ఎవరికీ పట్టని గ్రామమిది!
ABN, Publish Date - Apr 17 , 2025 | 10:55 PM
ఆంధ్ర కశ్మీర్ లంబసింగికి సమీపంలో ఉన్న పీవీటీజీ గ్రామం జలగలగెడ్డలో కనీస వసతులు లేక గిరిజనులు అవస్థలు పడుతున్నారు. ఈ గ్రామానికి కనీస రహదారి లేదు. గిరిజనులు కాలిబాటపై రాకపోకలు సాగిస్తున్నారు.
కనీస వసతులు లేని జలగలగెడ్డ
లంబసింగికి సమీపంలో ఉన్న పీవీటీజీ గ్రామం
రహదారి, తాగునీటి పథకం లేక అవస్థలు
తప్పని డోలీమోతలు
పక్కా గృహాలు మంజూరైనా నిర్మాణ సామగ్రి తరలించే మార్గం కరువు
ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఆదిమజాతి ఆదివాసీలు
చింతపల్లి, ఏప్రిల్ 17 (ఆంధ్రజ్యోతి): ఆంధ్ర కశ్మీర్ లంబసింగికి సమీపంలో ఉన్న పీవీటీజీ గ్రామం జలగలగెడ్డలో కనీస వసతులు లేక గిరిజనులు అవస్థలు పడుతున్నారు. ఈ గ్రామానికి కనీస రహదారి లేదు. గిరిజనులు కాలిబాటపై రాకపోకలు సాగిస్తున్నారు. అత్యవసర పరిస్థితుల్లో రోగులు, గర్భిణులను డోలీపై ఆస్పత్రికి తరలించాల్సి వస్తున్నది. మంచినీళ్ల కోసం మహిళలు అడవి మార్గంలో ప్రయాణించాల్సిన దుస్థితి నెలకొంది. గత ఐదేళ్లుగా గ్రామానికి చెందిన ఆదిమజాతి ఆదివాసీలు పలుమార్లు వైసీపీ ప్రజాప్రతినిధులు, అధికారులకు విన్నవించుకున్నప్పటికి పరిష్కారానికి నోచుకోలేదు.
మండలంలోని లంబసింగి పంచాయతీ పరిధిలో జలగలగెడ్డ గ్రామం ఉంది. గ్రామంలో 45 ఆదిమజాతి ఆదివాసీ(పీవీటీజీలు) కుటుంబాలు 70 ఏళ్లుగా నివాసముంటున్నాయి. ఆదిమజాతి ఆదివాసీలు వ్యవసాయంపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. కాఫీ, మిరియాల పంటలను సాగు చేస్తున్నారు. ఈ గ్రామంలో ప్రకృతి అందాలకు నిలయంగా పేరొందిన చెరువులవేనం గ్రామం పక్కనే ఉన్నది. లంబసింగి జంక్షన్ గ్రామానికి 1.5 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. ఈ గ్రామానికి ఇప్పటి వరకు మండల స్థాయి అధికారులు గాని, ప్రజాప్రతినిధులుగాని సందర్శించిన దాఖలాలు లేవు. దీంతో ఆదిమజాది ఆదివాసీలు ఎదుర్కొంటున్న సమస్యలు మరుగునపడిపోయాయి.
రహదారి లేక అవస్థలు
జలగలగెడ్డ గ్రామానికి కనీస రహదారి లేదు. ఈ గ్రామానికి వెళ్లేందుకు లంబసింగి జంక్షన్ నుంచి కాఫీ తోటల మధ్యలో నుంచి నడిచి వెళ్లాలి. గ్రామానికి కేవలం కాలిబాట మాత్రమే అందుబాటులో వున్నది. ఆదిమజాతి ఆదివాసీలు పొరుగు గ్రామాలకు వెళ్లేందుకు, మండల కేంద్రానికి వచ్చేందుకు లంబసింగి జంక్షన్ వరకు కాలినడకన ప్రయాణించాలి. రాత్రివేళ గ్రామానికి వెళ్లేందుకు ఆదివాసీల అవస్థలు వర్ణనాతీతం. ఇక రోగులు, గర్భిణులను ఆస్పత్రికి తరలించేందుకు డోలీపై మోసుకు వెళ్లాల్సి వస్తున్నది.
ఊటనీరే ఆధారం
ఈ గ్రామస్థులకు ఊటగెడ్డ నీరే ఆధారం. గ్రామంలోని గిరిజనులకు మంచినీటి పథకాలు అందుబాటులో లేవు. గ్రామ శివారులో ఉన్న ఊటగెడ్డ చుట్టూ పదేళ్ల క్రితం కుండీని నిర్మించారు. ప్రస్తుతం ఈ ఊటగెడ్డ నుంచి నీళ్లను తెచ్చుకుని తాగేందుకు, ఇతర అవసరాలకు ఆదివాసీలు ఉపయోగించుకుంటున్నారు. ఈ ఊటగెడ్డ గ్రామానికి కిలోమీటరు దూరంలో ఉన్నది. ఊటగెడ్డ నుంచి నీళ్ల బిందెలతో మహిళలు 70 డిగ్రీ కోణంలో దిగువ నుంచి పైకి ప్రయాణించాల్సి వస్తుంది. నీళ్ల కోసం ఒక్కొక్కరే వెళ్లే పరిస్థితి లేదు. గ్రామానికి చెందిన మహిళలందరూ ఉదయం, సాయంత్రం వేళల్లో కలిసి వెళ్లి నీళ్లను తెచ్చుకుంటున్నారు. ఈ నీళ్లను తాగడం వల్ల తరచూ అస్వస్థతకు గురవుతున్నారు.
పక్కా గృహాలు మంజూరైనా నిర్మించే దారేది?
గ్రామానికి చెందిన ఆదిమజాతి ఆదివాసీ కుటుంబాలందరికి తాజాగా కూటమి ప్రభుత్వం పీఎం జన్‌మన్ పథకంలో పక్కా గృహాలను మంజూరు చేసింది. గ్రామానికి రహదారి సదుపాయం లేపోవడం వల్ల గృహాల నిర్మాణ సామగ్రిని తరలించుకునే మార్గంలేక అవస్థలు పడుతున్నారు. గ్రామానికి ఇసుక, సిమెంట్, ఐరన్, కంకర తరలించే పరిస్థితి లేదు. ఈ నిర్మాణ సామగ్రిని లంబసింగి జంక్షన్ నుంచి 1.5 కిలోమీటర్లు మోసుకు వెళ్లాలి. దీంతో పక్కా గృహాలు మంజూరై రెండు నెలలు కావస్తున్నప్పటికి ఒక్కరు కూడా గృహ నిర్మాణ పనులు ప్రారంభించలేదు.
Updated Date - Apr 17 , 2025 | 10:55 PM