అభివృద్ధిలో ముందుండాలి
ABN, Publish Date - Apr 18 , 2025 | 12:45 AM
విద్య, వైద్యం, వ్యవసాయ రంగాల అభివృద్ధికి అధికారులంతా ప్రత్యేకంగా కృషిచేయాలని, జిల్లాను అన్ని రంగాల్లో ముందంజలో నిలపాలని ఎంపీ ఎం.శ్రీభరత్ అన్నారు.
జిల్లా స్థాయి అభివృద్ధి సమన్వయ, మానటరింగ్ కమిటీ (దిశా) సమావేశంలో అధికారులతో ఎంపీ ఎం.శ్రీభరత్
ప్రధానంగా విద్య, వైద్య, వ్యవసాయ రంగాలను దృష్టిసారించాలి
ప్రభుత్వ పాఠశాలలు, అంగన్వాడీల్లో పిల్లల సంఖ్య పెంచాలి
క్రీడా మైదానాలు, స్టేడియాలను అభివృద్ధి చేయాలి
కప్పరాడ ఉన్నత పాఠశాల అభివృద్ధి, గాజువాక నుంచి లంకెలపాలెం వరకూ సర్వీస్ రోడ్డు అభివృద్ధికి ప్రతిపాదనలు
విశాఖపట్నం, ఏప్రిల్ 17 (ఆంధ్రజ్యోతి):
విద్య, వైద్యం, వ్యవసాయ రంగాల అభివృద్ధికి అధికారులంతా ప్రత్యేకంగా కృషిచేయాలని, జిల్లాను అన్ని రంగాల్లో ముందంజలో నిలపాలని ఎంపీ ఎం.శ్రీభరత్ అన్నారు. గురువారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో నిర్వహించిన జిల్లా స్థాయి అభివృద్ధి సమన్వయ, మానటరింగ్ కమిటీ (దిశా) సమావేశంలో కేంద్ర ప్రాయోజిత పథకాల అమలు తీరుతెన్నులు, క్షేత్రస్థాయి పరిస్థితులను ఆయన సమీక్షించారు. ప్రభుత్వ పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాల్లో చేరే పిల్లల సంఖ్యను పెంచాలన్నారు. గత సమావేశంలో చర్చకు వచ్చిన అంశాలు, వాటిపై తీసుకున్న చర్యల గురించి అధికారులను సమీక్షించారు. ప్రతి ఒక్కరూ జిల్లా అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. ఈ సందర్భంగా జిల్లాలో అమలవుతున్న పథకాల వివరాలను కలెక్టర్ ఎం.ఎన్.హరేంధిరప్రసాద్ వివరించారు.
నగరంలో తవ్విన రోడ్లు వెంటనే పూడ్చండి
వివిధ అభివృద్ధి పనుల నిమిత్తం నగరంలో తవ్విన రోడ్లను వెంటనే పూడ్చాలని ఎంపీ శ్రీభరత్ ఆదేశించారు. భూగర్భ విద్యుత్ లైన్లు, తాగునీటి పైపులైన్లు, యూజీడీ ఏర్పాటుకు పలుచోట్ల రోడ్లను తవ్వేస్తున్నారని, వాటి వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఎమ్మెల్యేలు గణబాబు, పంచకర్ల రమేష్‌బాబు ప్రస్తావించడంతో ఎంపీ స్పందించారు. నిర్దేశించిన పనులు పూర్తయిన వెంటనే గోతులు పూడ్చాలని, కొత్తగా వేసిన రహదారులు తవ్వకుండా ప్రణాళికాయుతంగా చర్యలు చేపట్టాలన్నారు. మేహాద్రిగెడ్డ రిజర్వాయర్ గేట్ల మరమ్మతులకు జీవీఎంసీ నిధుల వినియోగంపై పూర్తిస్థాయి నివేదిక ఇవ్వాలన్నారు. ‘రాజీవ్ గృహకల్ప’ పథకంలో నిర్మించిన ఇళ్లకు మరమ్మతులు చేయాలని, ఇప్పటికీ వినియోగించుకోని లబ్ధిదారులకు నోటీసులు ఇవ్వాలని అధికారులకు గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు సూచించారు. కప్పరాడ ఉన్నత పాఠశాలను అభివృద్ధి చేయాలని ఉత్తర నియోజకవర్గ శాసనసభ్యుడు విష్ణుకుమార్‌రాజు కోరగా అందుకు తగిన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని విద్యాశాఖాధికారులను ఎంపీ ఆదేశించారు. తప్పుడు పత్రాలు సమర్పించే వ్యక్తులకు విద్యుత్ సౌకర్యం కల్పించవద్దని పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్‌బాబు కోరారు. ఇంకా ఎంపీ మాట్లాడుతూ జిల్లాలో క్రీడా మైదానాలు, స్టేడియాలను అభివృద్ధి చేయాలని, వేసవి క్యాంపులు నిర్వహించాలని, ఉద్యానవన, సేంద్రీయ, ప్రకృతి వ్యవసాయ విధానాలను ప్రోత్సహించాలన్నారు. గాజువాక నుంచి లంకెలపాలెం వరకూ సర్వీస్ రోడ్డు అభివృద్ధి చేయాలని ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు సూచన మేరకు ప్రతిపాదన చేయాలని సంబంధిత అధికారులకు ఎంపీ ఆదేశించారు. వర్కింగ్ ఉమెన్స్ హాస్టళ్లలో కెపాసిటీ పెంచాలన్నారు. సమావేశంలో ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు, డీఆర్వో భవానీశంకర్, ఇతర అధికారులు పాల్గొన్నారు.
Updated Date - Apr 18 , 2025 | 12:45 AM