ఒరిగిన శిఖరం
ABN, Publish Date - Jun 08 , 2025 | 01:06 AM
మాజీ శాసనసభ్యుడు పల్లా సింహాచలం (86) శనివారం కన్నుమూశారు.
మాజీ ఎమ్మెల్యే పల్లా సింహాచలం అస్తమయం
షిప్‌యార్డులో కార్మికుడిగా ఉద్యోగ జీవితం ప్రారంభం
కార్మిక నాయకుడిగా సుదీర్ఘ కాలం సేవలు
అనంతరం రాజకీయాల్లోకి రాక
విశాఖపట్నం, జూన్ 7 (ఆంధ్రజ్యోతి):
మాజీ శాసనసభ్యుడు పల్లా సింహాచలం (86) శనివారం కన్నుమూశారు. కొద్దికాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన నగరంలోని సీతంపేటలో గల తన స్వగృహంలో కన్నుమూశారు. గాజువాక ప్రాంతానికి చెందిన ఆయన రాజకీయాల్లో వివాదరహితునిగా పేరు సంపాదించుకున్నారు. అన్ని వర్గాలు, పార్టీల నాయకులతో సత్సంబంధాలు కొనసాగించారు. సింహాచలం హిందూస్థాన్ షిప్‌యార్డులో కార్మికునిగా ఉద్యోగ జీవితం ప్రారంభించారు. తోటి కార్మికులకు, ఉద్యోగులకు సమస్యలు వచ్చినప్పుడు అండగా నిలిచేవారు. నాడు షిప్‌యార్డులో 365 కార్మికుల సర్వీస్ క్రమబద్ధీకరణ కోసం అరవై మందిని ఢిల్లీ తీసుకువెళ్లి పార్లమెంటు సభ్యులందరికీ లేఖలు ఇప్పించారు. దీనిపై కేంద్రం స్పందించి కార్మికులను రెగ్యులర్ చేయడంతో సింహాచలం షిప్‌యార్డులో కార్మిక నాయకుడిగా ప్రాచుర్యంలోకి వచ్చారు. షిప్‌యార్డుతో పాటు హిందూస్థాన్ జింక్, హెచ్‌పీసీఎల్ కర్మాగారాలలో జరిగిన అనేక కార్మిక ఉద్యమాల్లో పాల్గొన్న ఆయన 1974లో గాజువాక సర్పంచ్‌గా ఎన్నికయ్యారు. పదేళ్లపాటు అదే పదవిలో కొనసాగారు. అదే సమయంలో విశాఖ ఉక్కు కర్మాగారం నిర్వాసితుల పక్షాన పోరాటం చేశారు. ఉక్కు కర్మాగారం కోసం ఆయనతోపాటు ఆయన కుటుంబ సభ్యులు భూములు ఇచ్చారు. కార్మిక నాయకుడిగా, యాదవ సామాజిక వర్గ నేతగా ప్రాచుర్యం పొందిన సింహాచలం 1980లో పెందుర్తి అసెంబ్లీకి జరిగిన ఉప ఎన్నికలో స్వతంత్య్ర అభ్యర్థిగా పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి ద్రోణంరాజు సత్యనారాయణ చేతిలో ఓటమి చెందారు. ఆ తరువాత కాంగ్రె్‌సలో చేరిన సింహాచలం 1983లో విశాఖ-2 నుంచి పోటీ చేసి టీడీపీ అభ్యర్థి ఈసరవు వాసుదేవరావు చేతిలో ఓడిపోయారు. అనంతరం సింహాచలం తెలుగుదేశం పార్టీలో చేరారు. 1989లో పెందుర్తి నుంచి పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి గుడివాడ గురునాథరావు చేతిలో ఓటమి చెందారు. 1994 ఎన్నికల్లో విశాఖ-2 నుంచి టీడీపీ తరపున పోటీచేసి విజయం సాధించారు. 1999లో జరిగిన ఎన్నికల్లో పల్లా సింహాచలానికి టికెట్ లభించలేదు. తిరిగి 2004లో విశాఖ-2 నుంచి టీడీపీ తరపున బరిలో దిగి కాంగ్రెస్ అభ్యర్థి సరిపల్లి రంగరాజు చేతిలో ఓటమి చెందారు. ఆయన వారసునిగా పల్లా శ్రీనివాసరావు రాజకీయాల్లోకి వచ్చారు. ప్రస్తుతం శ్రీనివాసరావు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షునిగా, గాజువాక ఎమ్మెల్యేగా ఉన్నారు. సింహాచలం అంత్యక్రియలు ఆదివారం గాజువాకలో నిర్వహించనున్నట్టు కుటుంబ సభ్యులు తెలిపారు.
Updated Date - Jun 08 , 2025 | 01:06 AM