికి రూ.3.62 కోట్లు...మొత్తం రూ.12.9 కోట్లు జమ కానున్నది. అన్నదాత సుఖీభవ పథకానికి అర్హులు భీమిలి నియోజకవర్గంలో 14,981 మంది, పెందుర్తిలో 3,126 మంది, గాజువాకలో 466 మంది ఉన్నారు. పీఎం కిసాన్ పథకానికి భీమిలి నియోజకవర్గంలో 13,972 మంది, పెందుర్తిలో 3,486 మంది, గాజువాకలో 577 మంది, విశాఖ పశ్చిమలో 35 మంది, తూర్పులో తొమ్మిది మంది, విశాఖ ఉత్తరంలో 21 మంది అర్హులు ఉన్నారు. పథకం ప్రారంభంలో భాగంగా భీమిలి నియోజకవర్గ పరిధిలోని పద్మనాభం మండలం పాండ్రంకి, పెందుర్తిలో సబ్బవరంలో రైతులతో సమావేశం ఏర్పాటుచేయాలని వ్యవసాయ శాఖ నిర్ణయించింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందజేసే సొమ్ములు శనివారం నుంచి రైతుల ఖాతాకు జమ అవుతాయని జిల్లా వ్యవసాయ శాఖాధికారి కె.అప్పలస్వామి తెలిపారు.
Updated Date - Aug 02 , 2025 | 12:51 AM