పిడుగుల వర్షం
ABN, Publish Date - May 16 , 2025 | 12:40 AM
జిల్లాలో గురువారం భిన్నమైన వాతావరణం నెలకొంది. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఎండ ఠారెత్తించింది. సగానికిపైగా మండలాల్లో 40 డిగ్రీలకు మించి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మధ్యాహ్నం తరువాత వాతావరణం మారిపోయింది. ఆకాశంలో మేఘాలు కుమ్ముకున్నాయి. అనంతరం ఈదురుగాలులు ఆరంభం అయ్మాయి.
పలు మండలాల్లో ఈదురు గాలుల బీభత్సం
నేలకొరిగిన చెట్లు, విద్యుత్ స్తంభాలు
పిడుగులు పడి పశువులు, జీవాలు మృతి
ఉదయం నుంచి మధ్యాహ ్నం వరకు తీక్షణంగా కాసిన ఎండ
అనంతరం మారిన వాతావరణం
పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షం
నేడు, రేపు వర్షసూచన
అనకాపల్లి, మే 15 (ఆంధ్రజ్యోతి, న్యూస్ నెట్‌వర్క్): జిల్లాలో గురువారం భిన్నమైన వాతావరణం నెలకొంది. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఎండ ఠారెత్తించింది. సగానికిపైగా మండలాల్లో 40 డిగ్రీలకు మించి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మధ్యాహ్నం తరువాత వాతావరణం మారిపోయింది. ఆకాశంలో మేఘాలు కుమ్ముకున్నాయి. అనంతరం ఈదురుగాలులు ఆరంభం అయ్మాయి. మరికొద్దిసేపటికి ఉరుములు, పిడుగులతో వర్షం మొదలైంది. ఈదురు గాలుల ధాటికి చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. చెట్ల కొమ్మలు విరిగిపడ్డాయి. ఇళ్ల రేకులు లేచిపోయాయి. మామిడి, బొప్పాయిఇ తోటల్లో కాయలు నేలరాయి. పిడుగులు పడడంతో మాడుగుల, చోడవరం నియోజకవర్గాల్లో పశువులు, మేకలు మృత్యువాత పడ్డాయి. వర్షం పడడంతో వాతావరణం చల్లబడింది. వర్షం కారణంగా నేల మెత్తబడి వేసవి దుక్కులకు దోహదపడుతుందని రైతులు చెబుతున్నారు.
అనకాపల్లి పట్టణంలో మధ్యాహ్నం మూడు గంటల వరకు ఎండ మండిపోయింది. తర్వాత వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. 11.3 ఎం.ఎం.గా వర్షం కురిసింది. చోడవరంలో ఈదురుగాలులతో మోస్తరు వర్షం కురిసింది. ఆకాశంలో దట్టంగా కుమ్ముకున్న మేఘాలను చూసి భారీ వర్షం కురుస్తుందని భావించారు. అయితే ఈదురు గాలులు వీచడంతో మేఘాలు వర్షించకుండానే వెళ్లిపోయాయి. మండలంలోని గంధవరంలో పిడుగుపడి యలమంచిలి నానాజీ అనే రైతుకు చెందిన ఆవు మృతిచెందింది.
ఉరుములు, పిడుగులతో రావికమతం మండలం దద్దరిల్లిపోయింది. రావికమతం శెట్టి వారి పొలాల వద్ద మేత కోసం వచ్చిన మేకలు, గొర్రెల మందపై పిడుగు పడింది. దీంతో మరుపాక గ్రామానికి చెందిన నమ్మి వెంకటస్వామికి చెందిన ఐదు మేకలు, శీరా సాంబకు చెందిన మూడు గొర్రెలు, శీరా వెంకటరమణకు చెందిన నాలుగు మేకలు, దేవర అప్పల నాయుడుకు చెందిన రెండు మేకలు, కేబీపీ అగ్రహారానికి చెందిన దేవర అప్పారావుకు చెందిన రెండు గొర్రెలు మృతిచెందాయి. వీటి విలువ రూ.5 లక్షలు వుంటుందని బాధితులు తెలిపారు. కాగా మట్టవానిపాలెంలో మైచర్ల విశ్వనాథం పశువుల షెడ్‌పై పిడుగు పడి ఆవు మృతిచెందింది.
మాడుగుల మండలంలో గురువారం సాయంత్రం ఈదురు గాలులు బీభత్సం సృష్టించాయి. సత్యవరం గ్రామంలో 20 వరకు విద్యుత్ స్తంభాలు, మూడు ట్రాన్స్‌ఫార్మర్లు, పలుచెట్లు నేలకొరిగాయి. ఇళ్లపై రేకులు, తాటాలు లేచిపోయాయి. జంపెన, వీరనారాయణం, తదితర గ్రామాల్లో కూడా విద్యుత్ స్తంభాలు పడిపోయినట్టు సమాచారం. కోటవురట్ల మండలంలోని పలు గ్రామాల్లో సుమారు గంటన్నరపాటు వర్షం కురిసింది. రహదారులు జలమయం అయ్యాయి. డ్రైనేజీ కాలువలు పొంగి, చెత్తచెదారం రోడ్లపైకి చేరింది.ఎలమంచిలిలో గురువారం సాయంత్రం గంటపాటు ఉరుములు, పిడుగులతో భారీ వర్షం కురిసింది. డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేకపోవడంతో వర్షంనీరు రోడ్లపై నిలిచిపోయింది.
కాగా బుచ్చెయ్యపేట, రాంబిల్లి, ఎస్.రాయవరం, మునగపాక, కశింకోట, కె.కోటపాడు, సబ్బవరం, నర్సీపట్నం, పాయకరావుపేట, గొలుగొండ, నక్కపల్లి మండలాల్లో తేలికపాటి జల్లులు పడ్డాయి. రానున్న రెండు రోజుల్లో జిల్లాలో ఉరుములతో మోస్తరు వర్షాలు, కొన్నిచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది.
మధ్యాహ్నం వరకు ఠారెత్తించిన ఎండ
జిల్లాలో ఉదయం ఎనిమిది గంటల నుంచే ఎండ తీక్షణంగా కాసింది. పది గంటల నుంచి రహదారులపై జన సంచారం తగ్గిపోయింది. మధ్యాహ్నానికి ఉష్ణోగ్రతలు గరిష్ఠసాయికి చేరుకున్నాయి. ఎండ వేడికితోడు ఉక్కపోతతో జనం విలవిలలాడారు. అయితే మధ్యాహ్నం మూడు గంటలతరువాత వాతావరణం మారిపోయి ఆకాశం మేఘావృతమైంది. చల్లగి ఈదురు గాలులు వీచాయి. పలుచోట్ల వర్షం పడింది. కాగా జిల్లాలో చీడికాడ, దేవరాపల్లి, మాడుగుల, నర్సీపట్నం, నాతవరం, రావికమతం, రోలుగుంట మండలాల్లో 40.2 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కె.కోటపాడు, సబ్బవరంలో 40.1 డిగ్రీలు, అనకాపల్లి, బుచ్చెయ్యపేట, చోడవరం, కోటవురట్ల, పరవాడలో 40 డిగ్రీలు, అచ్యుతాపురం, కశింకోట, మాకవరపాలెం, మునగపాక, నక్కపల్లి, పాయకరావుపేట, రాంబిల్లి, ఎస్.రాయవరం, ఎలమంచిలి మండలాల్లో 39.9 డిగ్రీలు నమోదయ్యాయి.
Updated Date - May 16 , 2025 | 12:40 AM