ఎలమంచిలిలో దాహం కేకలు
ABN, Publish Date - Aug 01 , 2025 | 12:47 AM
మునిసిపాలిటీలో కొళాయిల ద్వారా తాగునీటి సరఫరాల అస్తవ్యస్తంగా తయారైంది. యర్రవరం సంప్ వద్ద ఒక మోటారు పాడైపోవడం, దీనికి మరమ్మతులు చేసే సరికి వరహా నది నుంచి నీటిని సరఫరా చేసే ప్రధాన పైపులైన్ దెబ్బతిన్నది. దీంతో మూడు రోజుల నుంచి తాగునీటి కోసం ప్రజలు తీవ్ర ఇక్కట్టు పడుతున్నారు. ఇందుకు సంబంధించి వివరాలిలా వున్నాయి.
తాగునీటి సరఫరా అస్తవ్యస్తం
యర్రవరం సంప్ వద్ద పాడైన మోటారు
ప్రధాన పైప్‌లైన్ నుంచి పొలాలకు నీటిని మళ్లించిన రైతులు
ఈ సమస్యలను పరిష్కరించినా.. మెరుగుపడని నీటి సరఫరా
తాజగా పొలిమేరమ్మ తల్లి ఆలయం వద్ద ధ్వంసమైన ప్రధాన పైపులైన్
మరమ్మతులు చేయిస్తున్న అధికారులు
నేడు కూడా అరకొరగానే నీటి సరఫరా
ఎలమంచిలి, జూలై 31 (ఆంధ్రజ్యోతి): మునిసిపాలిటీలో కొళాయిల ద్వారా తాగునీటి సరఫరాల అస్తవ్యస్తంగా తయారైంది. యర్రవరం సంప్ వద్ద ఒక మోటారు పాడైపోవడం, దీనికి మరమ్మతులు చేసే సరికి వరహా నది నుంచి నీటిని సరఫరా చేసే ప్రధాన పైపులైన్ దెబ్బతిన్నది. దీంతో మూడు రోజుల నుంచి తాగునీటి కోసం ప్రజలు తీవ్ర ఇక్కట్టు పడుతున్నారు. ఇందుకు సంబంధించి వివరాలిలా వున్నాయి.
ఎలమంచిలి మునిసిపాలిటీ ప్రజల తాగునీటి అవసరాల కోసం ఎస్.రాయవరం మండలం సోముదేవునిపల్లి వద్ద వరహా నదిలో ఏర్పాటు చేసిన బోరు బావుల నుంచి మోటార్ల ద్వారా నీటిని సరఫరా చేస్తుంటారు. ఇందుకోసం సుమారు 17 కిలోమీటర్ల మేర పైపులైన్ వుంది. దీని నిర్వహణను ఆర్‌డబ్ల్యూఎస్ చూస్తున్నది. పైప్‌లైన్ ద్వారా వచ్చిన నీరు యర్రవరం వద్ద వున్న భారీ సంప్‌లోకి చేరుతుంది. ఇక్కడ నాలుగు మోటార్ల ద్వారా పట్టణంలోని వివిధ ప్రాంతాల్లో వున్న ట్యాంకులకు నీటిని పంపింగ్ చేస్తారు. ఆయా ట్యాంకుల నుంచి కొళాయిల ద్వారా ప్రజలకు తాగునీరు సరఫరా అవుతుంది. అయితే సంప్ వద్ద వున్న మోటార్లలో ఒకటి సోమవారం మొరాయించింది. మిగిలిన మూడు మోటార్ల ద్వారా ట్యాంకులకు నీటిని పంపింగ్‌చేశారు. అయితే ప్రధాన పైప్‌లైన్ ద్వారా పూర్తిస్థాయిలో నీరు రాకపోవడంతో అధికారులు తనిఖీలు చేపట్టారు. పోతిరెడ్డిపాలెం సమీపంలో కొంతమంది రైతులు ప్రధాన పైపులైన్ బూస్టర్ వాల్వును ఓపెన్ చేసి, పొలాలకు నీటిని మళ్లించుకుంటున్నట్టు గుర్తించారు. ఆయా రైతులను హెచ్చరించి, నీటి సరఫరాను చక్కదిద్దారు. అయినప్పటికీ యర్రవరం సంప్‌లోకి పూర్తిస్థాయిలో నీరు రావడం లేదు. దీంతో కొళాయిల ద్వారా నీటి సరఫరా 40 శాతానికి పడిపోయింది. మిలట్రీ కాలనీ, కొత్తపేట, గాంధీనగర్, రైల్వేస్టేషన్ రోడ్డు, క్లబ్‌రోడ్డు, ధర్మవరం, కాకివానివీధి తదితర ప్రాంతాల్లో తాగునీటికి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. యర్రవరం సంప్ వద్ద పాడైన మోటారుకు మరమ్మతులు చేయించిన అధికారులు.. వరహా పైపులైన్ నుంచి పూర్తిస్థాయిలో ఎందుకు నీటి సరఫరా ఎందుకు జరగడం లేదో ఆరా తీయలేదు. బుధవారం నాటికి తాగునీటి సమస్య మరింత తీవ్రం కావడంతో ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులకు సమాచారం ఇచ్చారు. వారి నుంచి ఎటువంటి స్పందన లేకపోవడంతో గురువారం మునిసిపల్ అధికారులు రంగంలోకి దిగి, పైప్‌లైన్‌ను తనిఖీ చేసుకుంటూ వెళ్లారు. యర్రవరం సమీపంలోని పొలిమేరమ్మ తల్లి ఆలయం వద్ద ఒక ఇంటి నిర్మాణ పనుల కారణంగా తాగునీటి పైపులైను పగిలిపోయినట్టు గుర్తించారు. ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులకు ఈ విషయం చెప్పగా.. కాంట్రాక్టర్‌ను పంపించారు. మునిసిపల్ కమిషనర్ ప్రసాదరాజు, ఏఈ గణపతి సుబ్బారావు పర్యవేక్షణలో పైపులైన్ పునరుద్ధరణ పనులు చేపట్టారు. అక్కడ నెలకొన్న పరిస్థితినిబట్టి శుక్రవారం కూడా పట్టణ ప్రజలకు పూర్తిస్థాయిలో తాగునీరు సరఫరా అయ్యే సూచనలు కనిపించడంలేదు.
Updated Date - Aug 01 , 2025 | 12:47 AM